సచిన్‌ వస్తున్నాడని తెలియగానే మబ్బుల్లో తేలిపోయా: యశస్వి

ఇటీవల ఒమన్‌ పర్యటనకు వెళ్లే ముందు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌తో ముచ్చటించానని, అప్పుడు తాను పట్టరాని సంతోషంలో మునిగిపోయానని యువ బ్యాట్స్‌మన్‌ యశస్వి జైశ్వాల్‌ అన్నాడు...

Published : 08 Sep 2021 01:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల ఒమన్‌ పర్యటనకు వెళ్లే ముందు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌తో ముచ్చటించడంతో పట్టరాని సంతోషంలో మునిగిపోయానని యువ బ్యాట్స్‌మన్‌ యశస్వి జైశ్వాల్‌ అన్నాడు. తాజాగా అతడు ముంబయి క్రికెట్‌ జట్టుతో కలిసి ఒమన్‌ టీమ్‌తో వన్డే సిరీస్‌ ఆడేందుకు అక్కడికి వెళ్లాడు. ఈ క్రమంలోనే అతడు పలు కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. కాగా, ఈ పర్యటన తనకు ఐపీఎల్‌లో ఉపయోగపడుతుందని జైశ్వాల్‌ తెలిపాడు. ఒమన్‌లోని వాతావరణం.. యూఏఈలోలాగే ఉంటుందని, దాంతో అక్కడ ఆడిన అనుభవం ఇప్పుడు పనికొస్తుందని వివరించాడు. కొద్దికాలంగా తనకు సరైన క్రికెట్‌ మ్యాచ్‌లు లేవని, ఈ సిరీస్‌ మంచి ప్రాక్టీస్‌గా ఉపయోగపడిందని యువబ్యాట్స్‌మన్‌ సంబరపడ్డాడు.

అనంతరం తన ఆరాధ్య క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌తో ముచ్చటించడంపై మాట్లాడిన జైశ్వాల్‌ అది తనకు ప్రత్యేక సందర్భమని గుర్తుచేసుకున్నాడు. ‘నా ఫేవరెట్‌ క్రికెటర్‌ సచిన్‌. అయితే, ఒమన్‌ పర్యటనకు వెళ్లేముందు ఆయనతో మాట్లాడే అవకాశం దక్కింది. ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌ సచిన్‌తో ఓ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ విషయం తెలియగానే నేను గాల్లో తేలిపోయా. తర్వాత ఆయనతో కొంతసేపు మాట్లాడే అవకాశం కలిగింది. అప్పుడు సచిన్‌ ఎంతో వినయంగా ఉన్నారు. అలాగే నా ఆట గురించి తెలిసిన ఆయన నేను మెరుగుపర్చుకోవాల్సిన కొన్ని విషయాలను సూచించారు. అంతపెద్ద ఆటగాడు నా బ్యాటింగ్‌కు సలహాలివ్వడం అద్భుతంగా అనిపించింది. అది నాకో ప్రత్యేక సందర్భం. ఆయన చెప్పినట్లే నా నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని జైశ్వాల్‌ పేర్కొన్నాడు.

మరోవైపు గతేడాది ఐపీఎల్‌ 13వ సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ అతడిని తొలిసారి కొనుగోలు చేసింది. రూ.20లక్షల కనీస ధరకు చేజిక్కించుకుంది. దీంతో ఆ సీజన్‌లో యశస్వికి మూడు మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కింది. ఇక ఈ ఏడాది మే 4న అర్ధాంతరంగా నిలిచిపోయిన 14వ సీజన్‌ తొలిభాగంలోనూ యశస్వి మూడు మ్యాచ్‌లే ఆడాడు. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్ట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈనెల 19 నుంచి ప్రారంభమయ్యే మిగతా సీజన్‌లో రాణించి జట్టును విజయపథంలో నడిపించాలని అతడు ఆశిస్తున్నాడు. కాగా, ప్రస్తుతం అతడు రాజస్థాన్‌ టీమ్‌తో కలిసి దుబాయ్‌లోని ఓ హోటల్లో క్వారంటైన్‌లో ఉన్నాడు. మరోవైపు రాబోయే మెగా ఈవెంట్‌లో మంచి ప్రదర్శన చేసేందుకు ఆ జట్టు క్రికెట్‌ డైరెక్టర్‌ కుమార సంగక్కర నుంచి కూడా సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని