Hardik Pandya: ఆ కల తీరిపోయింది.. ఇక అదే మా లక్ష్యం: హార్దిక్ పాండ్య
ఈసారి ఐపీఎల్ సీజన్‌లో (IPL 2023) గుజరాత్ టైటాన్స్ సారథి హార్దిక్ పాండ్య (Hardik Pandya) తమ జట్టు ఏం చేయాలనేదానిపై వివరణ ఇచ్చేశాడు. గతేడాది ఛాంపియన్‌గా నిలవడం ఆనందంగా ఉందని, ఇప్పుడు దానిని కొనసాగించడానికి ప్రయత్నిస్తామని వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: అత్యంత ప్రజాదరణ పొందిన లీగుల్లో ఐపీఎల్ (IPL 2023) ముందుంటుంది. ప్రస్తుతం ఐపీఎల్ 16వ సీజన్ సిద్ధమవుతోంది. గతేడాది ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ (GT vs CSK) జట్ల మధ్య మొదటి మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభం కానుంది. కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) నాయకత్వంలోని గుజరాత్ మరోసారి అత్యుత్తమ ప్రదర్శనతో రాణించాలని ఆశిస్తోంది. ఈ క్రమంలో కెప్టెన్ హార్దిక్ తమ జట్టు ప్రయాణం గురించి మాట్లాడిన వీడియోను గుజరాత్ టైటాన్స్ తన యూట్యూబ్ ఛానల్‌లో ఉంచింది. తమ ప్రాక్టీస్‌ను, గతేడాది గుజరాత్ సాధించిన విజయాలను, ఈ సీజన్‌లో ఎలా ఆడాలని అనుకుంటున్నామనే విషయాలను హార్దిక్ తెలిపాడు.
‘‘చిన్నప్పుడు నేను క్లాస్‌రూమ్‌లో చేసిన పనులకు టీచర్ మా నాన్నకు ఫిర్యాదు చేశారు. హార్దిక్ క్లాస్‌లో ఎప్పుడూ నిద్రపోతుంటాడని చెప్పారు. అయితే మా నాన్న మాత్రం అలాంటి వాటిని కొట్టిపడేశారు. నేను నిద్ర పోవడం లేదు. కల కంటున్నట్లు చెప్పారు. ఎప్పుడూ కలలు కంటూ ఉంటాడన్నారు. మ్యాచ్‌లు గెలవాలని, అందరి మనసులను గెలవాలని, భారత్ తరఫున ఆడాలని, ఐపీఎల్ విజేతగా నిలవాలని, కెప్టెన్‌గా టైటిల్‌ను ఎత్తుకోవాలని.. ఇలా కలలు కనేవాడిని. నాకిష్టమైనవారి మార్గదర్శకంలో ఒకదాని తర్వాత మరొకటి కలలు నెరవేరాయి. గత సీజన్ ముగిసిన సంవత్సరం తర్వాత మళ్లీ ఇక్కడికి (ఐపీఎల్) వచ్చా. నా గుజరాత్ టైటాన్స్ ఫ్యామిలీతో కలిశా. ఆటగాళ్లు, కోచ్, సహాయక సిబ్బంది, మేనేజ్‌మెంట్ మదిలో ఒకటే విషయం ఇప్పుడు మెదులుతోంది. మనం గతేడాదే ట్రోఫీని గెలిచాం. మన కల నెరవేరింది. మరి ఇప్పుడు ఇంకేం సాధించాలి. గతంలో ఏం జరిగిందనేది గుర్తుంచుకోవాలి. ఐపీఎల్ ట్రోఫీని గెలవడం ప్రతి ఒక్కరి కల. అందులో ఎలాంటి అనుమానం లేదు. అది నెరవేర్చుకున్నాం. అయితే కొనసాగించాల్సిన మరో కీలకమైన విషయం మరొకటి ఉంది. అదే నాణ్యమైన క్రికెట్‌ను ఆడాలి. ఇలాంటి కలకు ముగింపు ఉండదు. ఇప్పుడు ఇదే లక్ష్యంతో ముందుకు సాగుతాం’’ అని హార్దిక్ చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.