Updated : 07 Feb 2022 18:23 IST

Rohit - Kohli : అదంతా నాన్సెన్స్‌.. వాళ్లిద్దరి మధ్య గొడవల్లేవు : సునీల్‌ గావస్కర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌ : టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ రోహిత్‌ శర్మ మధ్య విభేదాలున్నాయంటూ.. వస్తున్న వదంతులను క్రికెట్‌ దిగ్గజం సునీల్ గావస్కర్‌ కొట్టి పారేశాడు. అవాస్తవాలను ప్రచారం చేస్తున్న మీడియాపై మండిపడ్డాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో.. విరాట్‌ సూచన మేరకు రోహిత్‌ డీఆర్‌ఎస్‌ ద్వారా వికెట్‌ సాధించిన విషయం తెలిసిందే. వారి మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పడానికి ఇదే నిదర్శనమని గావస్కర్‌ అన్నాడు.

‘రోహిత్‌, కోహ్లీ ఇద్దరూ భారత జట్టు కోసం కష్టపడుతున్నారు. అలాంటప్పుడు వాళ్లిద్దరి మధ్య విభేదాలు ఎందుకు ఉంటాయి? ఎవరో కావాలనే ఇలాంటి వధంతులు పుట్టించారు. మీడియాలో వీళ్ల గురించి వస్తున్నవన్నీ ఊహాగానాలే. చాలా ఏళ్లుగా అవే ప్రచారం అవుతున్నాయి. నిజమేంటో వాళ్లిద్దరికీ తెలుసు. కాబట్టి, ఇలాంటి వదంతుల గురించి పెద్దగా పట్టించుకోకుండా.. తమ పని తాము చేసుకుపోతున్నారు. అలాగే, టీమ్‌ఇండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ విజయవంతం కాకూడదని కోహ్లీ కోరుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. అదంతా నాన్‌సెన్స్‌. వారిద్దరి మధ్య మంచి సఖ్యత ఉంది. మైదానంలో ఒకరికి ఒకరు సహకరించుకుంటూ భారత జట్టును మరింత ముందుకు తీసుకెళ్తారు. టీమ్‌ఇండియా తరఫున ఆడుతున్న బ్యాటర్లు పరుగులు చేయకున్నా.. బౌలర్‌ వికెట్లు తీయడంలో విఫలమైనా జట్టులో స్థానం కోల్పోవడం ఖాయం. దిగ్గజ ఆటగాళ్లకైనా అది తప్పదు. కోహ్లీ ఎవరి సారథ్యంలో ఆడినా.. జట్టు కోసం కచ్చితంగా మెరుగ్గా రాణిస్తాడు. భారీగా పరుగులు చేస్తాడు’ అని సునీల్ గావస్కర్‌ పేర్కొన్నాడు.

వెస్టిండీస్‌తో జరిగిన చారిత్రక 1000వ వన్డే మ్యాచ్‌ ద్వారా పూర్తి స్థాయి కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ బాధ్యతలు చేపట్టాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌, కోహ్లీల మధ్య ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో యుజ్వేంద్ర చాహల్ వేసిన 22వ ఓవర్లో.. బంతి బ్రూక్స్‌ బ్యాట్‌ అంచును తాకుతూ వెళ్లి వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ చేతుల్లో పడింది. అయినా, భారత్‌ చేసిన అప్పీల్‌ను ఫీల్డ్‌ అంపైర్ తిరస్కరించాడు. ఆ సమయంలో రోహిత్‌ దగ్గరకు వచ్చిన కోహ్లి.. ‘రోహిత్‌ బంతి.. బ్యాటును తాకింది. బ్యాటు ప్యాడ్లను తాకింది. నేను శబ్దం స్పష్టంగా విన్నా. ఇది కచ్చితంగా ఔటే’ అని చెప్పడం వినిపించింది. దీంతో రోహిత్‌ సమీక్ష కోరగా బంతి ఎడ్జ్‌ అయినట్లు తేలింది. భారత్‌కు వికెట్‌ దక్కింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని