Yuvraj Singh: సచిన్‌తో కలిసి యువీ ప్రత్యేక ఇన్నింగ్స్‌

యువరాజ్‌సింగ్‌.. భారత క్రికెట్‌లో పరిచయం అక్కర్లేని పేరు. 1983 తర్వాత టీమ్‌ఇండియా రెండు ప్రపంచకప్‌లు గెలవడంలో కీలక పాత్ర పోషించిన మేటి ఆల్‌రౌండర్‌...

Updated : 12 Dec 2021 12:30 IST

ఇంగ్లాండ్‌పై గెలిచిన టెస్టు.. ఎప్పటికీ ప్రత్యేకమే..!

యువరాజ్‌సింగ్‌.. భారత క్రికెట్‌లో పరిచయం అక్కర్లేని పేరు. 1983 తర్వాత టీమ్‌ఇండియా రెండు ప్రపంచకప్‌లు గెలవడంలో కీలక పాత్ర పోషించిన మేటి ఆల్‌రౌండర్‌. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అసలుసిసలైన ఛాంపియన్‌గా పేరు తెచ్చుకున్నా.. టెస్టుల్లో మాత్రం అతడు ఆశించినంత మేర రాణించలేదు. దాంతో సుదీర్ఘ ఫార్మాట్‌లో సరైన గుర్తింపు దక్కలేదు. అయినా యువీ టెస్టు కెరీర్‌లో ఓ మధురజ్ఞాపకం దాగిఉంది. అది తన ఆరాధ్య క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌తో కలిసి మరీ మ్యాచ్‌ గెలిపించాడంటే ఎంత ప్రత్యేకమో చెప్పాల్సిన పనిలేదు. ఈరోజు యువీ 40వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో.. చాలా మందికి పెద్దగా గుర్తులేని ఆ ప్రత్యేక ఇన్నింగ్స్‌ మీ కోసం..

అది 2008 డిసెంబర్‌ నెల. రెండు టెస్టుల సిరీస్‌ కోసం ఇంగ్లాండ్‌ జట్టు భారత పర్యటనకు వచ్చింది. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా విజయం సాధించగా తర్వాత మొహాలీలో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో భారత్‌ 1-0 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. అయితే, తొలి టెస్టులో టీమ్‌ఇండియా గెలవడానికి ముఖ్య కారణం యువీనే. ఇంగ్లాండ్‌ పూర్తి ఆధిపత్యం చలాయించిన ఆ మ్యాచ్‌లో ఈ మాజీ ఆల్‌రౌండర్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో మాస్టర్‌ బ్లాస్టర్‌తో కలిసి ఓ మధురజ్ఞాపకాన్ని మిగుల్చుకున్నాడు.

తొలుత ధోనీ ఒక్కడే..

చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఆరంభించింది. ఓపెనర్‌ ఆండ్రూ స్ట్రాస్‌ (123; 233 బంతుల్లో 15x4) శతకంతో చెలరేగగా మరో ఓపెనర్‌ అలెస్టైర్‌ కుక్‌ (52; 116 బంతుల్లో 5x4) అర్ధ శతకంతో మెరిశాడు. చివర్లో మాట్‌ ప్రయర్‌ (53; 102 బంతుల్లో 1x4) సైతం హాఫ్‌ సెంచరీతో రాణించాడు. దీంతో ఇంగ్లాండ్‌ 316 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌ ఆరంభించిన భారత్‌ 241 పరుగులకు కుప్పకూలింది. టాప్‌ ఆర్డర్‌ మొత్తం విఫలమవ్వగా కెప్టెన్‌ ధోనీ (53; 82 బంతుల్లో 5x4) ఒక్కడే అర్ధశతకం సాధించాడు. హర్భజన్‌ (40; 58 బంతుల్లో 7x4) పరుగులతో ఫర్వాలేదనిపించాడు. చివరికి ఇంగ్లాండ్‌కు 75 పరుగుల కీలక ఆధిక్యం లభించింది.

మళ్లీ స్ట్రాస్‌ శతకం..

ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ 311 పరుగులు చేసిన ఇంగ్లాండ్‌.. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 75 పరుగులు కలుపుకొని టీమ్‌ఇండియా ముందు 387 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. స్ట్రాస్‌ (108; 244 బంతుల్లో 8x4) మరోసారి శతకంతో మెరవగా మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ పాల్‌ కాలింగ్‌వుడ్‌ (108; 250 బంతుల్లో 9x4) సైతం ఈసారి సెంచరీతో రాణించాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచారు. అయితే, ఓపెనర్లు గౌతమ్‌ గంభీర్‌ (66; 139 బంతుల్లో 7x4), వీరేందర్‌ సెహ్వాగ్‌ (83; 68 బంతుల్లో 11x4, 4x6) తొలి వికెట్‌కు 117 పరుగుల శతక భాగస్వామ్యం జోడించారు. వీరూ తొలి వికెట్‌గా వెనుదిరిగాక టీమ్‌ఇండియా వరుసగా ద్రవిడ్‌ (4), గంభీర్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ (26)ల వికెట్లు కోల్పోయింది. దీంతో 224/4 స్కోర్‌తో నిలిచి మ్యాచ్‌పై పట్టు కోల్పోయేలా కనిపించింది.

ఇంకో వికెట్‌ పడి ఉంటే..

సరిగ్గా అలాంటి సమయంలోనే ఆల్‌రౌండర్‌ యువీ బరిలోకి దిగాడు. తన ఆరాధ్య క్రికెటర్‌ సచిన్‌ (103 నాటౌట్‌; 196 బంతుల్లో 9x4)తో కలిసి యువరాజ్‌ (85 నాటౌట్‌; 131 బంతుల్లో 8x4, 1x6) చివరి వరకూ క్రీజులో పాతుకుపోయాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు అభేద్యంగా 163 పరుగులు జోడించి ఓడిపోతామనుకునే మ్యాచ్‌ను గెలిపించారు. వీరిద్దరిలో ఏ ఒక్కరు ఔటైనా మ్యాచ్‌ గమనమే మారిపోయేది. అలాంటి ఒత్తిడి పరిస్థితుల్లోనూ యువరాజ్‌.. సచిన్‌తో పాటు ఎంతో సంయమనంగా ఆడాడు. చివరికి మ్యాచ్‌ గెలిచాక తన మాస్టర్‌ను హత్తుకొని సంబరపడ్డాడు. కాగా, ఈ మాజీ ఛాంపియన్‌ టెస్టుల్లో 40 మ్యాచ్‌లే ఆడాడు. అందులో 3 శతకాలు, 11 అర్ధశతకాలే సాధించాడు. వాటన్నింటిలో ఈ ఇన్నింగ్స్‌ కూడా యువీకి ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఇలాంటి ఎన్నో గొప్ప విజయాలు అందించిన ఛాంపియన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని