Deepti Sharma: మన్కడింగ్‌కు ముందు హెచ్చరించాల్సిన అవసరం లేదు..

ఇంగ్లాండ్‌ మహిళలతో చివరి వన్డే సందర్భంగా ఆ జట్టు బ్యాటర్‌ చార్లీ డీన్‌ను భారత ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ మన్కడింగ్‌ చేయడం వివాదాస్పదమైంది.

Updated : 27 Sep 2022 16:08 IST

దీప్తి-డీన్‌ వివాదంపై ఆస్ట్రేలియా మాజీ బౌలర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌ మహిళలతో చివరి వన్డే సందర్భంగా ఆ జట్టు బ్యాటర్‌ చార్లీ డీన్‌ను భారత ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ మన్కడింగ్‌ చేయడం వివాదాస్పదమైంది. దీంతో ఆటల్లో నిబంధనలు, క్రీడా స్ఫూర్తిపై మరోసారి పెద్ద చర్చే మొదలైంది. అయితే రనౌట్‌ చేయడానికి ముందు డీన్‌ను చాలా సార్లు హెచ్చరించామని దీప్తి చెప్పడం.. అది అబద్ధమని ఇంగ్లాండ్‌ ఆరోపించడం ఈ వివాదాన్ని మరో మలుపు తిప్పింది. ఈ క్రమంలోనే కొందరు మాజీ ఆటగాళ్లు దీనిపై స్పందిస్తున్నారు. మన్కడింగ్‌కు ముందు హెచ్చరించాల్సిన అవసరం లేదంటూ ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ జేసన్‌ గిల్లెస్పీ అభిప్రాయపడ్డాడు. అయితే క్రికెటర్లు నిబంధనలు పాటించాలని సూచించాడు.

మన్కడింగ్‌ వ్యవహారంపై దీప్తి శర్మ స్పందిస్తూ.. ‘‘డీన్‌ పదే పదే ముందుకెళ్లడంపై ఎన్నిసార్లు హెచ్చరించినా ఆమె పట్టించుకోకపోవడంతో అలా చేయాల్సి వచ్చింది’’ అని తెలిపింది. దీనిపై అంపైర్లకు కూడా చెప్పామని పేర్కొంది. అయితే దీప్తి వ్యాఖ్యలను ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ హీథర్‌ నైట్‌ ఖండించింది. మన్కడింగ్‌కు ముందు ఆ జట్టు ఎలాంటి హెచ్చరికలూ చేయలేదని, భారత్‌ తన చర్యను సమర్థించుకోడానికి అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదని ట్వీట్‌ చేసింది.

హీథర్‌ నైట్‌ ట్వీట్‌కు ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు మైఖెల్‌ వాన్‌ స్పందిస్తూ.. ‘‘రనౌట్‌కు ముందు హెచ్చరికలు చేశారా లేదా అన్నది తెలియాలంటే మైదానంలో ఉన్న ఎంపైర్‌ను అడగాలి’’ అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే వాన్‌ అభిప్రాయాన్ని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ జేసన్‌ గిల్లెస్పీ తప్పుబట్టాడు. వాన్‌ ట్వీట్‌కు స్పందిస్తూ.. ‘‘రనౌట్‌కు ముందు వార్నింగ్‌ ఇవ్వాలని నిబంధనల్లో ఎక్కడా లేదు’’ అన్నాడు. అయితే క్రికెటర్లు నిబంధనలను అనుగుణంగా ఆడాలని, అప్పుడు ఆట అదే కొనసాగుతుంది అని చెప్పుకొచ్చాడు.

కాగా.. చార్లీ డీన్‌ను దీప్తి మన్కడింగ్‌ చేయడంలో ఎలాంటి తప్పు లేదని క్రికెట్‌ నిబంధనల రూపకర్త మెరీల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) ఇదివరకే స్పష్టం చేసింది. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఈ మన్కడింగ్‌ వ్యవహారం చోటుచేసుకుంది. ఆ మ్యాచ్‌లో చార్లీ డీన్‌.. అనేక సార్లు బౌలర్‌ బంతిని వేయడానికి ముందే క్రీజును వదిలి వెళ్లడం దీప్తి గమనించింది. ప్రతి పరుగూ చాలా కీలకంగా మారిన స్థితిలో డీన్‌ను రనౌట్‌ చేసింది. ఈ సిరీస్‌ను భారత్‌ 3-0తో గెలుచుకున్న విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని