ఆసీస్‌ వాళ్లున్నారని లిఫ్టు ఎక్కనివ్వలేదు: యాష్‌

ఆస్ట్రేలియాలో క్వారంటైన్‌ ఆంక్షలు కఠినంగా విచిత్రంగా అనిపించాయని టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. ఒకే బయోబుడగలో ఉన్నప్పటికీ ఆసీస్‌ ఆటగాళ్లున్న లిఫ్ట్‌లోనికి తమను  ఎక్కనివ్వలేదని పేర్కొన్నాడు. ఆ సమయంలో చాలా బాధగా అనిపించిందని వెల్లడించాడు....

Published : 25 Jan 2021 17:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్ట్రేలియాలో క్వారంటైన్‌ ఆంక్షలు కఠినంగా విచిత్రంగా అనిపించాయని టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. ఒకే బయోబుడగలో ఉన్నప్పటికీ ఆసీస్‌ ఆటగాళ్లున్న లిఫ్ట్‌లోనికి తమను  ఎక్కనివ్వలేదని పేర్కొన్నాడు. ఆ సమయంలో చాలా బాధగా అనిపించిందని వెల్లడించాడు.

కరోనా వైరస్‌ వల్ల ఆసీస్‌ పర్యటన సాంతం టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఆంక్షల్లో ఉండాల్సి వచ్చింది. బయోబుడగలో ఉన్నప్పటికీ సిడ్నీ, మెల్‌బోర్న్‌, బ్రిస్బేన్‌లో వేర్వేరు నిబంధనలు పాటించాల్సి వచ్చింది. అక్కడి సాధారణ పౌరుల కన్నా కఠినంగా భారత ఆటగాళ్లకు నిబంధనలు విధించారు. ఆసీస్‌లో అడుగుపెట్టిన వెంటనే కఠిన క్వారంటైన్‌లో ఉన్నా బ్రిస్బేన్‌లోనూ మళ్లీ క్వారంటైన్‌ కావాలని ఆదేశించారు. బీసీసీఐ జోక్యం చేసుకోవడంతో కొన్నింటిని మినహాయించారు. చిత్రవిచిత్రమైన ఆంక్షలు విధించడమే కాకుండా భారత ఆటగాళ్లు నిబంధనలు పాటించేందుకు ఇష్టపడటం లేదన్నట్టుగా అక్కడి మీడియా దుష్ప్రచారానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే.

‘మేం సిడ్నీకి చేరుకోగానే మమ్మల్ని  కఠిన ఆంక్షల మధ్య బంధించారు. పైగా అక్కడే ఒక ప్రత్యేకమైన సంఘటన చోటు చేసుకుంది. నిజం చెప్పాలంటే చాలా వింతగా అనిపించింది. భారత్‌, ఆసీస్‌ ఆటగాళ్లు ఒకే బయో బుడగలో ఉన్నారు. ఆసీస్‌ ఆటగాళ్లు ఒక లిప్ట్‌లో ఉండగా అందులోకి మమ్మల్ని అనుమతించలేదు’ అని యాష్ చెప్పాడు.

‘గాయ్స్‌.. అప్పుడు చాలా బాధపడ్డాం. మేమంతా ఒకే బుడగలో ఉన్నాం. అలాంటిది వారు ఉన్న లిప్టులోకి మమ్మల్ని అనుమతించలేదు. వారితో కలిసి ఆ చోటును పంచుకోనివ్వలేదు. దీనిని జీర్ణించుకోవడానికి ఇబ్బంది పడ్డాం. ఒకే బుడగలో ఉన్నప్పుడు ఒకే లిప్ట్‌లో వెళ్తే మాత్రం తప్పేంటి?’ అని యాష్‌ ప్రశ్నించాడు.

ఇవీ చదవండి
పంత్‌ను ఆటపట్టించిన చాహల్‌, రషీద్‌
కుంబ్లేను ఎదుర్కోడానికి ద్రవిడ్‌ సాయం: తైబు

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని