BCCI: కొత్త సెలెక్టర్లకు అర్హతలివే.. ఈ బాధ్యతలు నిర్వర్తించాల్సిందే..

భారత జట్టుతోపాటు సెలెక్షన్‌ కమిటీలో ప్రక్షాళనకు బీసీసీఐ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా సెలెక్షన్ కమిటీని రద్దు చేసేసింది. కొత్త సెలెక్టర్ల కోసం నోటిఫికేషన్‌ జారీ చేయడంతోపాటు వారి విధులు, కర్తవ్యాలను తెలియజేస్తూ తాజాగా ప్రకటన విడుదల చేసింది.

Updated : 19 Nov 2022 13:42 IST

ఇంటర్నెట్ డెస్క్: కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ నేతృత్వంలోని భారత క్రికెట్‌ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయాలు తీసుకొనేందుకు సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా సెమీస్‌లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. దీంతో సెలెక్షన్ కమిటీలో తీవ్ర మార్పులు చేసేందుకు బీసీసీఐ నడుం బిగించింది. అందులో భాగంగా చేతన్ శర్మ ఛైర్మన్‌గా ఉన్న సెలెక్షన్ కమిటీని రద్దు చేసింది. ఇందులో ఇప్పటివరకు హర్విందర్‌ సింగ్‌, సునీల్‌ జోషి, దేబశిష్ మొహంతి సభ్యులు. 

సెలెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ సహా నూతన సభ్యుల నియామకం కోసం బీసీసీఐ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 28వ తేదీ వరకు గడువు విధించింది. ఈ క్రమంలో తాజాగా సభ్యుల ప్రధాన బాధ్యతలపై బీసీసీఐ ఎనిమిది పాయింట్లతో కూడిన జాబితాను విడుదల చేసింది.  

సెలెక్షన్ కమిటీ విధులు - బాధ్యతలు

* న్యాయంగా, పారదర్శక పద్ధతిలో అత్యుత్తమ జట్టును ఎంపిక చేయాలి.

* సీనియర్‌ పురుషుల టీమ్‌ రిజ్వర్‌ బెంచ్‌ను బలోపేతం చేయడంపై దృష్టిపెట్టాలి. దానికి తగ్గట్లు ప్రణాళికలు తయారు చేయాలి. 

* అవసరమైన సందర్భంలో జట్టు సమావేశాలకు హాజరు కావాలి. 

* దేశీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లను గమనించేందుకు ప్రయాణాలు చేస్తూ ఉండాలి. 

* ఆటగాళ్ల, జట్టు ప్రదర్శనపై ప్రతి మూడు నెలలకోసారి నివేదికలు రూపొందించి బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌కు సమర్పించాలి.

* జట్టు ఎంపికపై, బీసీసీఐ ఆదేశాల మేరకు మీడియాతో మాట్లాడాలి. 

* ప్రతి ఫార్మాట్‌కు సరైన నాయకుడిని నియమించాలి. 

* బీసీసీఐ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలి.

సభ్యులకు ఉండాల్సిన అర్హతలు: 

* కనీసం 7 టెస్టు మ్యాచ్‌లు లేదా 30 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి ఉండాలి.

* క్రికెట్‌కు వీడ్కోలు పలికి దాదాపు ఐదేళ్లు పూర్తి కావాలి. 

* ఐదుగురు సభ్యులకు వయసు పరిమితి 60 ఏళ్లులోపు వారికే అవకాశం.

* మొత్తం 5 సంవత్సరాల పాటు ఏదైనా క్రికెట్ కమిటీలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి  దరఖాస్తు చేసుకొనేందుకు అనర్హుడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని