PV Sindhu : మనది కాని రోజు అంతే.. కష్టపడినా అనుకున్న ఫలితం దక్కదు: పీవీ సింధు

కామన్వెల్త్‌ గేమ్స్‌లో మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో భారత బ్యాడ్మింటన్‌ జట్టు  రజత పతకంతో సరిపెట్టుకుంది. అయితే మలేషియాతో జరిగిన  ఫైనల్‌లో తెలుగు తేజం, ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు మాత్రమే...

Updated : 03 Aug 2022 13:00 IST

వ్యక్తిగత పోటీలపై దృష్టి పెడుతున్నామన్న స్టార్‌ షట్లర్

(ఫొటో సోర్స్‌: పీవీ సింధు ట్విటర్)

ఇంటర్నెట్ డెస్క్‌: కామన్వెల్త్‌ గేమ్స్‌లో మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో భారత బ్యాడ్మింటన్‌ జట్టు  రజత పతకంతో సరిపెట్టుకుంది. అయితే మలేషియాతో జరిగిన  ఫైనల్‌లో తెలుగు తేజం, ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు మాత్రమే విజయం సాధించడం విశేషం. సిల్వర్‌ మెడల్‌ గెలుచుకున్న తర్వాత పీవీ సింధు మాట్లాడుతూ.. ‘‘మలేషియా సులువైన ప్రత్యర్థేమీ కాదు. ఫైనల్‌లో ప్రతి మ్యాచూ కీలకమే. జట్టుగా మేమంతా బాగానే ఆడాం. నేను గెలిచి పాయింట్‌ ఇవ్వడం ఆనందంగానే ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తూ బంగారు పతకం సాధించలేకపోయాం. ఇంత కష్టపడినా మనదికాని రోజున ఏదీ కలిసిరాదు. అయితే దీని నుంచి బయటకు వచ్చి వ్యక్తిగత పోటీలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కసరత్తు చేస్తున్నాం. వ్యక్తిగత పోటీల్లో వందశాతం ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. అయితే ఇదంతా ఈజీ కాదు. క్వార్టర్‌ఫైనల్స్‌లో మలేషియా క్రీడాకారిణితో ఆడాల్సి వస్తుంది. అక్కడా గెలిస్తే సింగపూర్‌ ప్లేయర్‌తో తలపడాలి. కాబట్టి వ్యక్తిగత రౌండ్‌ సులువుగా ఉండదని అనుకుంటున్నా’’ అని పీవీ సింధు వెల్లడించింది. 

మలేసియాతో ఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ 1-3తో ఓటమి పాలైంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌- చిరాగ్‌ జోడీ 18-21, 15-21తో ఫాంగ్‌- వూయి చేతిలో ఓడిపోయింది. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు 22-20, 21-17తో జిన్‌ వీపై గెలిచి జట్టును రేసులో నిలిపింది. తర్వాత పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ 19-21, 21-6, 16-21తో జి యాంగ్‌ చేతిలో ఓటమి పాలవడంతో భారత్‌ మళ్లీ 1-2తో వెనుకబడింది. కీలక మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి గోపీచంద్‌-ట్రెసా జాలీ జోడీ 18-21, 17-21తో తిన్నయ-పియర్లీ జంట చేతిలో పరాజయం పాలవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని