Akash Madhwal: ఇంజినీర్‌ TO క్రికెటర్‌.. పాతికేళ్లకు ఎంట్రీ.. ఇదీ ఆకాశ్ మధ్వాల్‌ స్టోరీ!

ఐపీఎల్ 2023 సీజన్‌ (IPL 2023) ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన బౌలర్‌ ఆకాశ్‌ మధ్వాల్‌ (Akash Madhwal). బుల్లెట్ల లాంటి బంతులను సంధించి లఖ్‌నవూను ఓడించడంలో ఈ ముంబయి బౌలర్‌ కీలక పాత్ర పోషించాడు.

Updated : 25 May 2023 12:11 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ సీజన్‌ 2023 (IPL 2023) ఎలిమినేటర్ మ్యాచ్‌లో లఖ్‌నవూను చిత్తు చేసి ముంబయి (LSG vs MI) ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర యువ బౌలర్‌ ఆకాశ్‌ మధ్వాల్‌దే. కేవలం ఐదే పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసి సంచలన బౌలింగ్‌ చేశాడు. దీంతో అందరి దృష్టి ఈ బౌలర్‌పై పడింది. ఇంతకీ అతడెవరా..? అని వెతికేయగా మధ్వాల్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. మరి అవేంటో మీరూ చదివేయండి..

ఇంజినీరింగ్‌ చేసి..

ఐదేళ్ల కిందట వరకు కేవలం టెన్నిస్‌ బాల్‌తోనే ఆట. ఉత్తరాఖండ్‌ నుంచి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లోకి అడుగు పెట్టిన తొలి బౌలర్‌గా రికార్డు. దేశవాళీ క్రికెట్‌లో శుభ్‌మన్‌ గిల్‌ వంటి బ్యాటర్‌కు బంతులేసిన అనుభవం. ఇంజినీరింగ్‌ చదివి ఉద్యోగం మానేసి క్రికెట్‌నే కెరీర్‌గా ఎంచుకోవడంపై బంధువుల నుంచి ఉచిత సలహాలు.. ఇదీ సంక్షిప్తంగా ఆకాశ్ మధ్వాల్‌ బయోడేటా. రూర్కీలో 1993లో జన్మించిన ఆకాశ్ సివిల్‌ ఇంజినీరింగ్‌ను పూర్తి చేశాడు. సాధారణంగా క్రికెటర్‌ కావాలని కోరుకుంటే చిన్నప్పటి నుంచే దానిని కెరీర్‌గా స్వీకరిస్తారు. కానీ, ఆకాశ్‌ మాత్రం ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక ఉద్యోగం చేసిన తర్వాత క్రికెటర్‌గా మారాడు. 

జాఫర్‌ చొరవతో..

పాతికేళ్ల వయసులో ఆకాశ్ మధ్వాల్ 2019లో సయ్యద్ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఆడేందుకు తొలిసారి ఉత్తరాఖండ్‌ జట్టుకు ఎంపికయ్యాడు. ఆ ఏడాదే ఉత్తరాఖండ్‌కు ఆడే అవకాశం మొదటిసారి లభించింది. అప్పటి వరకు టెన్నిస్‌ బంతితోనే ఆడిన ఆకాశ్.. తొలిసారి సయ్యద్‌ ముస్తాక్ అలీ ట్రోఫీలోనే రెడ్‌ బాల్‌ను చేతబట్టాడు. అదీనూ టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు, ఉత్తరాఖండ్‌కు కోచ్‌గా పనిచేసిన వసీం జాఫర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రయల్స్‌లో పాల్గొనడం ఆకాశ్‌కు కలిసొచ్చింది. జాఫర్‌ చొరవ చూపించి మద్దతుగా నిలవడంతో తన సత్తా ఏంటో మధ్వాల్ నిరూపించుకొన్నాడు. దీంతో ఐపీఎల్‌ ఎంట్రీకి తలుపులు తెరుచుకున్నాయి.

ముంబయి అన్వేషణ..

కీలక ఆటగాళ్లను వెతికి తెచ్చుకోవడంలో ముంబయి ఇండియన్స్‌ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. అందులో భాగంగానే ఆకాశ్‌ మధ్వాల్‌ ప్రదర్శనను గమనించిన ముంబయి అతడికి అవకాశం కల్పించింది. అలా కేవలం రూ. 20 లక్షలకు సొంతం చేసుకున్నప్పటికీ.. గత సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేకపోయాడు. ఐపీఎల్ 2022 సీజన్‌ సందర్భంగా సూర్యకుమార్‌ గాయపడటంతో అతడి స్థానంలో ఆకాశ్‌ జట్టులోకి వచ్చాడు. ఒక్క మ్యాచ్‌ ఆడకపోయినా..  నెట్‌ బౌలర్‌గా నాణ్యమైన ప్రదర్శనతో యాజమాన్యం దృష్టిలో పడ్డాడు. ఈ సీజన్‌లోనూ బుమ్రా లేకపోవడంతో అవకాశం లభిస్తుందని భావించినప్పటికీ.. దక్కలేదు. కానీ, ఆర్చర్‌ కూడా దూరం కావడంతో మధ్వాల్‌కు ఛాన్స్ వచ్చింది. ఈ సీజన్‌లోనే ఇప్పటివరకు అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలను నమోదు చేసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. తాజా సీజన్‌లో ఏడు మ్యాచుల్లోనే 13 వికెట్లు తీశాడు.

పంత్‌ గురువు వద్దే..

టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌కు ఆకాశ్‌ మధ్వాల్ సహచరుడే. ఇద్దరూ ఒకే ప్రాంతం నుంచి వచ్చారు. అలాగే పంత్‌కు కోచింగ్‌ ఇచ్చిన అత్వార్‌ సింగ్ వద్దే ఆకాశ్‌ కూడా శిక్షణ తీసుకున్నాడు. దేశవాళీలో ఆకాశ్ ఆటతీరుకు అతడిని కెప్టెన్సీ వరించింది. ఉత్తరాఖండ్‌ జట్టుకు సారథిగా నియమిస్తూ క్రికెట్ సంఘం నిర్ణయం తీసుకోవడం విశేషం.

ఆకాశ్‌లో స్పెషల్‌ అదే..

బంతిని తక్కువ బౌన్స్‌తో జారవిడిచేలా వేయడం ఆకాశ్ మధ్వాల్ ప్రత్యేకత. లీగ్‌ దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై నాలుగు వికెట్లు తీసిన ఆకాశ్.. ఈసారి మాత్రం మరింత కట్టుదిట్టంగా బంతులను సంధించాడు. అత్యంత తక్కువ ఎకానమీతో బౌలింగ్‌ వేసిన బౌలర్‌గా మారాడు. లఖ్‌నవూపై 3.3 ఓవర్లలో కేవలం ఐదు పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. లఖ్‌నవూ బ్యాటర్‌ బదోనిని క్లీన్‌ బౌల్డ్‌ చేసిన తర్వాత బంతికే డేంజరస్‌ బ్యాటర్ నికోలస్‌ పూరన్‌ను బోల్తా కొట్టించాడు. టెస్టుల్లో మాత్రమే చూసే లెంగ్త్‌తో బంతిని సంధించి వికెట్లు రాబట్టాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని