IPL: అటు తుషార్‌.. ఇటు సుదర్శన్‌: తొలి మ్యాచ్‌లోనే అమల్లోకి ఇంపాక్ట్‌ ప్లేయర్‌ విధానం

ఐపీఎల్‌ సీజన్‌ 16 ఆరంభానికి ముందే చర్చకు కారణమై.. అందరిలోనూ ఆసక్తి రేపిన ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ విధానం తొలి మ్యాచ్‌లోనే అమల్లోకి వచ్చింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు తుషార్‌ దేశ్‌పాండే..

Updated : 01 Apr 2023 09:40 IST

పీఎల్‌ సీజన్‌ 16 ఆరంభానికి ముందే చర్చకు కారణమై.. అందరిలోనూ ఆసక్తి రేపిన ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ విధానం తొలి మ్యాచ్‌లోనే అమల్లోకి వచ్చింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు తుషార్‌ దేశ్‌పాండే.. తొలి ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా నిలిచాడు. చెన్నై బ్యాటింగ్‌ ముగిశాక.. గుజరాత్‌ ఇన్నింగ్స్‌ ఆరంభానికి ముందు అంబటి రాయుడు స్థానంలో తుషార్‌ మైదానంలోకి వచ్చాడు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లోనే తన బౌలింగ్‌ దాడి మొదలెట్టాడు. అంతకుముందు బ్యాటింగ్‌లో రాయుడు 12 పరుగులు చేశాడు. గుజరాత్‌ కూడా ఈ మ్యాచ్‌లోనే ఇంపాక్ట్‌ ప్లేయర్‌ విధానాన్ని వాడుకుంది. ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడ్డ విలియమ్సన్‌ స్థానంలో సాయి సుదర్శన్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఆడాడు. సాహా ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చాడు. మ్యాచ్‌ ఆరంభానికి ముందు తుది 11 మంది ఆటగాళ్లతో పాటు అయిదుగురు సబ్‌స్టిట్యూట్‌లను ప్రతి జట్టు ప్రకటించాలి. ఈ సబ్‌స్టిట్యూట్‌ల నుంచి ఒకరిని ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఎంచుకోవచ్చు. రాయుడు బౌలింగ్‌ చేయలేడు కాబట్టి అతని స్థానంలో అదనపు బౌలర్‌గా తుషార్‌ను చెన్నై తీసుకుంది.

గుజరాత్‌ జట్టు కూడా ఫీల్డింగ్‌లో బౌండరీ దగ్గర బంతిని ఆపే ప్రయత్నంలో మోకాలి గాయానికి గురైన విలియమ్సన్‌ బ్యాటింగ్‌కు రాలేడు కాబట్టి సుదర్శన్‌ను తీసుకున్నారు. అదే సబ్‌స్టిట్యూట్‌ అయితే కేవలం ఫీల్డింగ్‌ మాత్రమే చేసేవాడు. అప్పుడు గుజరాత్‌లో 10 మంది మాత్రమే బ్యాటింగ్‌కు వచ్చే ఆస్కారముండేది. ఇప్పుడు ఇంపాక్ట్‌ ప్లేయర్‌ కారణంగా మరో బ్యాటర్‌ను తీసుకునే అవకాశం దక్కింది. వైడ్‌, నోబ్‌ బాల్‌ విషయంలో అంపైర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేసే అవకాశాన్ని తొలి మ్యాచ్‌లోనే ఆటగాళ్లు ఉపయోగించుకున్నారు. గుజరాత్‌ బ్యాటింగ్‌ సమయంలో ఇన్నింగ్స్‌ 14వ ఓవర్లో శుభ్‌మన్‌ నోబ్‌ కోసం, 18వ ఓవర్లో వైడ్‌ కోసం విజయ్‌ శంకర్‌ రివ్యూ కోరారు. ఈ రెండు సమీక్షలు వృథా అయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని