Virat Kohli: వన్డే జట్టు సారథిగా విరాట్‌ గుర్తుండిపోయే ‘పంచ’ విజయాలు

 గత పాతికేళ్ల భారత క్రికెట్‌ చరిత్రను ఓసారి పరిశీలిస్తే.. సౌరభ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ తర్వాత...

Updated : 09 Dec 2021 20:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్: గత పాతికేళ్ల భారత క్రికెట్‌ చరిత్రను ఓసారి పరిశీలిస్తే.. సౌరభ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ తర్వాత విరాట్ కోహ్లీ అత్యుత్తమ సారథులుగా గుర్తింపు పొందాడు. కొన్ని సిరీస్‌లకు సచిన్‌, రాహుల్‌ ద్రవిడ్‌ కెప్టెన్లుగా పని చేసినా.. పెద్దగా విజయం సాధించలేకపోయారు. అయితే ఆటపరంగా వారు ఎప్పుడూ దిగ్గజాలే. విరాట్ కోహ్లీ అటు ఆటలోనూ.. ఇటు నాయకత్వంలోనూ ప్రతిభ చూపాడు. అయితే ఒక్కటంటే ఒక్క ఐసీసీ ట్రోఫీని గెలుచుకోలేకపోవడం జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకం. టీ20 కెప్టెన్సీ నుంచి తనకు తానే తప్పుకున్న విరాట్‌.. వన్డే జట్టు పగ్గాలూ చేజారతాయని ఊహించి ఉండడు. విరాట్‌ కోహ్లీకి షాక్ ఇస్తూ రోహిత్‌ శర్మను వన్డే, టీ20 జట్లకు సారథిగా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. 

విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఎన్నో అపూర్వ విజయాలను భారత జట్టుకు అందించాడు. ఇతర సారథుల కంటే విజయాల శాతం కూడా ఎక్కువే. కోహ్లీ సారథ్యంలో 95 వన్డేలు ఆడిన టీమ్‌ఇండియా 65 మ్యాచుల్లో (70.43%) విజయం సాధించింది. కెప్టెన్‌గా బ్యాటింగ్ యావరేజ్‌ 72.65 ఉండటం విశేషం. సారథిగా ఇరవై ఒక్క శతకాలతో 5,449 పరుగులు చేశాడు. సారథిగా 21 సెంచరీలు చేసిన కోహ్లీ తొలి భారతీయ కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. అలానే అంతర్జాతీయంగా రికీ పాంటింగ్ (22) తర్వాత రెండోస్థానం విరాట్ కోహ్లీది. మరి అలాంటి సారథి నాయకత్వంలో అనేక విజయాలను సొంతం చేసుకున్నప్పటికీ.. జీవితంలో కోహ్లీ అభిమానులు మరిచిపోలేని టాప్‌-5 విజయాలుగా వీటిని చెప్పొచ్చు. మరి అవేంటో ఓ సారి పరిశీలిద్దాం..

ఐదేళ్ల కిందట సారథిగా తొలి వన్డే మ్యాచ్‌

దాదాపు మూడు నెలల సుదీర్ఘ పర్యటనకు ఇంగ్లాండ్‌ జట్టు భారత్‌కు వచ్చింది.  9 నవంబర్ 2016 నుంచి 1 ఫిబ్రవరి 2017 వరకు పర్యటన సాగింది. ఐదు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడింది. మహేంద్ర సింగ్‌ ధోనీ కెప్టెన్సీని వదులుకోవడంతో పూర్తిస్థాయిలో అన్ని ఫార్మాట్లకు సారథిగా కోహ్లీ ఎంపికయ్యాడు. టెస్టు సిరీస్‌ను 4-0, వన్డే, టీ20 సిరీస్‌లను భారత్‌ 2-1తేడాతో కైవసం చేసుకుంది. అప్పటి వరకు ధోనీ నాయకత్వంలో బ్యాటింగ్‌లో కోహ్లీ అదరగొట్టాడు. అయితే తొలిసారి సారథిగా బ్యాటింగ్‌లోనూ రాణించి జట్టును ముందుడి నడిపించిన సందర్భం మాత్రం ఈ సిరీస్‌లోనే.  తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ నిర్దేశించిన 351 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో శతకం చేసి కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన పర్యాటక జట్టు బ్యాటర్లు జాసన్ రాయ్ (73), జో రూట్ (78), బెన్ స్టోక్స్ (62) రాణించడంతో 350 పరుగులు చేసింది. అనంతరం భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. శిఖర్‌ ధావన్‌ (1), కేఎల్‌ రాహుల్‌  (8), యువరాజ్‌ సింగ్‌ (15), ఎంఎస్ ధోనీ (6) విఫలం కావడంతో టీమ్‌ఇండియా కష్టాల్లో పడింది. అయితే కేదార్‌ జాదవ్‌ (76 బంతుల్లో 120), విరాట్ కోహ్లీ (105 బంతుల్లో 122) విజృంభించి విజయానికి బాటలు వేశారు. వీరిద్దరూ కలిసి ద్విశతక భాగస్వామ్యం నిర్మించారు. ఆఖర్లో హార్దిక్‌ పాండ్య (40*) ధాటిగా ఆడటంతో భారత్‌ విజయం సాధించింది. 

బౌలర్లను వినియోగించుకోవడంలోనూ నేర్పరే

సారథి అనేవాడు బ్యాటర్‌/బౌలర్‌గా ఎంత రాణించినా.. టీమ్‌లోని మిగతా ఆటగాళ్లను సమన్వయం చేసుకుంటూ పోతేనే జట్టుకు విజయాలను అందించగలడు. ఇంగ్లాండ్‌తో తొలి మ్యాచ్‌లో కీలక సమయంలో బ్యాటర్‌గా ఆదుకున్న కోహ్లీ.. రెండో మ్యాచ్‌లో తన సారథ్య సత్తా ఏంటో చూపించాడు. ఇదే సిరీస్‌లో రెండో మ్యాచ్‌ కూడానూ ఉత్కంఠభరితంగా సాగింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్‌ 381 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువరాజ్‌ సింగ్‌ (150), ఎంఎస్ ధోనీ (134) శతకాలు బాదేశారు. అయితే కటక్‌ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలించడంతో ఇంగ్లాండ్‌ కూడా దీటుగానే బదులిచ్చింది. ఆ జట్టు సారథి ఇయాన్‌ మోర్గాన్‌ (102), జాసన్‌ రాయ్‌ (82), జో రూట్ (54), మొయిన్‌ అలీ (55) రాణించడంతో ఒక దశలో ఇంగ్లాండ్‌ విజయం సాధిస్తుందేమోనని టీమ్‌ఇండియా అభిమానులు కాస్త కలవరపడ్డారు. అయితే కోహ్లీ తనదైన శైలిలో బౌలర్లను మారుస్తూ ప్రయోగించడంతో ఇంగ్లాండ్‌ ఆఖరికి 366 పరుగులకు పరిమితమైంది. దీంతో భారత్‌ పదిహేను పరుగుల తేడాతో రెండో మ్యాచ్‌ను నెగ్గి మూడు వన్డేల సిరీస్‌ను అప్పటికే కైవసం చేసుకుంది. ఆఖరి మ్యచ్‌లో ఇంగ్లాండ్‌ గెలిచినా సిరీస్‌ 2-1 తేడాతో భారత్‌ వశమైంది. 

అప్పుడు గెలిచాడు.. మొన్న ఓడాడు

భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటేనే సర్వత్రా ఉత్కంఠ. అదీనూ ఐసీసీ ప్రపంచకప్‌ల్లో అయితే మరీనూ.. వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు పాక్‌ చేతిలో టీమ్‌ఇండియా ఎప్పుడూ ఓడిపోలేదు. పాయింట్ల పద్ధతిలో జరిగిన 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ టాప్‌ స్థానంలో దూసుకెళ్లింది. అయితే సెమీస్‌లో న్యూజిలాండ్‌ చేతిలో పరాభవం కావడంతో కప్‌ ఆశలు చెదిరాయి. అంతేకాకుండా ఎంఎస్ ధోనీ వన్డే కెరీర్‌కూ ముగింపు పలికాల్సి వచ్చింది. అయితే ఆ మెగా టోర్నీలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా చెలరేగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 336 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (140), కోహ్లీ (77), కేఎల్ రాహుల్ (57), హార్దిక్‌ పాండ్య (26) రాణించారు. అయితే వర్షం కారణంగా మ్యాచ్‌ను 40 ఓవర్లకే కుదించారు. 301 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ కేవలం 212/6 స్కోరుకే కట్టడైంది. ఫఖర్ జమాన్ (62), బాబర్‌ అజామ్ (48) కాస్త కంగారు పెట్టినా.. భారత సారథి కోహ్లీ తన బౌలర్లను సమర్థవంతంగా వినియోగించుకుని పాక్‌ను ఓడించాడు. అయితే మొన్న టీ20 ప్రపంచకప్‌లో మాత్రం తన నాయకత్వంతో టీమ్ఇండియాను గట్టెక్కించలేకపోయాడు. వరుసగా కివీస్‌ చేతిలోనూ ఓటమిపాలు కావడంతో భారత్‌ లీగ్‌ దశ నుంచే ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. 

విదేశీ పిచ్‌ల మీద సత్తా చాటి.. 

గంగూలీ, ఎంఎస్ ధోనీ వంటి దిగ్గజ సారథులకు సాధ్యం కాని ఎన్నో ఫీట్‌లను కోహ్లీ సాధించాడు. విదేశీ గడ్డ మీద భారత జట్టు విజయాలు ఎడారిలో ఒయాసిస్‌లా ఉండేవి. అయితే కోహ్లీ సారథిగా ఎంపికైన తర్వాత టీమ్‌ఇండియా విదేశీగడ్డ మీద సిరీస్‌ల గెలుపు రుచిని చూసిందనే చెప్పాలి. 2018లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మూడు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో సౌతాఫ్రికా కైవసం చేసుకోగా.. ఆరు వన్డేల సిరీస్‌ను భారత్‌ 5-1 తేడాతో గెలుచుకోవడం విశేషం. అలానే మూడు టీ20ల సిరీసూ 2-1తో మన సొంతమైంది. తొలుత వరుసగా మూడు వన్డేలను గెలిచిన టీమ్ఇండియాకు నాలుగో మ్యాచ్‌లో ఎదురుదెబ్బ తగిలింది. ఓటమి తప్పలేదు. దీంతో ఆఖరి రెండు మ్యాచ్‌లు కీలకమయ్యాయి. ఐదో వన్డేలో ధాటిగా ఆడిన భారత్‌ రోహిత్ (115) శతకం చేయడంతో 274 పరుగులు చేసింది. అనంతరం బౌలర్లను చాకచక్యంగా వినియోగించిన కోహ్లీ చక్కని ఫలితాన్ని రాబట్టాడు. కుల్‌దీప్ (4/57), చాహల్ (2/43), హార్దిక్ (2/30), బుమ్రా (1/22) చెలరేగడంతో విజయంతోపాటు మరొక మ్యాచ్‌ ఉండగానే సిరీసూ భారత సొంతమైంది. 

అదే వన్డే సారథిగా చివరి మ్యాచ్

విరాట్ కోహ్లీ భారత జట్టు వన్డే కెప్టెన్‌గా తన ఆఖరి మ్యాచ్‌ ఈ ఏడాది మార్చిలోనే ఆడేశాడు. రెండు నెలల పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్‌తో మూడో వన్డే మ్యాచే కోహ్లీ సారథ్యానికి చివరిది. ఇది కోహ్లీకి జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన మ్యాచ్‌. అయితే ఉత్కంఠభరితంగా సాగిన ఆ మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటర్‌గా రాణించకపోయినా.. కెప్టెన్‌గా మాత్రం జట్టును విజయపథంలో నడిపాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 329 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్‌ 322 పరుగులకే పరిమితమై ఏడు పరుగులతో ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (7) విఫలమయ్యాడు. మరి ఈ నెలాఖరులో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. టెస్టులకు కోహ్లీనే సారథ్యం వహిస్తుండగా.. మూడు వన్డేల సిరీస్‌కు రోహిత్‌ కెప్టెన్సీ చేస్తాడు. మరి ఆ సిరీస్‌లోనైనా బ్యాటర్‌గా కోహ్లీ రాణించాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు.

Read latest Sports News and Telugu News

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని