Cheteshwar Pujara: కెరీర్‌లో వందో టెస్ట్‌ మైలురాయి.. పుజారా గురించి పది ఆసక్తికర విశేషాలు!

టీమిండియా టెస్టు స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ ఛెతేశ్వర్‌ పుజారా తన అంతర్జాతీయ కెరీర్‌లో వందో టెస్ట్‌ మైలురాయిని చేరుకున్నాడు. బోర్డర్‌-గవాస్కర్‌ టోర్నీలో భాగంగా బుధవారం దిల్లీలో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌ పుజారాకు వందో టెస్టు.

Published : 15 Feb 2023 01:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్లబ్‌, కౌంటీ, రాష్ట్రం, దేశం..ప్రాతినిధ్యం వహించే జట్టు ఏదైనా.. ఆటపై నాకున్న నిబద్ధతలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని అంటున్నాడు టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్‌ ఛెతేశ్వర్‌ పుజారా (Cheteshwar Pujara). అభిమానులు ‘నయా వాల్‌’ అని పిలుచుకునే పుజారా క్రీజులో ఉన్నంతవరకు జట్టును గెలిపించాలనే లక్ష్యంతో ఉంటాడు. అలాంటి పుజారా తన కెరీర్‌లో వందో టెస్టు మ్యాచ్‌ ఆడబోతున్నాడు. బోర్డర్‌ - గావస్కర్‌ (Border Gavaskar Trophy) ట్రోఫీలో భాగంగా బుధవారం  నుంచి దిల్లీలో ఆస్ట్రేలియా (Australia)తో జరిగే మ్యాచ్‌ పుజారాకు వందో టెస్టు. ఈ సందర్భంగా పుజారా కెరీర్ గురించి పది ఆసక్తికర విషయాలు. 

  1. పుజారా 2010లో తన అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించాడు. బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం నాలుగు పరుగులే చేసినప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో 72 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 
  2. కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్న 13వ భారత ఆటగాడు పుజారా. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లలో వందో టెస్ట్‌ ఆడుతున్న రెండో ఆటగాడు. పుజారా కంటే ముందు విరాట్‌ కోహ్లీ (గతేడాది మార్చిలో శ్రీలంకతో) వందో టెస్ట్‌ ఆడాడు. 2012లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో ఆరో ఇన్నింగ్స్‌లో సెంచరీ (135), తొమ్మిదో ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ (206) చేశాడు పుజారా. 
  3. డిఫెన్స్‌ ఆడటంలో, స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కొవడంలో పుజారాది ప్రత్యేక శైలి. ఆటలో రాహుల్‌ ద్రవిడ్ ఆదర్శం అని చెప్పే పుజారా.. క్రీజులో పాతుకుపోయాడంటే ఔట్‌ చేసేందుకు బౌలర్లు శ్రమించాల్సిందే అని అతని స్టాట్స్‌ చెబుతుంటాయి. 
  4. 2018లో పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 103 బంతులను ఎదుర్కొని కేవలం 24 పరుగులే చేశాడు. 2021లో లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 35 బాల్స్‌ ఆడిన తర్వాత తొలి రన్‌ చేశాడు. అంతకముందు తొలి పరుగు కోసం రాహుల్‌ ద్రవిడ్ 40 బంతులు ఆడటం గమనార్హం. 2007లో మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇది జరిగింది.
  5. పుజారా ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో 104 మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో 99 టెస్టు మ్యాచ్‌లు, ఐదు వన్డేలు. అందులో 19 సెంచరీలు, 34 అర్ధ సెంచరీలు చేశాడు. టెస్ట్‌ మ్యాచుల్లో 44.15 సగటుతో 7021 పరుగులు చేశాడు. ఐదు వన్డేలే ఆడిన పుజారా పెద్దగా పరుగులు చేయలేకపోయాడు. 
  6. 2018 - 19లో ఆస్ట్రేలియాతో  జరిగిన బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ తన కెరీర్‌లో అత్యుత్తమైనదిగా పుజారా చెబుతాడు. ఈ సిరీస్‌లో అద్భుతమైన ఆటతీరుతో 521 పరుగులు చేసి నాలుగు టెస్టుల సిరీస్‌ని భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్‌ విజయాన్ని టీమిండియా ‘పుజారా డ్యాన్స్‌’ చేస్తూ సెలబ్రేట్‌ చేసుకోవడం అప్పట్లో వైరల్‌గా మారింది.
  7. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్ జట్లతో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లలో పుజారా తన కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్‌ మ్యాచ్‌లకు తన ఎంపిక ఎంత అవసరమో చెప్పేందుకు ఆ జట్లపై నమోదు చేసిన గణాంకాలే నిదర్శనం. 2013 - 15 మధ్య 22 ఇన్నింగ్స్‌లో ఆడిన పుజారా ఒక డబుల్‌ సెంచరీ, రెండు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు చేశాడు. 
  8. పుజారా స్ట్రైక్‌ రేట్‌పై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. వాటన్నింటికీ తన ఆటతీరుతో సమాధానం చెబుతాడు. సాధారణంగా టెస్టుల్లో కొత్త బంతిని ఎదుర్కొని పరుగులు రాబట్టడం బ్యాటర్లకు సవాల్‌గా మారుతుంది. టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్‌గా పుజారా క్రీజులో నిలదొక్కుకొని కొత్త బంతిని ఎక్కువ సమయం ఆడతాడు. దీంతో తర్వాత క్రీజులోకి వచ్చే బ్యాటర్లకు సులువుగా పరుగులు చేయగలరు అని విశ్లేషకులు చెబుతుంటారు. 
  9. ప్రతి ఆటగాడికి కెరీర్‌లో గడ్డు పరిస్థితులు ఉన్నట్లుగానే పుజారా 2019-2022 మధ్య తీవ్రమైన ఫామ్‌లేమిని ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో 48 ఇన్నింగ్స్‌లు ఆడి ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. దీంతో సెలెక్టర్లు పక్కన పెట్టేశారు. తిరిగి ఫామ్‌లోకి వచ్చేందుకు ఇంగ్లాండ్‌లో కౌంటీల్లో ఆడి, ఆరు ఇన్నింగ్స్‌లో నాలుగు సెంచరీలు చేశాడు. వాటిలో రెండు డబుల్‌ సెంచరీలున్నాయి.
  10. గతేడాది డిసెంబరులో బంగ్లాదేశ్‌తో జరిగిన భారత జట్టుకు తిరిగి ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి టెస్టుల్లో తను ఎంత స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ అనేది మరోసారి రుజువు చేశాడు. గత వారం నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఏడు పరుగులే చేశాడు.

బుధవారం దిల్లీ వేదికగా ఆడబోయే వందో మ్యాచ్‌లో వంద కొట్టాలని ఆశిద్దాం. ఆల్‌ ది బెస్ట్‌ పుజారా.. మరోసారి మీ టీమ్‌ అంతా.. నీ  స్పెషల్‌ డ్యాన్స్‌ చేయాలని కోరుకుంటున్నాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని