Cricketers: ఆటే కాదు.. ఫేమూ సూపరహే!

Cricketers instagram: ఆటలోనే కాదు, అభిమానుల్లోనూ కొందరు క్రికెటర్లు సోషల్‌మీడియాలో దూసుకుపోతున్నారు

Updated : 07 Sep 2021 10:48 IST

ఇన్‌స్టాగ్రామ్‌.. సెలబ్రెటీల పేరును, ఫేమ్‌నూ తూచే కొలమానిని. ఇందులో ఎంత ఎక్కువ మంది ఫాలోయర్లు ఉంటే అంత గొప్ప. అందుకే కదా! ఈ మధ్యే పరుగుల వీరుడు కోహ్లి 15 కోట్ల మంది అభిమానుల మార్కుని అధిగమించి ప్రపంచ మేటి క్రీడాకారుల జాబితాలో చేరాడు. ఇదో రికార్డు. మరి కోహ్లి తర్వాత ఇతర ఆటగాళ్ల మాటేంటి? ఎవరెవరు ఎంతెంత అభిమానం పోగేసుకున్నారు? అంటే ఇదీ జవాబు. రండి.. ఆటతోపాటు ఇన్‌స్టాలో అధికంగా అభిమానులున్న మన అథ్లెట్ల వివరాలు పట్టేద్దాం.

మహేంద్ర సింగ్‌ ధోనీ

ఫాలోవర్లు: 3.47 కోట్లు

కోహ్లి తర్వాత అత్యధిక అభిమానులున్న క్రీడాకారుడు మిస్టర్‌ కూల్‌ ధోనీ. మిగతా వాళ్లతో పోలిస్తే ధోనీ ఇన్‌స్టాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండడనే చెప్పొచ్చు. తను ఇప్పటిదాకా పెట్టిన పోస్టులు కేవలం 107 మాత్రమే. అందులోనూ కూతురు జీవా అల్లరి చేష్టలవే ఎక్కువ. తర్వాత పెంపుడు కుక్కలతో ఆడుకుంటున్నవీ.. బైక్‌, కారు కలెక్షన్‌లవి ఉన్నాయి. మూడున్నర కోట్ల మంది అనుసరిస్తున్నా తను ఫాలో అవుతోంది నలుగురిని మాత్రమే.


సచిన్‌ తెందుల్కర్‌

ఫాలోవర్లు: 3.12 కోట్లు

క్రికెట్‌ దేవుడు సచిన్‌ తెందుల్కర్‌ది మూడో స్థానం. వంటగదిలో చేరి చేతులు కాల్చుకోవడం దగ్గర్నుంచీ.. క్రికెట్‌లో తను చెలరేగిన పాత ఫొటోలదాకా అన్నిరకాల పోస్ట్‌లు పెడుతుంటాడు. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో తప్పకుండా స్ఫూర్తిని రగిల్చే పోస్ట్‌ తప్పకుండా ఉంటుంది. అభిమాన గాయకులు, తోటి ఆటగాళ్లతో సమావేశమైన సందర్భాలనూ అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటాడు.


రోహిత్‌ శర్మ

ఫాలోవర్లు: 2.02కోట్లు

హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మ పోస్టులు గమనిస్తే కూతురు సమైరా, భార్య రితికా సజ్దాతో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలే ఎక్కువగా ఉంటాయి. తను బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న ప్రకటనలు, క్రికెట్‌ జట్టు సభ్యులతో పంచుకునే అపురూప విజయాలు సైతం అభిమానులను ఆకట్టుకుంటాయి.


హార్దిక్‌ పాండ్యా

ఫాలోవర్లు: 1.92 కోట్లు

హార్ధిక్‌ హిమాన్షు పాండ్యా ఇన్‌స్టా ఖాతాను చూస్తే ఓ క్రీడాకారుడు కాదు.. ఓ ఫ్యాషన్‌ మోడల్‌ను చూస్తున్నట్టే ఉంటుంది. స్టైలిష్‌ ఫొటోలు, జిమ్‌ వర్కవుట్లు, చొక్కా విప్పి దిగిన ఫొటోలే ఎక్కువ. తను ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల ప్రకటనలు, కుటుంబంతో కలిసి ఉన్న పోస్ట్‌లూ ఉంటాయి.


సురేశ్‌ రైనా జీ

ఫాలోవర్లు: 1.72 కోట్లు

సురేశ్‌ ఖాతా చూసిన ఎవరైనా పక్కా జెంటిల్‌మన్‌ అనకుండా ఉండలేరు. అంత సంప్రదాయబద్ధంగా ఉంటాయి తన పోస్ట్‌లు. అయితే క్రికెట్‌ ప్రాక్టీస్‌ లేదంటే కుటుంబం, స్నేహితులుతో దిగిన ఫొటోలు. అప్పుడప్పుడు తను ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల తరపున పోస్ట్‌లు.. ఇంతే. అవి కూడా భారీగానే ఉంటాయి.


యువరాజ్‌ సింగ్‌

ఫాలోవర్లు: 1.17 కోట్లు

సిక్సరపిడుగు, యాటిట్యూడ్‌ కా బాప్‌.. యువరాజ్‌సింగ్‌ని కోటి మందికిపైగానే అనుసరిస్తున్నారు. ఆటలోనే కాదు.. యువీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టే పోస్ట్‌ల్లోనూ ఆల్‌రౌండరే. క్రికెట్‌, మ్యూజిక్‌, స్నేహితులు, కుటుంబం, వేడుకలు.. అన్ని రకాల ఫొటోలు, పోస్ట్‌లు పెడుతుంటాడు.


కే.ఎల్‌.రాహుల్‌

ఫాలోవర్లు: 1.06 కోట్లు

భారత క్రికెట్‌ జట్టు స్టైలిష్‌ ఓపెనర్‌ కే.ఎల్‌.రాహుల్‌ టాప్‌ జాబితాలో తర్వాత ఉన్నాడు. రకరకాల హెయిర్‌స్టైల్స్‌, స్టైల్‌, ఫిట్‌నెస్‌ ఫొటోలే కాదు.. కిందివరకూ స్క్రోల్‌ చేస్తే రాహుల్‌ పాత రోజులనాటి ఆ పాత మధురజ్ఞాపకాలనూ చూడొచ్చు.


సానియా మీర్జా

ఫాలోవర్లు: 78 లక్షలు

టాప్‌ జాబితాలో చోటు సంపాదించిన ఏకైక మహిళా అథ్లెట్‌ మన సానియా. తన టెన్నిస్‌ మ్యాచ్‌లు, ప్రాక్టీస్‌, కుటుంబంతో జాలీగా గడిపిన సందర్భాలు, వ్యక్తిగత ఫొటోషూట్‌, కొడుకు ఇజాన్‌ మీర్జా మాలిక్‌ అల్లరి, బాలీవుడ్‌ తారలతో చెట్టపట్టాల్‌.. ఇవన్నీ తన ఇన్‌స్టాలో ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని