Published : 12 Jan 2021 18:43 IST

మన క్రికెటర్లకి.. అంతా బంగారు తల్లులే 

‘మా ఇంటికి మహాలక్ష్మి వచ్చేసింది. మేం ఈ విషయం మీతో పంచుకోవడం థ్రిల్‌గా, సంతోషంగా ఫీలవుతున్నాం’ అంటూ అమ్మాయి పుట్టగానే ట్విట్టర్‌లో ప్రకటించేశాడు విరాట్‌ కోహ్లీ. అదేం చిత్రమో, కాకతాళీయమోగానీ కొన్నేళ్ల నుంచి భారత క్రికెటర్లలో అత్యధికులు ‘మా ఇంటికి బంగారు తల్లి వచ్చేసిందోచ్‌’ అనే చెబుతున్నారు. ఒక్కసారి ఆ ముద్దుల తనయల సంగతులేంటో చూద్దామా! 

* హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మ- రితికా సజ్దాల ముద్దుల కూతురు పేరు సమైరా. ఏమాత్రం ఖాళీ దొరికినా రోహిత్‌ సమైరాతో గడపడానికే అధిక ప్రాధాన్యం ఇస్తాడు. అతడి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ ఫొటోలు సమైరావే. టూర్లలో ఉన్నప్పుడు తనని మిస్‌ అవుతున్నానని ట్వీట్‌తుంటాడు రోహిత్‌.

* తాజా మిస్టర్‌ వాల్‌ ఛేతేశ్వర్‌ పుజారాకి మొదటి సంతానం అమ్మాయి అదితి. రెండేళ్ల వయసే అయినా తను అల్లరి పిడుగు. భార్య పూజాతో కలిసి ఆ చిన్నారి చేసే అల్లరి ఫొటోలు, వీడియోల్ని సామాజిక మాధ్యమాల్లో పెడుతుంటాడు పుజారా.

* ఆస్ట్రేలియా టూరులో జట్టును ముందుండి నడిపిస్తున్న వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే 2014లో చిన్ననాటి స్నేహితురాలు రాధికను పెళ్లాడాడు. ఆ ఇద్దరి సంతానమే ఆర్యా రహానే. ఆర్యాకి దగ్గరుండి పాలు పట్టించడం, పాటలు పాడుతూ ఆడించడం.. ఇలాంటి వీడియోలెన్నో అప్‌లోడ్‌ చేస్తుంటాడు రహానే.

* బంతిని గింగిరాలు తిప్పుతూ బ్యాట్స్‌మెన్‌ని బోల్తా కొట్టించే రవిచంద్రన్‌ అశ్విన్‌ది ప్రీతీ నారాయణన్‌తో పెద్దలు కుదిర్చిన వివాహం. వీళ్లిద్దరికి చూడచక్కని కూతుళ్లు ఆద్యా, అకీరాలు. ముద్దుముద్దు మాటలతో ట్విట్టర్‌లో భలే సందడి చేస్తుంటారు. కొవిడ్‌ జాగ్రత్తలు తీసుకొమ్మంటూ వాళ్లు నాన్నకి జాగ్రత్తలు చెప్పిన వీడియో వైరల్‌ అయ్యింది.

* ‘సర్‌’ రవీంద్ర జడేజా తొలి గారాలపట్టి పాపనే. పేరు నిద్యానా. తను పుట్టినప్పుడు ‘మా ఇంటికి చిన్నారి రాకుమార్తె వచ్చింది. నా ఇంటిని వెలుగులమయం చేసింది’ అంటూ అందరితో సంతోషం పంచుకున్నాడు. తను పుట్టినప్పటి నుంచే ఆటలో మరింతగా రాణిస్తున్నాని చెబుతుంటాడు జడ్డూ.

* ఫాస్ట్‌ బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌ ఈమధ్యే తండ్రయ్యాడు. పుట్టింది అమ్మాయేనని ఇక వేరే చెప్పాలా? ‘ఇట్స్‌ ఏ గర్ల్‌. వెల్‌కం టూ ది వరల్డ్‌ లిటిల్‌ ప్రిన్సెస్‌’ అంటూ జనవరి 1, 2021న తన చిన్నారికి స్వాగతం పలికాడు యాదవ్‌.

* సురేశ్‌ రైనా- ప్రియాంకా చౌధురీల ఇంటిదీపం గ్రేసీ రైనా. రైనాకి కూతురిపై ఎంత ప్రేమంటే తన పేరు చేతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు.

* హర్భజన్‌సింగ్‌- గీతా బస్రాల కూతురు హినాయా సింగ్‌. హినాయా అంటే మెరుపు అని అర్థం.

* మిస్టర్‌ కూల్‌ మాజీ కెప్టెన్‌ ఎం.ఎస్‌.ధోనీ-సాక్షిల కూతురు జివా ఎంత పాపులరో వేరే చెప్పనక్కర్లేదు. ఐదేళ్ల ఈ క్యూట్‌ గాళ్‌కి ఓ ఎండార్స్‌మెంట్‌ కూడా వచ్చేసిందండోయ్‌.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని