IPL 2023: యువకులు కాదు.. యమడేంజర్లు!
తమ సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేస్తూ భారత జట్టులోకి తలపులను తట్టిన ఆటగాళ్లు వీరంతా. భవిష్యత్తులో తప్పకుండా టీమ్‌ఇండియాలోకి అడుగుపెట్టేవారిలో ముందు వరుసలో వీరంతా ఉంటారు. ఐపీఎల్ 2023 సీజన్‌లో (IPL 2023) అదరగొట్టిన యువ ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం..
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మెగా టోర్నీతో సీనియర్లు ఫామ్‌లోకి వస్తారు. యువ ఆటగాళ్లు తమ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెబుతారు. ఇలాంటి వేదికను సరిగ్గా వినియోగించుకుంటే భవిష్యత్తులో జాతీయ జట్టులోకి తలుపులు తెరుచుకోవడం ఖాయం. మ్యాచ్ విజయాల్లో కీలక పాత్ర పోషించి మేం యువకులం కాదు.. యమ డేంజర్లమని నిరూపించుకున్నారు. ఇలా ఈ సీజన్‌లో తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న యువ క్రికెటర్ల గురించి తెలుసుకుందాం..
- యశస్వి జైస్వాల్: ఈ సీజన్‌లో అద్భుతంగా ఆడిన యువ క్రికెటర్ల జాబితాలో తొలి పేరు అతడిదే. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత తక్కువ బంతుల్లో (13) హాఫ్ సెంచరీ సాధించిన బ్యాటర్‌గా అవతరించాడు. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ కూడా ఇతడే. 14 మ్యాచుల్లో 625 పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకం కూడా ఉంది. అత్యధికంగా ఫోర్లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో రెండో వ్యక్తి. అందుకే, ఈ లెఫ్ట్‌హ్యాండర్‌ను జాతీయ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లూ వచ్చాయి. అత్యధికంగా వెచ్చించి (రూ. 4 కోట్లు) దక్కించుకున్న అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లలో యశస్వి ముందు వరుసలో ఉంటాడు. ఈసారి ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు సొంతమైంది.
- రింకు సింగ్: ఒకే ఒక్క మ్యాచ్‌తో రింకు సింగ్ పేరు మారుమోగిపోయింది. గుజరాత్ టైటాన్స్‌పై చివరి ఓవర్‌లో ఐదు సిక్స్‌లతో కోల్‌కతాను గెలిపించాడు. ఆ తర్వాత మిడిలార్డర్‌లో కేకేఆర్‌కు కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ సీజన్‌లో 14 మ్యాచుల్లో 474 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు అర్ధశతకాలు ఉన్నాయి. దూకుడుగా ఆడిన రింకు సింగ్‌ను గత వేలంలో కోల్‌కతా కేవలం రూ.55 లక్షలకే సొంతం చేసుకుందంటే నమ్మలేం కదా.. కోల్‌కతా ప్లేఆఫ్స్‌కు వెళ్లకపోయినా.. రింకు సింగ్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. రెండో క్వాలిఫయర్ మ్యాచ్ సందర్భంగా నరేంద్ర మోదీ స్టేడియం వద్ద రింకు సింగ్ కటౌట్ పెట్టడం విశేషం.
- తిలక్ వర్మ: ఈ హైదరాబాదీ కుర్రాడు ముంబయి ఇండియన్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఆడిన 11 మ్యాచుల్లో 343 పరుగులు సాధించాడు. సూర్యకుమార్‌యాదవ్, టిమ్ డేవిడ్ వంటి హార్డ్ హిట్టర్లు ఉన్నప్పటికీ తన ప్రభావం జట్టుపై పడేలా చేశాడు. తొలి గేమ్‌లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విరుచుకుపడ్డాడు. ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ జట్టుపైనా దూకుడుగా ఆడాడు. క్వాలిఫయర్ -2లోనూ గుజరాత్‌పై 14 బంతుల్లోనే 43 పరుగులు సాధించాడు. ఆ మ్యాచ్‌లో ముంబయి ఓడినా.. తిలక్ వర్మ ఇన్నింగ్స్ మాత్రం అద్భుతమే. ఇలాంటి ఆటగాడిని ముంబయి రూ. 1.70 కోట్లకు కొనుగోలు చేసింది.
- సాయి సుదర్శన్: గుజరాత్ టైటాన్స్‌లో బ్యాటర్లకు కొదవేంలేదు. కానీ, చెన్నైకి చెందిన యువ ఆటగాడు సాయి సుదర్శన్‌ను గుజరాత్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించింది. ఈ సీజన్‌లోనే అత్యంత నిలకడైన ఆటతీరును ప్రదర్శించిన బ్యాటర్ సాయి సుదర్శనే. గుజరాత్ టైటాన్స్ రూ. 20 లక్షలకే సొంతం చేసుకున్న సాయి గతేడాది ఐదు మ్యాచ్‌లు ఆడాడు. ఈసారి ఫైనల్ సహా ఎనిమిది మ్యాచుల్లో మెరిశాడు. ప్రతి మ్యాచ్‌లోనూ తన ప్రభావం చూపించాడు. సాయి 141.40 స్ట్రైక్‌రేట్‌తో 51.71 సగటున 362 పరుగులు సాధించాడు. ఇందులో చెన్నైపై కేవలం 47 బంతుల్లోనే 96 పరుగులు సాధించి అబ్బురిపరిచాడు.
- ఆకాశ్ మధ్వాల్: బుమ్రా, ఆర్చర్ లేని లోటును ముంబయి ఇండియన్స్‌కు తెలియనీయకుండా చేయడంలో ఆకాశ్ మధ్వాల్ బౌలింగ్‌లో రాణించాడు. ముంబయి తరఫున ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన మధ్వాల్ 14 వికెట్లు తీశాడు. ఇందులో 5/5 వంటి అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసి ముంబయి క్వాలిఫయర్ 2లోకి వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. చాలా ఆలస్యంగా క్రికెట్ కెరీర్‌ను ఎంచుకుని ముంబయి దృష్టిలో పడిన మధ్వాల్.. సీనియర్లు లేకపోవడంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. కేవలం రూ. 20 లక్షల బేస్ ప్రైస్‌కే మధ్వాల్ ముంబయి సొంతమయ్యాడు.
- తుషార్ దేశ్‌పాండే: ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ దళాన్ని నడిపిన బౌలర్‌కు పూర్వానుభవం కేవలం ఏడు మ్యాచ్‌లు మాత్రమే. అయినా, ఆరంభంలో ఇబ్బంది పడినప్పటికీ కీలక బౌలర్‌గా మారి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడే తుషార్ దేశ్‌పాండే. ఈ సీజన్‌లో 16 మ్యాచుల్లో 21 వికెట్లు తీశాడు. చెన్నై తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా మారాడు. దీనింతటికీ కారణం ఎంఎస్ ధోనీ నాయకత్వం వల్లేనని పాండే వినమ్రంగా చెబుతాడు. ఒకటీ రెండు మ్యాచుల్లో విఫలమైనప్పటికీ అవకాశాలు ఇస్తూ ఉండటం వల్ల నిరూపించుకోగలిగాడు. ఫైనల్ మ్యాచ్ మినహా మిగతా వాటిల్లో నాణ్యమైన ప్రదర్శనే ఇచ్చాడు. సీఎస్‌కే అతడిని రూ. 20 లక్షలకే దక్కించుకుని రాటుదేలేలా చేసింది.
- సుయాశ్ శర్మ: కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ వంటి విభిన్న స్పిన్నర్లు ఉన్నారు. వారిద్దరిని కాదని మూడో స్పిన్ బౌలర్‌కు అవకాశం రావడం కష్టమే. కానీ, తనకు వచ్చిన ఛాన్స్‌ను సుయాశ్ నిలబెట్టుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కీలక వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై డెబ్యూ మ్యాచ్‌లోనే అనుజ్ రావత్, దినేశ్ కార్తిక్ వంటి ప్రమాదకర బ్యాటర్లను ఔట్ చేశాడు. ఈ సీజన్‌లో మొత్తం 11 మ్యాచుల్లో 10 వికెట్లు తీశాడు. ఇతడిని కోల్‌కతా కేవలం రూ. 20 లక్షలకే సొంతం చేసుకుంది.
- నెహాల్ వధెరా: ఎలిమినేటర్ మ్యాచ్‌లో లఖ్‌నవూకు మంచి లక్ష్యం నిర్దేశించడంలో ముంబయి బ్యాటర్ నెహాల్ వధెరాదే కీలక పాత్ర. కేవలం చివర్లో బ్యాటింగ్‌కు దిగిన వధెరా కేవలం 12 బంతుల్లోనే 23 పరుగులు సాధించాడు. ఇవే ముంబయి గెలవడంలో కీలక పాత్ర పోషించింది. వన్‌డౌన్‌తోపాటు మిడిలార్డర్‌లో ఆడిన వధెరా 14 మ్యాచుల్లోని 10 ఇన్నింగ్స్‌ల్లో 241 పరుగులు సాధించాడు. డెత్ ఓవర్లలో దూకుడుగా ఆడటంలో వధెరా తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.
- మయాంక్ మార్కండే: గత కొన్ని సీజన్ల నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ అద్భుతంగా ఉండేది. కానీ, ఈ సారి మాత్రం గొప్పగా ఏమీ లేదు. వాషింగ్టన్ సుందర్ గాయపడటంతో స్పిన్ విభాగం బలహీనంగా మారింది. కానీ, మయాంక్ మార్కండే మాత్రం అతి తక్కువ ఎకామనీతో ప్రత్యర్థులను కట్టిపడేశాడు. పది మ్యాచుల్లో 7.89 ఎకానమీతో 12 వికెట్లు పడగొట్టాడు. భువీ (16) తర్వాత అత్యధిక వికెట్లు తీసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కావడం గమనార్హం. అయితే, భువనేశ్వర్ కంటే తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశాడు.
- యశ్ ఠాకూర్: ఎలిమినేటర్ మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఓడిపోయింది. కానీ, ఆ జట్టు బౌలర్ యశ్ ఠాకూర్ ప్రదర్శన మాత్రం ఆకట్టుకుంది. ముంబయి కీలక బ్యాటర్లు ఇషాన్ కిషన్, టిమ్ డేవిడ్, నెహాల్ వధెరాను ఔట్ చేసి సంచలన బౌలింగ్ చేశాడు. ఈ సీజన్‌లో యశ్ ఠాకూర్ 9 మ్యాచుల్లో 13 వికెట్లు తీశాడు. ఎకానమీ కాస్త ఎక్కువగా (9.07) ఉన్నప్పటికీ బౌలింగ్ వైవిధ్యం మాత్రం అద్భుతంగా ఉంది. యశ్ ఠాకూర్ కోసం గత వేలంలో పంజాబ్, లఖ్‌నవూ మధ్య మంచి పోటీ వచ్చింది. రూ. 20 లక్షల బేస్ ప్రైస్‌తో బరిలోకి దిగిన యశ్ చివరికి రూ. 45 లక్షలను తన ఖాతాలో వేసుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TSPSC: టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌ను తొలగించాలి.. ఓయూలో విద్యార్థుల ఆందోళన
-
Vande bharat express: కాచిగూడ- యశ్వంత్‌పూర్, చెన్నై- విజయవాడ టికెట్ ధరలివే..!
-
High Speed Train: ఆరు నెలల్లో హైస్పీడ్ ట్రైన్.. వెల్లడించిన రైల్వే మంత్రి
-
Vizag: గోనెసంచిలో చుట్టి సముద్రంలో పడేసి.. విశాఖలో బాలుడి హత్య
-
ICC Rankings: మనోళ్లే కింగ్స్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ ఆధిపత్యం
-
Vivek Ramaswamy: వివేక్ రామస్వామితో డిన్నర్ ఆఫర్.. ఒక్కొక్కరికి 50 వేల డాలర్లపైమాటే!