Harshal Patel: ఒకే సమయంలో బాధ - ఆనందం కలిగిన క్షణాలవే: హర్షల్‌ పటేల్

ఐపీఎల్‌ (IPL)లో విజయవంతమైన బౌలర్లలో ఆర్‌సీబీ ఆటగాడు హర్షల్‌ పటేల్‌ కూడా ఉంటాడు. ఇటీవలే అత్యంత వేగంగా ఐపీఎల్‌లో వంద వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

Published : 15 Apr 2023 20:37 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత వేగంగా వంద వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) ఆటగాడు హర్షల్‌ పటేల్ (Harshal Patel) అవతరించాడు. ఐదు రోజుల కిందట లఖ్‌నవూపై రెండు వికెట్లను తీయడంతో ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న భువనేశ్వర్ కుమార్‌ 81 ఇన్నింగ్స్‌ల్లో వంద వికెట్లు తీయగా.. ఇప్పుడు హర్షల్‌ 79 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ మార్క్‌ను తాకాడు. అంతర్జాతీయంగా ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లను తీసిన బౌలర్లలో మూడో ఆటగాడు కావడం విశేషం. హర్షల్‌ కంటే ముందు రబాడ (64 ఇన్నింగ్స్‌లు), లసిత్ మలింగ (70 ఇన్నింగ్స్‌లు) తొలి రెండు స్థానాల్లో నిలిచారు. మూడో స్థానంలో నిలవడంపై ఆనందం వ్యక్తం చేసిన హర్షల్‌ పటేల్.. ఆర్‌సీబీ బ్రాడ్‌కాస్ట్‌తో మాట్లాడుతూ తన జీవితంలో కొద్దిరోజుల వ్యవధిలో సంతోషం- దుఃఖం చోటు చేసుకున్న సంఘటనను గుర్తు చేసుకున్నాడు. 

‘‘నేను క్వారంటైన్‌లో ఉన్నప్పుడు మా సోదరి మరణవార్త విన్నాను. ఆ సమయంలో ఒంటరిగా ఉండటంతో బాగా ఏడ్చేశాను. బంధువుల నుంచి ఫోన్లు ఎక్కువగా వచ్చాయి. ఆ సమయంలో బాధను పంచుకోవడానికి కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నారు. ఆ వెంటనే నేను బయోబబుల్‌ను వీడి ఇంటికి వెళ్లిపోయా. ఆ సంఘటన జరిగిన వారం రోజుల తర్వాత నాకు కొడుకు పుట్టాడు. పది రోజుల వ్యవధిలోనే బాధ, సంతోషం అనుభవించా. ఆ సమయంలో ఎలా ప్రవర్తించాలో కూడా అర్థం కాలేదు. అయితే, నా కొడుకును చూసినప్పుడు మనసుకు సంతోషంగా అనిపించింది’’ అని హర్షల్‌ తెలిపాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని