INDW vs AUSW: భారత్‌లో మహిళల టీ20 లీగ్‌ అద్భుతం చేయబోతోంది: ఆసీస్‌ ఆల్‌రౌండర్‌

భారత్‌లో జరగనున్న మహిళల టీ20 లీగ్‌ రానున్న రోజుల్లో అద్భుతం చేయనుందని ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ ఎలీస్‌ పెర్రీ(Ellyse perry) తెలిపింది. 

Published : 18 Dec 2022 17:25 IST

బ్రబౌర్న్‌: భారత మహిళల టీ20 లీగ్‌(Indian Womens T20 League)పై ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ ఎలీస్‌ పెర్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ లీగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తిని కనబరిచింది. శనివారం బ్రబౌర్న్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌ అనంతరం ఎలీస్‌ మాట్లాడుతూ.. టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌ సమయంలో ప్రేక్షకుల నుంచి వారికి లభించిన మద్దతు తనను ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపింది. ఇలాంటిది తాను ముందెన్నడూ చూడలేదని పేర్కొంది. ఈ సందర్భంగా మహిళల టీ20 లీగ్‌పై వ్యాఖ్యానించింది. 

‘‘ఆట అభివృద్ధి చెందుతుంటే మనమూ దాని వెంట పయనించాల్సి ఉంటుంది. ఈ జట్టుతో బ్యాటింగ్‌కి దిగడం గొప్ప అనుభూతి. మ్యాచ్‌ సందర్భంగా ఇక్కడి ప్రేక్షకులు తమ సెల్‌ఫోన్లలో ఫ్లాష్‌ లైట్లు చూపుతూ వారి జట్టుకు మద్దతు తెలపడం అద్భుతంగా అనిపించింది. ఇలాంటిది నేనెప్పుడూ చూడలేదు. రానున్న భారత టీ20 లీగ్‌ మరింత గొప్పగా ఉండబోతోంది. ఆస్ట్రేలియాలో మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌ తీసుకువచ్చిన పురోగతిని చూశాం. ఇంగ్లాండ్‌లోనూ హండ్రెడ్‌ బాల్‌ క్రికెట్‌ టోర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు భారత్‌ వంతు రాబోతోంది’’ అంటూ ఎలీస్‌ పెర్రీ పేర్కొంది. 

భారత్‌తో జరిగిన 5 టీ20ల  సిరీస్‌(INDW vs AUSW)ను ఒక మ్యాచ్‌ మిగిలుండగానే 3-1తో ఆసీస్‌ కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆ జట్టు ఆల్‌రౌండర్‌ ఎలీస్‌ పెర్రీ (72 నాటౌట్‌; 42 బంతుల్లో 7x4, 4x6)తో చెలరేగింది. భారత్‌లో ఎంతో కాలంగా మహిళల టీ20 లీగ్‌పై చర్చలు జరుగుతోన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఈ టోర్నమెంట్ నిర్వహణకు బీసీసీఐ కసరత్తులు మొదలుపెట్టింది. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఫ్రాంచైజీల నుంచి బిడ్లను ఆహ్వానించింది. వచ్చే ఏడాది మార్చ్‌లో ఈ టోర్నీ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని