IND vs SA: టీమ్‌ఇండియా ఎక్కడ ఆడినా.. గెలుస్తుందన్న అంచనాలు పెరిగాయి : ద్రవిడ్‌

ప్రస్తుత భారత క్రికెట్లో ఎన్నో మార్పులు వచ్చాయని కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్ అన్నాడు. ఒకప్పటితో పోల్చుకుంటే ప్రస్తుతం టీమ్‌ఇండియా ఎక్కడ ఆడినా గెలుస్తుందనే నమ్మకం పెరిగిందని పేర్కొన్నాడు...

Published : 25 Dec 2021 22:52 IST

(Photo: BCCI Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రస్తుత భారత క్రికెట్లో ఎన్నో మార్పులు వచ్చాయని కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్ అన్నాడు. ఒకప్పటితో పోల్చుకుంటే ప్రస్తుతం టీమ్‌ఇండియా ఎక్కడ ఆడినా గెలుస్తుందనే నమ్మకం పెరిగిందని పేర్కొన్నాడు. ఇటీవల విదేశాల్లో కూడా భారత జట్టు చారిత్రక విజయాలు సాధిస్తోందని చెప్పాడు. 

‘ప్రస్తుత భారత జట్టు ఫార్మాట్‌తో సంబంధం లేకుండా విదేశాల్లో కూడా సిరీస్‌లు సాధిస్తోంది. అందుకే టీమ్‌ఇండియా విదేశీ పర్యటనలకు వెళ్తోందంటే కచ్చితంగా విజయం సాధిస్తుందనే అంచనాలు పెరిగాయి. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాను ఓడించడం అంత సులభమేం కాదు. అందుకు చాలా శ్రమించాల్సి ఉంటుంది. అయితే, గెలుపోటములనేవి మన నియంత్రణలో ఉండవు. కాబట్టి, వాటితో సంబంధం లేకుండా ఆటను ఆస్వాదించాలి. సిరీస్ ఆసాంతం ఒకే తీవ్రత, సంకల్పంతో ఆడాలి. అప్పుడే ప్రత్యర్థి జట్టుకు గట్టి పోటీని ఇవ్వగలం. ఒక కోచ్‌గా కఠిన సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా ఆటగాళ్లను సిద్ధం చేశాను’ అని రాహుల్ ద్రవిడ్‌ తెలిపాడు.

ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌, శ్రీలంక, ఇంగ్లాండ్‌ పర్యటనల్లో ఆదిపత్యం చెలాయించిన భారత జట్టు.. దక్షిణాఫ్రికాలో ఇప్పటి వరకు ఒక్క టెస్ట్ సిరీస్ కూడా సాధించలేకపోయింది. సఫారీల గడ్డపై టీమ్‌ఇండియా పర్యటించిన ఏడు సిరీస్‌ల్లోనూ పరాభవమే ఎదురైంది. ప్రస్తుతం కోచ్‌ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని భారత జట్టు దక్షిణాఫ్రికాలో సిరీస్‌ సాధించి చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతోంది. రేపటి నుంచి (డిసెంబరు 26) ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా ఏం చేస్తుందో చూడాలి.!

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని