Rewind 2021 : టీమ్‌ఇండియా ఘోర పరాభవానికి ప్రతీకారం..చారిత్రక విజయం..!

ఆస్ట్రేలియా జట్టును దాని సొంత గడ్డమీదే ఢీకొట్టి విజయం సాధించడం సాధారణ విషయం కాదు..

Updated : 21 Dec 2021 14:17 IST

36 పరుగులకే ఆలౌట్‌.. గుర్తుందా..?

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: ఆస్ట్రేలియా జట్టును దాని సొంతగడ్డపైనే ఢీకొనడమంటే సాధారణ విషయం కాదు. అదీ టెస్టుల్లో. తొలి మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం పాలైనా.. తర్వాత అద్భుతంగా పుంజుకుని మరీ సిరీస్‌ కైవసం చేసుకుంది టీమ్‌ఇండియా. 2020 నవంబర్ 27 నుంచి 2021 జనవరి 19వ వరకూ ఆసీస్‌లో భారత్‌ సుదీర్ఘ పర్యటన సాగించింది. మూడు వన్డేలు, మూడు టీ20లతో పాటు నాలుగు టెస్టులు ఆడింది. వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకోగా.. టీ20, టెస్టు సిరీస్‌లను భారత్‌ కైవసం చేసుకుంది. అయితే, ఇక్కడ తొలి టెస్టులో ఘోర పరాభవం తర్వాత టీమ్‌ఇండియా తేరుకున్న విధానమే భావితరాలకు స్ఫూర్తిగా నిలిచింది. టెస్టుల్లో టీమ్‌ ఇండియా ఒక ఇన్నింగ్స్‌లో నమోదు చేసిన అత్యల్ప స్కోరు ఇదే. ఆ ఓటమికి నేటితో ఏడాది. మరోవైపు 2021 పూర్తవుతున్న నేపథ్యంలో ఆ చారిత్రక సిరీస్‌ విజయాన్ని మరోసారి గుర్తుచేసుకుందాం.

మొదటి గులాబీ టెస్టు.. ఘోర పరాభవం

తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించి మరీ ఓటమి కొని తెచ్చుకోవడమంటే ఘోర వైఫల్యమనే చెప్పాలి. ఆసీస్‌తో జరిగిన తొలి గులాబీ టెస్టులో టీమ్‌ఇండియా దారుణ పరిస్థితి ఇది. బౌలర్లు అద్భుతంగా రాణించినా.. బ్యాట్స్‌మెన్‌ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 244 పరుగులకు ఆలౌటవ్వగా.. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్‌కు 53 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. అయినా టీమ్‌ఇండియా మ్యాచ్‌ ఓడిపోవడమే ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయం. రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే కుప్పకూలి ఆసీస్‌కు 90 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. చివరికి ఆసీస్‌ రెండు గంటల్లో పని పూర్తి చేసి భారత్‌కు షాకిచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ ఒక్కరంటే ఒక్కరూ రెండంకెల స్కోర్‌ సాధించకపోవడం గమనార్హం. హేజిల్‌వుడ్ (5/8), కమిన్స్‌ (4/21) ధాటికి బ్యాటింగ్‌ లైనప్‌ కకావికలమైంది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

సెలవుపై కోహ్లీ.. రహానెకి కెప్టెన్సీ బాధ్యతలు 


 

మొదటి టెస్టులో ఘోర పరాజయం తర్వాత టీమ్‌ఇండియాకు ఎదురు దెబ్బ తగిలింది. కెప్టెన్‌ విరాట్ కోహ్లీ.. భార్య అనుష్క గర్భవతిగా ఉండటంతో అతడు పితృత్వపు సెలవు మీద భారత్‌కు తిరిగొచ్చాడు. కోహ్లీకి బదులు అజింక్య రహానె సారథ్య బాధ్యతలు స్వీకరించాడు. అసలే ఓటమితో ఉన్న భారత్‌కు కోహ్లీ లేకపోవడం పెద్దలోటు. అయితే రహానె నాయకత్వంలో భారత్‌ అద్భుతంగా పుంజుకుంది. తొలి టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ను 195 పరుగులకే కట్టడిచేసింది. అనంతరం రహానె (112) శతకంతో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో భారత్ 326 పరుగుల మంచి స్కోర్‌ సాధించింది. అనంతరం ఆస్ట్రేలియా 131 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించింది. ఈ క్రమంలోనే 200 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత విజయ లక్ష్యం కేవలం 70 పరుగులే ఉండగా.. రెండు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. అలా టీమ్‌ఇండియా తొలి టెస్టుకు ప్రతీకారం తీర్చుకోవడమే కాకుండా 1-1తో సిరీస్‌ సమం చేసింది.

ఓటమిని తప్పించిన విహారి, అశ్విన్‌..

ఇక మూడో టెస్టులో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌ చేసి 338 పరుగులు చేసింది. అనంతరం భారత్‌ 244 పరుగులకే పరిమితమై 94 పరుగుల వెనుకంజలో పడింది. ఆపై ఆసీస్‌ 312/6 స్కోర్‌ వద్ద రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. దీంతో భారత్‌ ముందు గెలుపు ధీమాతో 406 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో తడబడింది. చివరి రోజు 272/5 స్కోర్‌తో ఓటమి అంచున నిలబడింది. ఆటలో ఇంకా రెండు సెషన్లు మిగిలి ఉండటంతో అంతా ఆస్ట్రేలియా విజయం ఖాయమనుకున్నారు. ఈ దశలోనే అశ్విన్‌ (39; 128 బంతుల్లో 7x4), హనుమ విహారి (23; 161 బంతుల్లో 4x4) అసమాన పోరాటం చేశారు. ఆసీస్‌ బౌలర్లకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా 42.4 ఓవర్ల పాటు క్రీజులో నిలదొక్కుకున్నారు. చివరికి మ్యాచ్‌ను కోల్పోకుండా డ్రా చేశారు.

ఆసీస్‌ అడ్డ గబ్బా.. భారత్‌ బెదిరిందే లేదబ్బా..

ఇక అసలైన టెస్టు మ్యాచ్‌ గబ్బాలో జరిగింది. ఈ మైదానంలో ఆసీస్‌ గత మూడు దశాబ్దాల నుంచి ఓటమే రుచిచూడలేదు. దీంతో అంతా ఇక్కడ ఆస్ట్రేలియానే గెలిచి సిరీస్‌ కైవసం చేసుకుంటుందని అనుకున్నారు. అయితే, మన టీమ్‌ఇండియా సూపర్‌ విక్టరీ సాధించి రెండోసారి ఆసీస్‌ గడ్డపై చారిత్రక విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ పేస్‌ బౌలింగ్‌ను ఎదుర్కొని ఆ జట్టు నిర్దేశించిన 329 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది భారత్‌. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 369 పరుగులు చేయగా.. భారత్‌ కూడా తొలి ఇన్నింగ్స్‌లో దీటుగా ఆడి 336 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 294 పరుగులకు ఆలౌటై.. భారత్‌ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. యువ క్రికెటర్లు శుభ్‌మన్‌ గిల్‌ (91), రిషభ్‌ పంత్‌ (89).. సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ ఛెతేశ్వర్‌ పుజారా (56) సమయోచితంగా బ్యాటింగ్‌ చేయడంతో భారత్‌ విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇలా ఈ ఏడాది ఆరంభంలోనే ఆసీస్‌ను సొంత గడ్డపై ఓడించి భారత్‌ రికార్డు నెలకొల్పింది.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు