INDvsENG: బుమ్రాతో అనవసరంగా పెట్టుకున్నామని ఇంగ్లాండ్‌ భావించొచ్చు: జహీర్

భారత్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్‌ జట్టు జస్ప్రిత్‌ బుమ్రాతో అనవసరంగా పెట్టుకున్నామని పశ్చాత్తాపం చెంది ఉంటుందని మాజీ పేసర్‌ జహీర్‌ఖాన్‌ అభిప్రాయపడ్డాడు...

Published : 22 Aug 2021 14:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్‌ జట్టు జస్ప్రిత్‌ బుమ్రాతో అనవసరంగా పెట్టుకున్నామని పశ్చాత్తాపం చెంది ఉంటుందని మాజీ పేసర్‌ జహీర్‌ఖాన్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా అతడు ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. బుమ్రాకు కోపమొస్తే ఇలాంటి ప్రదర్శనే చేస్తాడని అన్నాడు. అతడు ప్రపంచశ్రేణి బౌలర్‌ అయినా, తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ తీయలేదని, అలాంటిది అండర్సన్‌తో వివాదం జరిగాక రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత ప్రదర్శన చేశాడని జహీర్‌ గుర్తుచేశాడు.

కాగా, ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో మూడో రోజు అండర్సన్‌ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు బుమ్రా పలు షార్ట్‌పిచ్‌ బంతులేసి ఇబ్బందులకు గురిచేసిన సంగతి తెలిసిందే. దాంతో ఇంగ్లిష్‌ పేసర్‌ అతడితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం దాని పర్యావసానం నాలుగు, ఐదు రోజులపైనా పడింది. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసేటప్పుడు బుమ్రా(34), షమి(56) ఎనిమిదో వికెట్‌కు 89 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అప్పుడు కూడా మార్క్‌వుడ్‌  నోటికి పనిచెప్పాడు. అలా ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు పలు సందర్భాల్లో దురుసుగా ప్రవర్తించారు. అనంతరం చివరి రోజు ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌కు దిగిన వేళ బుమ్రా బంతితో మెరిశాడు. మూడు కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే బుమ్రా తన కోపాన్ని సరైన ఆటతీరుతో చూపించాడని జహీర్‌ పేర్కొన్నాడు. అంతకుముందు ఎదురైన అనుభవాలన్నీ అతడికి కసిని పెంచాయని చెప్పాడు. దాంతో బౌలింగ్‌లోనూ తన చాతుర్యం ప్రదర్శించి వికెట్లు తీసాడన్నాడు. చివరికి బుమ్రా ఆతిథ్య జట్టు ఓటమికి ప్రధాన కారణం అవడంతో ఇప్పుడా జట్టు పశ్చాత్తాపం చెంది ఉంటుందని మాజీ పేసర్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని