pele: పీలే జట్టును ఓడించినంత పనిచేసిన మోహన్‌ బగాన్‌..!

సాకర్‌ దిగ్గజం పీలే భారత్‌లోని కోల్‌కతాలో ఒక మ్యాచ్‌ ఆడాడు. ఈ మ్యాచ్‌లో భారత లీగ్‌ జట్టు పీలే జట్టును ఓడించినంత పనిచేసింది. 

Published : 30 Dec 2022 17:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫుట్‌బాల్‌ కింగ్‌ పీలే ఆటను ప్రత్యేక్షంగా వీక్షించే అదృష్టం కోల్‌కత వాసులకు దక్కింది. పీలే అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికాక న్యూయార్క్‌ కాస్మోస్‌ లీగ్‌ జట్టులో చేరాడు. ఈ జట్టు ఫుట్‌బాల్‌ ప్రమోషన్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా మ్యాచ్‌లు ఆడింది. ఈ క్రమంలో 1977 సెప్టెంబర్‌ 24న కోల్‌కతాలో మోహన్‌ బగాన్‌ జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్‌లో న్యూయార్క్‌ కాస్మోస్‌ తరపున పీలే, కార్లోస్‌ ఆల్బర్టో వంటి వారు ఆడారు. ఈ మ్యాచ్‌లో మోహన్‌ బగాన్‌ అద్భుతంగా ఆడింది. ఒక దశలో 2-1 ఆధిక్యంలో ఉంది. కానీ, వివాదాస్పదమైన పెనాల్టీ న్యూయార్క్‌ కాస్మోస్‌కు దక్కడంతో మ్యాచ్‌ 2-2తో డ్రాగా ముగిసింది. భారత ఆటగాళ్లు సుబ్రాతా భట్టాచార్యా, ప్రదీప్‌ చౌధురి, పీకే బెనర్జీ, సుర్జీత్‌సేన్‌ గుప్తా, మహమ్మద్‌ హబీబ్‌ వంటి ఆటగాళ్లు ఉన్నారు. బెనర్జీ, చౌధురీ సమష్టిగా పీలేను కట్టడి చేసే బాధ్యతను తీసుకొన్నారు. ఈ మ్యాచ్‌లో పీలే గోల్‌ చేయకపోవడంతో ఫ్యాన్స్‌ చాలా నిరాశకు గురయ్యారు.

ఈ మ్యాచ్‌ చూడటానికి ఈడెన్‌ గార్డెన్‌కు దాదాపు 80,000 మంది తరలి రావడంతో స్టేడియం కిక్కిరిసి పోయింది. ఇక్కడ మ్యాచ్‌ నిర్వహణకు  మోహన్‌ బగాన్‌ యాజమాన్యం అప్పట్లోనే రూ.17 లక్షలు వెచ్చించింది. ఫ్యాన్స్‌ను అదుపు చేయడానికి దాదాపు 35 వేల మంది పోలీసులను మోహరించారు. అప్పట్లోనే టికెట్‌ ధర రూ.5 నుంచి రూ.60 మధ్యలో నిర్ణయించారు. 

పీలే 75 ఏళ్ల వయస్సులో మరోసారి భారత్‌ను సందర్శించాడు. ఈ సారి ఆయన కోల్‌కతాలో వారం రోజులపాటు ఉన్నారు. చాలా మంది యువ ఆటగాళ్లను ఆయన కలుసుకొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని