
Team India : సీనియర్లను పక్కన పెట్టాలి.. యువ ఆటగాళ్లకు అవకాశమివ్వాలి : సంజయ్ మంజ్రేకర్
ఇంటర్నెట్ డెస్క్ : దక్షిణాఫ్రికా చేతిలో టీమ్‌ఇండియా ఘోర పరాజయం పాలు కావడాన్ని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ విమర్శించాడు. జట్టు ఎంపికలోనే లోపాలున్నాయని అభిప్రాయపడ్డాడు. ఫామ్‌లేమితో సతమతమవుతున్న సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టి.. యువ ఆటగాళ్లకు అవకాశాలివ్వాలని సూచించాడు.
‘దక్షిణాఫ్రికా పర్యటనకు సంబంధించి.. భారత జట్టు ఎంపికలోనే పెద్ద లోపముంది. చాలా మంది అనుభవం, ఫామ్‌లో లేని ఆటగాళ్లను ఎంపిక చేశారు. సీనియర్ ఆటగాళ్లు కూడా దారుణంగా విఫలమయ్యారు. మిడిల్ ఆర్డర్‌లో సత్తా చాటగలిగే నాణ్యమైన ఆటగాళ్లను సిద్ధం చేయాలి. వన్డే ఫార్మాట్‌లో ఓపెనింగ్ చేయడం చాలా సులభం. ఓపెనర్లు శతకాలు, అర్ధ శతకాలు నమోదు చేసినా.. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే ఆటగాళ్లపైనే జట్టు విజయం ఆధారపడి ఉంటుంది. దక్షిణాఫ్రికా పర్యటనలో లోపించింది అదే. మెరుగైన ఆరంభాలు లభించినా.. స్వల్ప వ్యవధిలో కీలక వికెట్లు కోల్పోవడంతో భారత్ వెనుకబడిపోయింది’ అని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.
‘టీమ్ఇండియా బౌలింగ్ విభాగంలో కూడా మార్పులు చేయాల్సి ఉంది. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మునుపటి లయను అందుకోవడం దాదాపు కష్టమే అనిపిస్తోంది. అతడి స్థానంలో దీపక్ చాహర్‌ని పూర్తి స్థాయి ఆటగాడిగా జట్టులోకి తీసుకోవచ్చు. మూడో వన్డేలో జానెమన్ మలన్‌ని ఔట్ చేసేందుకు దీపక్ వేసిన ఆ ఒక్క బంతి చాలు.. అతడు ఎంత నాణ్యమైన బౌలరో చెప్పేందుకు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటాడు. ఆ ఒక్క మ్యాచ్‌లోనే రెండు వికెట్లు సహా 54 పరుగులు చేశాడు’ అని మంజ్రేకర్ పేర్కొన్నాడు.
అశ్విన్‌కి ప్రత్యామ్నాయం వెతుక్కోవాలి
‘సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విషయంలో కూడా భారత్ ప్రత్యామ్నాయం వెతుక్కోవాల్సి ఉంది. చాలా ఏళ్ల తర్వాత అనివార్య కారణాలతో అతడికి తుది జట్టులో స్థానం దక్కింది. రెండు మ్యాచులు ఆడినా.. పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. యుజ్వేంద్ర చాహల్ కూడా అంచనాలను అందుకోలేకపోయాడు. యువ ఆటగాడు ప్రసిద్ధ్ కృష్ణకు మరిన్ని అవకాశాలు కల్పించాలి. వన్డే ఫార్మాట్‌లో అశ్విన్ స్థానంలో మహమ్మద్ షమీని ఎంచుకుంటే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చు’ అని మంజ్రేకర్ సూచించాడు. దక్షిణాఫ్రికాతో రెండు వన్డే మ్యాచులు ఆడిన అశ్విన్ ఒక్క వికెట్ పడగొట్టిన విషయం తెలిసిందే.