Team India : కోచ్‌కు కూడా విశ్రాంతి.. భారత్‌ రొటేషన్ సూపర్‌: పాక్‌ మాజీ కెప్టెన్‌

ఆటగాళ్లను వివిధ స్థానాల్లో ఆడిస్తూ టీమ్‌ఇండియా చేస్తున్న రొటేషన్‌ పద్ధతి చాలా బాగుందని పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు...

Published : 14 Aug 2022 16:25 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆటగాళ్లను వివిధ స్థానాల్లో ఆడిస్తూ టీమ్‌ఇండియా చేస్తున్న రొటేషన్‌ పద్ధతి చాలా బాగుందని పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ భట్‌ కొనియాడాడు. సీనియర్‌ ఆటగాళ్లకు విశ్రాంతినిస్తూ యువకులకు మరిన్ని అవకాశాలు కల్పించడం మంచి విషయమని పేర్కొన్నాడు. భారత క్రికెట్‌ జట్టు యాజమాన్యం చేపడుతున్న రొటేషన్‌ పాలసీ వల్ల రిజర్వ్‌ బెంచ్‌ బలోపేతమవుతుందని తెలిపాడు. గత టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్‌ స్టేజ్‌కే పరిమితమై ఇంటిముఖం పట్టిన భారత్‌.. ఆ తర్వాత అనేక ప్రయోగాలకు తెర తీసింది. ఈ నేపథ్యంలో అక్టోబర్‌లో జరిగే పొట్టి ప్రపంచకప్‌ నాటికి అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకోవడం మంచిదని భట్‌ అన్నాడు. పని ఒత్తిడి, కొందరు గాయాలపాలు కావడం వల్ల రొటేషన్‌ పద్ధతిని ప్రవేశపెట్టడం తేలికగా మారిందని అభిప్రాయపడ్డాడు. రొటేషన్ పద్ధతి భారత్‌కు సాధారణ ప్రక్రియగా మారిపోయిందన్నాడు.

‘‘ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీ హెడ్ వీవీఎస్‌ లక్ష్మణ్‌ నేతృత్వంలోని టీమ్ఇండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. కీలక ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడంతోపాటు ప్రధాన కోచ్‌ రాహుల్‌ కూడా విరామం తీసుకోవడం విశేషం. మానవ వనరులను వృద్ధి చేసుకోవడంలో టీమ్‌ఇండియా క్రికెట్‌లో అద్భుత పరిణామం. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో భారత టీ20 లీగ్‌లా విస్తరించే అవకాశాలు ఉంటాయి. ప్లేయర్లకు రొటేషన్‌ పద్ధతి వల్ల మరిన్ని ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. ప్రతి సిరీస్‌ను ఒకే ఆటగాళ్ల బృందం ఆడకుండా కొత్తవారికి అవకాశం లభిస్తుంది. దీని వల్ల యువతకు కలిసొస్తుంది. సీనియర్ల గైర్హాజరీలో తమ సత్తాను చాటుకోవాలని యువ క్రికెటర్లు భావిస్తారు. అంతేకాకుండా బ్యాటింగ్‌, బౌలింగ్‌ ఆర్డర్‌లో విభిన్న కాంబినేషన్లను ప్రయత్నిస్తూ టీమ్‌ఇండియా తమ ఆప్షన్లను పెంచుకుంటుంది’’ అని సల్మాన్ భట్ తెలిపాడు. కేఎల్‌ రాహుల్ నాయకత్వంలోని భారత్‌ ఆగస్ట్ 18 నుంచి జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ను ఆడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని