Rafael Nadal : నాదల్‌ మరో అడుగు

21వ టైటిల్‌తో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ విజయాల వీరుడిగా చరిత్ర సృష్టించాలనే లక్ష్యంతో ఉన్న నాదల్‌ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఈ మాజీ నంబర్‌వన్‌ మూడో రౌండ్‌ చేరాడు. మహిళల సింగిల్స్‌లో టాప్‌ సీడ్‌

Updated : 20 Jan 2022 07:29 IST

 మూడో రౌండ్లో ప్రవేశం

జ్వెరెవ్‌, బార్టీ, ఒసాక కూడా

హర్కాజ్‌, బెన్సిచ్‌కు షాక్‌

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

21వ టైటిల్‌తో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ విజయాల వీరుడిగా చరిత్ర సృష్టించాలనే లక్ష్యంతో ఉన్న నాదల్‌ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఈ మాజీ నంబర్‌వన్‌ మూడో రౌండ్‌ చేరాడు. మహిళల సింగిల్స్‌లో టాప్‌ సీడ్‌ బార్టీ, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఒసాక కూడా ముందంజ వేశారు. మరోవైపు టోక్యో ఒలింపిక్‌ ఛాంపియన్‌ బెన్సిచ్‌కు షాక్‌ తగిలింది.

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో నాదల్‌ (స్పెయిన్‌) జోరు కొనసాగుతోంది. బుధవారం పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్లో ఈ ఆరో సీడ్‌ ఆటగాడు 6-2, 6-3, 6-4తో యానిక్‌ (జర్మనీ)పై విజయం సాధించాడు. 35 ఏళ్ల నాదల్‌కు ప్రత్యర్థి నుంచి చివరి సెట్‌లో మినహా పెద్దగా పోటీ ఎదురు కాలేదు. తొలి సెట్‌ ఆరంభంలో ఆటగాళ్లిద్దరూ చెరో రెండు గేమ్‌లు గెలిచే సరికి పోరు హోరాహోరీగా సాగుతుందనిపించింది. కానీ విన్నర్లతో చెలరేగిన నాదల్‌ వరుసగా నాలుగు గేమ్‌లు గెలిచి సెట్‌ దక్కించుకున్నాడు. రెండో సెట్లో కూడా అదే దృశ్యం పునరావృతమైంది. తొలి ఆరు గేమ్‌లు ముగిసే సరికి 3-3తో స్కోరు సమమైంది. కానీ అక్కడి నుంచి నాదల్‌ దూకుడు ముందు ప్రత్యర్థి తేలిపోయాడు. వరుసగా మూడు గేమ్‌లు గెలిచిన అతను సెట్‌ ఖాతాలో వేసుకున్నాడు. మూడో సెట్లో మొదటి నుంచే నాదల్‌ ఆధిపత్యం చలాయించాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసి.. తన సర్వీస్‌ నిలబెట్టుకున్న అతను 3-1తో సులువుగా గెలిచేలా కనిపించాడు. కానీ యానిక్‌ ప్రతిఘటించడంతో అతని విజయం కాస్త ఆలస్యమైంది. మరో మ్యాచ్‌లో మూడో సీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 6-4, 6-4, 6-0తో మిల్మాన్‌ (ఆస్ట్రేలియా)పై నెగ్గాడు. ఏడో సీడ్‌ బెరెట్టిని, గారిన్‌ రెండో రౌండ్లో పోరాడి గెలిచారు. షపోవలోవ్‌, మోన్‌ఫిల్స్‌, కచనోవ్‌ కూడా ముందంజ వేశారు. మరోవైపు పదో సీడ్‌ హర్కాజ్‌ (పోలెండ్‌) 4-6, 2-6, 3-6తో మనారినో (ఫ్రాన్స్‌) చేతిలో ఓడాడు.

టాప్‌ సీడ్‌ జోరు: సొంతగడ్డపై టైటిల్‌ వేట కొనసాగిస్తున్న టాప్‌ సీడ్‌ ఆష్లీ బార్టీ అలవోకగా మూడో రౌండ్‌ చేరింది. మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్లో ఆమె 6-1, 6-1తో లూసియా (ఇటలీ)ని చిత్తుచేసింది. మరో మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఒసాక (జపాన్‌) 6-0, 6-4తో మాడిసన్‌ (అమెరికా)పై గెలిచింది. నాలుగో సీడ్‌ క్రెజికోవా (చెక్‌ రిపబ్లిక్‌), అయిదో సీడ్‌ సకారి (గ్రీస్‌), ఎనిమిదో సీడ్‌ బడోసా (స్పెయిన్‌), స్వితోలిన (ఉక్రెయిన్‌), అజరెంక (బెలారస్‌) కూడా రెండో రౌండ్‌ దాటారు. టోక్యో ఒలింపిక్‌ పసిడి విజేత బెన్సిచ్‌ (స్విట్జర్లాండ్‌) పోరాటం ముగిసింది. ఆమె 2-6, 5-7తో అనిసిమోవ (అమెరికా) చేతిలో ఓడింది.

సానియా జోడీ ఓటమి: మహిళల డబుల్స్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి సానియా మీర్జా జోడీ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. 12వ సీడ్‌ సానియా- నదియా (ఉక్రెయిన్‌) జంట 4-6, 6-7 (5-7)తో జువాన్‌- జిదాన్సెక్‌ (స్లోవేనియా) చేతిలో ఓడింది. తొలి సెట్‌ తొమ్మిదో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసిన సానియా జోడీ 4-5తో పుంజుకునేలా కనిపించింది. కానీ అనవసర తప్పిదాలతో తర్వాతి గేమ్‌ను చేజార్చుకుని సెట్‌ కోల్పోయింది. ఇక రెండో సెట్లో సానియా ఓ దశలో 5-3తో ఆధిక్యం సాధించింది. తర్వాత తడబడింది. టైబ్రేకర్‌లో తలవంచింది. మరోవైపు పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్లో బోపన్న- రోజర్‌ (ఫ్రాన్స్‌) జంట 6-3, 6-7 (2-7), 2-6తో క్రిస్టోఫర్‌ (ఇండోనేషియా)- ట్రీట్‌ (ఫిలిప్పీన్స్‌) చేతిలో పరాజయం పాలైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని