Kapil Dev: శాస్త్రిని  తొలగించడమెందుకు?

మంచి ఫలితాలు రాబడుతున్నప్పుడు టీమ్‌ఇండియా కోచ్‌ పదవి నుంచి రవిశాస్త్రిని తొలగిస్తే అర్థం లేదని దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ అన్నారు. రాహుల్‌ ద్రవిడ్‌ రూపంలో కొత్త కోచ్‌ను తయారు చేసుకోవడంలో తప్పేమీ లేదన్నారు. అయితే కోచ్‌ల గురించి చర్చిస్తూ ఆటగాళ్లపై అనవసరంగా ఒత్తిడి పెంచొద్దని సూచించారు...

Published : 05 Jul 2021 14:33 IST

కొత్త కోచ్‌ల చర్చతో ఒత్తిడి పెంచొద్దు: కపిల్‌ దేవ్‌

దిల్లీ: మంచి ఫలితాలు రాబడుతున్నప్పుడు టీమ్‌ఇండియా కోచ్‌ పదవి నుంచి రవిశాస్త్రిని తొలగిస్తే అర్థం లేదని దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ అన్నారు. రాహుల్‌ ద్రవిడ్‌ రూపంలో కొత్త కోచ్‌ను తయారు చేసుకోవడంలో తప్పేమీ లేదన్నారు. అయితే కోచ్‌ల గురించి చర్చిస్తూ ఆటగాళ్లపై అనవసరంగా ఒత్తిడి పెంచొద్దని సూచించారు.

టీమ్‌ఇండియా కోచ్‌గా రవిశాస్త్రి ఒప్పందం ఐసీసీ టీ20 ప్రపంచకప్‌తో ముగుస్తుంది. ఆ తర్వాత శాస్త్రి మళ్లీ దరఖాస్తు చేస్తాడో లేదో తెలియదు. మరోవైపు రాహుల్‌ ద్రవిడ్‌ శ్రీలంక పర్యటనలో భారత జట్టుకు కోచ్‌గా వెళ్లాడు. బీసీసీఐ అతడిని భవిష్యత్తు కోచ్‌గా ప్రచారం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ అంశాలపై కపిల్‌ దేవ్‌ స్పందించారు.

‘ఈ విషయంపై అంతగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ముందు శ్రీలంక సిరీస్‌ ముగియనివ్వండి. మన జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుందో తెలుస్తుంది. ఒక కొత్త కోచ్‌ను తయారు చేసుకోవడంలో తప్పేం లేదు. ఐతే రవిశాస్త్రి బాగా పనిచేస్తున్నప్పుడు అతడిని తొలగించడంలో అర్థం లేదు. ఏదేమైనా సమయమే అన్నిటికీ జవాబు చెప్తుంది. అంతకన్నా ముందు ఇది మన కోచ్‌లు, ఆటగాళ్లపై అనవసర ఒత్తిడి పెంచుతుంది’ అని కపిల్‌ అన్నారు.

టీమ్‌ఇండియా కోచ్‌గా రవిశాస్త్రి మంచి విజయాలనే అందించాడు. రెండుసార్లు ఆస్ట్రేలియాలో టెస్టు సిరీసులు గెలిపించాడు. విదేశాల్లోనూ జట్టు బాగానే రాణిస్తోంది. 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌కు చేరుకుంది. 2021 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ రన్నరప్‌గా నిలిచింది. ప్రస్తుతం రెండు భారత జట్లు వేర్వేరు దేశాల్లో పర్యటించడంపై కపిల్‌ మాట్లాడారు.

‘టీమ్‌ఇండియా రిజర్వు బెంచ్‌ బలం ఎక్కువే. ఆటగాళ్లకు అవకాశం లభించి టీమ్‌ఇండియా రెండు జట్లుగా విడిపోయి ఒకేసారి ఇంగ్లాండ్‌, శ్రీలంకలో గెలిస్తే అంతకన్నా ఇంకేం కావాలి. కుర్రాళ్లకు అవకాశం వస్తే మంచిదే కదా. అయితే ఒకేసారి రెండు జట్లపై ఒత్తిడి పెంచాలా అన్నది జట్టు యాజమాన్యమే చూసుకోవాలి’ అని కపిల్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని