IND vs ENG : మొత్తం మారిపోయింది

బ్యాటింగ్‌లో గొప్పగా పోరాడారు. బౌలింగ్‌లోనూ రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. బ్యాటుతో రెండో ఇన్నింగ్స్‌లోనూ బాగానే పోరాడారు. ప్రత్యర్థి ముందు 378 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో, అంతకుముందు చాలా మ్యాచ్‌ల్లో బౌలర్ల ప్రదర్శన ప్రకారం చూస్తే..

Updated : 05 Jul 2022 06:52 IST

ఛేదనలో ఇంగ్లాండ్‌ దూకుడు

లక్ష్యం 378..

నాలుగో రోజు ఆఖరికి 259/3

రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 245

బర్మింగ్‌హామ్‌

బ్యాటింగ్‌లో గొప్పగా పోరాడారు. బౌలింగ్‌లోనూ రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. బ్యాటుతో రెండో ఇన్నింగ్స్‌లోనూ బాగానే పోరాడారు. ప్రత్యర్థి ముందు 378 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో, అంతకుముందు చాలా మ్యాచ్‌ల్లో బౌలర్ల ప్రదర్శన ప్రకారం చూస్తే.. ఈ లక్ష్యాన్ని కాపాడుకోవడం, మ్యాచ్‌ నెగ్గడం అంత కష్టమేమీ కాదనిపించింది. 3-1తో సగర్వంగా సిరీస్‌ అందుకోవడానికి రంగం సిద్ధమైనట్లే కనిపించింది. కానీ అయిదో టెస్టులో మూడున్నర రోజులు ఆధిపత్యం చలాయించిన భారత్‌.. సగం రోజు పట్టు విడిచింది. ఓపెనర్లు వేసిన పునాదిని ఉపయోగించుకుని జో రూట్‌, బెయిర్‌స్టో భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో ఛేదనలో ఇంగ్లాండ్‌ దూసుకెళ్తోంది. ఆఖరి రోజు బౌలర్లు అద్భుత ప్రదర్శన చేస్తే తప్ప సిరీస్‌ను డ్రాగా ముగించాల్సిందే

ఇంగ్లాండ్‌తో అయిదో టెస్టులో తొలి మూడు రోజులు చక్కటి ప్రదర్శనతో సిరీస్‌ విజయం దిశగా వడి వడిగా అడుగులేసిన భారత్‌.. మ్యాచ్‌లో అనూహ్యంగా వెనుకబడింది. ఇంగ్లిష్‌ జట్టు ముందు 378 పరుగుల భారీ  లక్ష్యం నిలిపినప్పటికీ.. భారత్‌కు గెలుపు కష్టసాధ్యంగానే కనిపిస్తోంది. జో రూట్‌ (76 బ్యాటింగ్‌; 112 బంతుల్లో 9×4), జానీ బెయిర్‌స్టో (72 బ్యాటింగ్‌; 87 బంతుల్లో 8×4, 1×6) అద్భుత పోరాటంతో ఆతిథ్య జట్టు విజయం వైపు పరుగులు పెడుతోంది. ఓపెనర్లు అలెక్స్‌ లీస్‌ (56; 65 బంతుల్లో 8×4), జాక్‌ క్రాలీ (46; 76 బంతుల్లో 7×4) కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. 7 వికెట్లు చేతిలో ఉన్న ఇంగ్లాండ్‌.. చివరి రోజు విజయానికి ఇంకో 119 పరుగులు చేయాలి. నిరుడు అసంపూర్తిగా మిగిలిపోయిన సిరీస్‌లో భారత్‌ 2-1 ఆధిక్యంలో నిలిచిన సంగతి తెలిసిందే.

ఆ కొన్ని నిమిషాల్లో..: ఇటీవలే న్యూజిలాండ్‌పై పెద్ద లక్ష్యాలను సునాయాసంగా ఛేదించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది ఇంగ్లాండ్‌. కాబట్టి ఆ జట్టు ముందు 300కు అటు ఇటుగా లక్ష్యాన్ని నిర్దేశిస్తే కష్టమని తెలుసు. అందుకే 400 పైచిలుకు లక్ష్యం కోసం భారత్‌ కష్టపడ్డా ఫలితం లేకపోయింది. అయినప్పటికీ నాలుగో ఇన్నింగ్స్‌లో 378 పరుగుల ఛేదన అంత తేలిక కాదు కాబట్టి ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభమవుతున్నపుడు భారత ఆటగాళ్లతో పాటు అభిమానులూ ఉత్సాహంగా కనిపించారు. కానీ ఓపెనర్లు లీస్‌, క్రాలీ ఆ ఉత్సాహంపై నీళ్లు చల్లారు. స్టోక్స్‌ కెప్టెన్‌ అయ్యాక ఆచితూచి ఆడడం అనే మాటే మరిచిపోయి దూకుడుకు మారుపేరుగా మారిన ఇంగ్లిష్‌ జట్టు.. సోమవారం కూడా అదే శైలిని అనుసరించింది. ఓపెనర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ భారత బౌలర్ల లయను దెబ్బ తీసే ప్రయత్నం చేశారు. బుమ్రా సహా అందరు బౌలర్లనూ ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటూ స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు. దీంతో 9 ఓవర్లకే స్కోరు 50కి చేరుకుంది. 20వ ఓవర్లోనే వంద దాటేసింది. వన్డే తరహాలో ఆడిన లీస్‌ 44 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. వేగంగా లక్ష్యం 100 పరుగులు తగ్గిపోవడంతో ఇంగ్లాండ్‌లో గెలుపు ఆశలు చిగురించాయి. భారత్‌లో ఆందోళన మొదలైంది. అయితే ఈ మ్యాచ్‌లో జట్టును ముందుండి నడిపిస్తున్న బుమ్రా.. మరోసారి ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు. చక్కటి బంతితో క్రాలీని బోల్తా కొటిస్టూ బౌల్డ్‌ చేశాడు. అదే స్కోరు వద్ద, తన తర్వాతి ఓవర్లో పోప్‌ (0)ను వికెట్‌ కీపర్‌ క్యాచ్‌తో పెవిలియన్‌ చేర్చాడు. ఆ వెంటనే లీస్‌ సమన్వయ లోపం కారణంగా రనౌటవడంతో ఇంగ్లాండ్‌ 107/0 నుంచి 109/3కి చేరుకుంది. కొన్ని నిమిషాల్లో భారత్‌ తిరిగి పోటీలోకి వచ్చి మ్యాచ్‌పై పట్టు చిక్కించుకున్నట్లు కనిపించింది. కానీ ఈ ఊపును రూట్‌, బెయిర్‌స్టో కొనసాగనివ్వలేదు. క్రీజులో కుదురుకోవడానికి కొంచెం కష్టపడ్డప్పటికీ.. తర్వాత బెయిర్‌స్టోకు ఎదురులేకపోయింది. 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సిరాజ్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో అతనిచ్చిన క్యాచ్‌ను విహారి అందుకోలేకపోయాడు. తర్వాత పంత్‌ కూడా కాస్త కష్టమైన క్యాచ్‌ను చేజార్చాడు. ఈ అవకాశాల్ని ఉపయోగించుకున్న బెయిర్‌స్టో చెలరేగిపోయాడు. మరో ఎండ్‌లో రూట్‌ అలవోకగా బ్యాటింగ్‌ చేశాడు. దీంతో చూస్తుండగానే.. స్కోరు 150, 200, 250.. దాటేసింది.


 

భాగస్వామ్యాల్లేక..: అంతకుముందు నాలుగో రోజు ఉదయం 125/3తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్‌.. ఒక దశలో 400 పైచిలుకు ఆధిక్యాన్ని సులువుగా సాధించేలా కనిపించింది. కానీ తొలి ఇన్నింగ్స్‌లో మాదిరి పోరాటం కొరవడడం, సోమవారం ఒక్క చెప్పుకోదగ్గ భాగస్వామ్యం కూడా లేకపోవడంతో ఆధిక్యం 377కు పరిమితం అయింది. మూడో రోజు 50 పరుగులతో ఉన్న పుజారా.. అరగంట పాటు ఇంగ్లిష్‌ బౌలర్లను బాగానే కాచుకున్నాడు. 30 పరుగులతో బ్యాటింగ్‌ కొనసాగించిన పంత్‌ తన శైలిలో కొంచెం దూకుడుగానే ఆడాడు. దీంతో స్కోరు 150 దాటింది. ఈ దశలో పుజారా (66; 168 బంతుల్లో 8×4).. బ్రాడ్‌ (2/58) బౌలింగ్‌లో షాట్‌ ఆడబోయి బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లో క్రాలీకి దొరికిపోయాడు. పంత్‌తో అతను నాలుగో వికెట్‌కు 78 పరుగులు జోడించాడు. తర్వాత పంత్‌కు జత కలిసిన శ్రేయస్‌.. తొలి ఇన్నింగ్స్‌లో మాదిరే ఆత్మవిశ్వాసంతో ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. మూడు ఫోర్లు కొట్టి ఊపు మీద కనిపించాడు. భారత్‌ 186/4తో మెరుగైన స్థితికి చేరుకుంది. కానీ శ్రేయస్‌ షార్ట్‌ పిచ్‌ బలహీతను ఇంగ్లాండ్‌ మరోసారి సొమ్ము చేసుకుంది. పాట్స్‌ బౌలింగ్‌లో అతను షార్ట్‌ బంతికి పేలవ షాట్‌ ఆడి అండర్సన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. పంత్‌కు జడేజా తోడవడంతో మరో పెద్ద భాగస్వామ్యం ఆశించింది భారత్‌. కానీ కాసేపటికే పంత్‌ (57; 86 బంతుల్లో 8×4) కథ ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో తన బౌలింగ్‌ను తుత్తునియలు చేసిన చేసిన అతడిపై లీచ్‌ (1/28) ప్రతీకారం తీర్చుకున్నాడు. శార్దూల్‌ (4)ను పాట్స్‌ ఎంతోసేపు నిలవనీయలేదు. షమి (13)తో కలిసి జడేజా విలువైన పరుగులు జోడించడంతో ఆధిక్యం 350 దాటింది. కానీ ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ స్టోక్స్‌ బంతి అందుకుని భారత్‌ పోరాటం ఎక్కువ సేపు కొనసాగకుండా చేశాడు. అతను  స్వల్ప వ్యవధిలో షమి, జడేజా, బుమ్రా (7)లను ఔట్‌ చేసి ఇన్నింగ్స్‌కు తెరదించాడు.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 416; ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 284
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: శుభ్‌మన్‌ (సి) క్రాలీ (బి) అండర్సన్‌ 4; పుజారా (సి) లీస్‌ (బి) బ్రాడ్‌ 66; విహారి (సి) బెయిర్‌స్టో (బి) బ్రాడ్‌ 11; కోహ్లి (సి) రూట్‌ (బి) స్టోక్స్‌ 20; పంత్‌ (సి) రూట్‌ (బి) లీచ్‌ 57; శ్రేయస్‌ (సి) అండర్సన్‌ (బి) పాట్స్‌ 19; జడేజా (బి) స్టోక్స్‌ 23; శార్దూల్‌ (సి) క్రాలీ (బి) పాట్స్‌ 4; షమి (సి) లీస్‌ (బి) స్టోక్స్‌ 13; బుమ్రా (సి) క్రాలీ (బి) స్టోక్స్‌ 7; సిరాజ్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 19 మొత్తం: (81.5 ఓవర్లలో ఆలౌట్‌) 245; వికెట్ల పతనం: 1-4, 2-43, 3-75, 4-153, 5-190, 6-198, 7-207, 8-230, 9-236; బౌలింగ్‌: అండర్సన్‌ 19-5-46-1; బ్రాడ్‌ 16-1-58-2; పాట్స్‌ 17-3-50-2; లీచ్‌ 12-1-28-1; స్టోక్స్‌ 11.5-0-33-4; రూట్‌ 6-1-17-0
ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: లీస్‌ రనౌట్‌ 56; క్రాలీ (బి) బుమ్రా 46; పోప్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 0; రూట్‌ బ్యాటింగ్‌ 76; బెయిర్‌స్టో బ్యాటింగ్‌ 72; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (57 ఓవర్లలో 3 వికెట్లకు) 259; వికెట్ల పతనం: 1-107, 2-107, 3-109; బౌలింగ్‌: బుమ్రా 13-0-53-2; షమి 12-2-49-0; జడేజా 15-2-53-0; సిరాజ్‌ 10-0-64-0; శార్దూల్‌ ఠాకూర్‌ 7-0-33-0


అవన్నీ ఆటలో భాగం: బెయిర్‌స్టో

భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీతో మాటల యుద్ధం గురించి ఇంగ్లాండ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ జానీ బెయిర్‌స్టో ఆసక్తికర రీతిలో స్పందించాడు. మైదానంలో పరిస్థితి కొంచెం తీవ్రంగానే కనిపించినా.. ఈ విషయాన్ని తేలిగ్గానే తీసుకోవాలన్నట్లు అతను మాట్లాడాడు. ‘‘అక్కడ పెద్దగా జరిగిందేమీ లేదు. కోహ్లితో నేను పదేళ్లుగా కలిసి ఆడుతున్నా. మా మధ్య ఎన్నో పోరాటాలు జరిగాయి. మేమిద్దరం మైదానంలో ఒక తీవ్రతతో పోటీ పడతాం. ఈ పోటీ మా నుంచి అత్యుత్తమ ఆటతీరును బయటికి తెస్తుంది. ఇలాంటివన్నీ ఆటలో భాగం’’ అని బెయిర్‌స్టో అన్నాడు. భారత్‌-ఇంగ్లాండ్‌ చివరి టెస్టు మూడో రోజు ఆటలో కోహ్లి, బెయిర్‌స్టోల మధ్య మాటల యుద్ధం ఒక దశలో అదుపు తప్పి అంపైర్లు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. రిషబ్‌ పంత్‌తో సైతం బెయిర్‌స్టో కాస్త గొడవ నడిచింది.


బుమ్రా రికార్డు

ఇంగ్లాండ్‌లో ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా జస్‌ప్రీత్‌ బుమ్రా రికార్డులకెక్కాడు. గత ఏడాది నాలుగో టెస్టు తర్వాత ఆగి, ఇప్పుడు ముగియబోతున్న అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే అతను 21 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో 2014లో భువనేశ్వర్‌ 5 టెస్టుల సిరీస్‌లో 19 వికెట్లతో నెలకొల్పిన రికార్డును బుమ్రా అధిగమించి అగ్రస్థానానికి చేరాడు. జహీర్‌ ఖాన్‌ (2007లో 3 టెస్టుల్లో 18 వికెట్లు), ఇషాంత్‌ శర్మ (2018లో 5 టెస్టుల్లో 18 వికెట్లు), సుభాష్‌ గుప్తే (1959లో 5 టెస్టుల్లో 17 వికెట్లు) వరుసగా 3, 4, 5 స్థానాల్లో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని