Ravi Shastri : ప్యాట్‌.! విధ్వంసం సృష్టించినందుకు థ్యాంక్స్‌ : రవిశాస్త్రి

తన విధ్వంసకర ఆటతీరుతో కోల్‌కతా జట్టుకు ఘన విజయాన్ని అందించిన ప్యాట్ కమ్మిన్స్‌ను టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్‌ రవిశాస్త్రి అభినందించాడు...

Published : 08 Apr 2022 01:45 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : విధ్వంసకర ఆటతీరుతో కోల్‌కతా జట్టుకు ఘన విజయాన్ని అందించిన ప్యాట్ కమ్మిన్స్‌ను టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్‌ రవిశాస్త్రి అభినందించాడు. అప్పటి వరకు సాఫీగా సాగుతున్న మ్యాచ్‌లో.. కమ్మిన్స్‌ క్రీజులోకి వచ్చాక అల్లకల్లోలం సృష్టించాడని పేర్కొన్నాడు.  

‘ఒకే ఓవర్లో 35 పరుగులు రాబట్టడం నమ్మశక్యంగా లేదు. ప్రత్యర్థి జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నప్పుడు.. ఇలాంటి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఒక్క ఓవర్లోనే మ్యాచ్ పూర్తవుతుందని ఎవరైనా ఊహించగలమా.? చాలా కాలం తర్వాత ఓ అద్భుతమైన మ్యాచును చూశాం. ఏదేమైనా సాఫీగా సాగుతున్న మ్యాచులో విధ్వంసం సృష్టించిన ప్యాట్‌కు అభినందనలు’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

‘ఈ మ్యాచులో ప్యాట్ కమ్మిన్స్‌ స్ట్రైక్‌ రేట్ చూడండి. అతడు పక్కా ప్లాన్‌తోనే క్రీజులోకి వచ్చాడు. బౌలింగ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో 49 పరుగులు ఇచ్చాడు. వాటన్నింటినీ తిరిగి రాబట్టాలనే ఉద్దేశంతో ఎదురుదాడి చేశాడు. అందుకే, క్రీజులోకి వచ్చిన వెంటనే భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు’ అని రవిశాస్త్రి వివరించాడు.

కోల్‌కతా విజయానికి 41 బంతుల్లో 61 పరుగులు కావాల్సిన సమయంలో క్రీజులోకి వచ్చిన కమ్మిన్స్‌ చెలరేగిపోయాడు. 14 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకుని కేఎల్ రాహుల్ రికార్డును సమం చేశాడు. ఆ తర్వాతి బంతిని సిక్సర్‌గా మలిచి కోల్‌కతా జట్టుకు ఘన విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డేనియల్‌ సామ్స్‌ వేసిన 16వ ఓవర్లో నాలుగు సిక్సులు, రెండు ఫోర్లు సహా 35 పరుగులు రాబట్టడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని