Wriddhiman Saha: సాహా నా ప్రతిష్ఠను దెబ్బతీశాడు.. వీడియోలో జర్నలిస్టు

టీమ్‌ఇండియా క్రికెటర్‌ వృద్ధిమాన్‌ సాహాను బెదిరించిన ఆ జర్నలిస్టు ఎవరో తెలిసిపోయింది. స్వయంగా ఆయనే ఓ వీడియో విడుదల చేసి ప్రజలముందుకు వచ్చాడు...

Published : 07 Mar 2022 09:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా క్రికెటర్‌ వృద్ధిమాన్‌ సాహాను బెదిరించిన ఆ జర్నలిస్టు ఎవరో తెలిసిపోయింది. స్వయంగా ఆ జర్నలిస్టే.. ఓ వీడియో విడుదల చేసి ప్రజలముందుకు వచ్చాడు. ఇటీవల ఓ జర్నలిస్టు తనను ఇంటర్వ్యూ కోసం బెదిరించాడని.. సాహా అందుకు సంబంధించిన వాట్సాప్‌ స్క్రీన్‌షాట్లను ట్విటర్‌లో బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ జర్నలిస్టు ఎవరనే విషయం తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. పలువురు మాజీ క్రికెటర్లు సైతం ఆ వ్యక్తి పేరు వెల్లడించాలని కోరారు. కానీ, సాహా నోరు విప్పలేదు. ఇక బీసీసీఐ ఇటీవల ఆ విషయంపై విచారణ చేపట్టగా ఆ జర్నలిస్టు పేరు వెల్లడించాడు. కానీ, మీడియా ముందు చెప్పలేదు. ఈ నేపథ్యంలోనే సదరు జర్నలిస్టే స్వయంగా ఓ వీడియో విడుదల చేసి సాహా తనపై తప్పుడు ఆరోపణలు చేశాడని అన్నాడు.

‘ప్రతి కథకి రెండు పార్శ్యాలు ఉంటాయి. వృద్ధిమాన్‌ సాహా నా వాట్సాప్‌ స్క్రీన్‌షాట్లను తప్పుడుగా చూపించి నా పరువు, విశ్వసనీయతను దెబ్బతీశాడు. ఈ విషయంలో నిష్పక్షపాతమైన విచారణ జరిపించాలని బీసీసీఐని కోరాను. మా లాయర్లు సాహాకు పరువునష్టం నోటీసులు జారీ చేస్తారు’ అని అందులో పేర్కొన్నాడు. ఈ వీడియోలో అనేక విషయాలు వెల్లడించాడు. కాగా, ఆ జర్నలిస్టు ఎవరో కాదు.. క్రీడా ప్రపంచంలో చాలా మందికి పరిచయమున్న వ్యక్తే. ఆయనే బోరియా మజుమ్‌దార్‌. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు గతనెల టీమ్‌ఇండియా జట్టు సభ్యుల్ని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అందులో సాహాతో పాటు పలువురు సీనియర్‌ క్రికెటర్లను సైతం సెలెక్షన్‌ కమిటీ పక్కనపెట్టింది. ఈ నేపథ్యంలోనే మజుమ్‌దార్‌.. సాహా ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించాడని అర్థమవుతోంది. అందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్లనే బహిర్గతం చేశాడు. అదే సమయంలో టీమ్‌ఇండియా కీపర్‌.. కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ అంతకుముందు జట్టులో తన స్థానంపై ఏం చెప్పారో కూడా మీడియాముందు చెప్పాడు. దీంతో సాహా పతాక శీర్షికల్లో నిలిచాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని