IND vs AUS: ఆఖరిది ఆసీస్‌కు

ఆసీస్‌ను వైట్‌వాష్‌ చేయాలన్న భారత్‌ ఆశ నెరవేరలేదు. ప్రపంచకప్‌నకు ముందు చాలా విధాలుగా సంతృప్తినిచ్చిన వన్డే సిరీస్‌ను ఆ జట్టు ఓటమితో ముగించింది.

Updated : 28 Sep 2023 06:54 IST

మెరిసిన మ్యాక్స్‌వెల్‌, మార్ష్‌
చివరి వన్డేలో భారత్‌ పరాజయం

ఆసీస్‌ను వైట్‌వాష్‌ చేయాలన్న భారత్‌ ఆశ నెరవేరలేదు. ప్రపంచకప్‌నకు ముందు చాలా విధాలుగా సంతృప్తినిచ్చిన వన్డే సిరీస్‌ను ఆ జట్టు ఓటమితో ముగించింది. రోహిత్‌ అదరగొట్టినా.. మిడిల్‌ ఆర్డర్‌ తడబడడంతో ఆఖరి మ్యాచ్‌లో భారత్‌కు నిరాశ తప్పలేదు. ఆఫ్‌స్పిన్‌తో మ్యాక్స్‌వెల్‌, మెరుపు బ్యాటింగ్‌తో మార్ష్‌ ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించారు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి సిరీస్‌ను కోల్పోయిన కంగారూలకు.. ప్రపంచకప్‌ ముంగిట ఈ విజయం కాస్త ఊరట.

రాజ్‌కోట్‌

మిడిల్‌ ఆర్డర్‌ నిరాశపరచడంతో బుధవారం జరిగిన చివరిదైన వన్డేలో భారత్‌ 66 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. మిచెల్‌ మార్ష్‌ (96; 84 బంతుల్లో 13×4, 3×6), స్మిత్‌ (74; 61 బంతుల్లో 8×4, 1×6), లబుషేన్‌ (72; 58 బంతుల్లో 9×4), వార్నర్‌ (56; 34 బంతుల్లో 6×4, 4×6) చెలరేగడంతో మొదట ఆసీస్‌ 7 వికెట్లకు 352 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (81; 57 బంతుల్లో 5×4, 6×6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడినా.. ఛేదనలో భారత్‌ 49.4 ఓవర్లలో 286 పరుగులకే ఆలౌటైంది. కోహ్లి (56; 61 బంతుల్లో 5×4, 1×6), శ్రేయస్‌ అయ్యర్‌ (48; 43 బంతుల్లో 1×4, 2×6) రాణించారు. పార్ట్‌ టైమ్‌ స్పిన్నర్‌ మ్యాక్స్‌వెల్‌ (4/40) తన స్పిన్‌తో టీమ్‌ఇండియా పతనాన్ని శాసించాడు. అతడే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు. గిల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు లభించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్‌ 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది.

ఆరంభం బాగున్నా..: ఛేదనలో భారత్‌కు శుభారంభమే లభించింది. ఇషాన్‌ కిషన్‌ గైర్హాజరీలో రోహిత్‌తో కలిసి సుందర్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించాడు. అతడు సాధికారికంగా ఆడలేకయినా.. రోహిత్‌ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. కళ్లు చెదిరే షాట్లు ఆడిన అతడు.. ఎడాపెడా సిక్స్‌లతో అభిమానులను ఉర్రూతలూగించాడు. 11వ ఓవర్లో సుందర్‌ ఔటయ్యేటప్పటికి భారత్‌ స్కోరు 74. ఆ తర్వాత రోహిత్‌కు తోడైన కోహ్లి కూడా దూకుడుగా బ్యాటింగ్‌ చేయడంతో భారత్‌ 21వ ఓవర్లో 144/1తో బలమైన స్థితిలో నిలిచింది. కానీ మ్యాక్స్‌వెల్‌ ఓ అనుకోని రిటర్న్‌ క్యాచ్‌తో రోహిత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. అదే మ్యాచ్‌లో మలుపు. ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు పడ్డాయి. మ్యాక్స్‌వెల్‌ కీలక వికెట్లతో భారత్‌ను దెబ్బతీశాడు. శ్రేయస్‌ నిలిచినా.. అతడి ప్రదర్శన ఏమాత్రం సరిపోలేదు. జట్టు స్కోరు 171 వద్ద కోహ్లీని మ్యాక్స్‌వెల్‌ వెనక్కి పంపాక.. రాహుల్‌ (26)తో కలిసి శ్రేయస్‌ జట్టును నడిపించే ప్రయత్నం చేశాడు. 35వ ఓవర్లో భారత్‌ 223/3తో నిలిచింది. సాధించాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోయింది. ఆ దశలో రాహుల్‌ను స్టార్క్‌ ఔట్‌ చేయగా.. పది పరుగుల తర్వాత సూర్యకుమార్‌ (8)ను హేజిల్‌వుడ్‌ వెనక్కి పంపాడు. 39వ ఓవర్లో శ్రేయస్‌ను మ్యాక్స్‌వెల్‌ ఔట్‌ చేయడంతో ఆసీస్‌ పట్టుబిగించింది. మ్యాచ్‌పై భారత్‌ ఆశలు కోల్పోయింది.  ఆ తర్వాత జడేజా (35) ఆట ఓటమి అంతరాన్ని తగ్గించిందంతే.

మార్ష్‌ ధనాధన్‌: అంతకుముందు బ్యాటర్ల జోరుతో 32వ ఓవర్లో 242/2తో ఆస్ట్రేలియా 400 దాటేలా కనిపించింది. కానీ బలంగా పుంజుకున్న భారత బౌలర్లు మిడిల్‌ ఆర్డర్‌ను దెబ్బతీయడం ద్వారా కంగారూలను అదుపు చేశారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌కు ఓపెనర్లు వార్నర్‌, మార్ష్‌ అదిరే ఆరంభాన్నిచ్చారు. బుమ్రా, సిరాజ్‌, ప్రసిద్ధ్‌.. ఇలా ఏ బౌలర్‌నూ వదలకుండా బౌండరీల మోత మోగిస్తూ చెలరేగిపోయారు. 8 ఓవర్లకు స్కోరు 78/0. ప్రసిద్ధ్‌ బౌలింగ్‌లో వార్నర్‌ ఔటైనా.. స్మిత్‌తో కలిసి మార్ష్‌ మరో మెరుపు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సెంచరీ ముంగిట మార్ష్‌ నిష్క్రమించినా.. లబుషేన్‌తో కలిసి స్మిత్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు.ఆసీస్‌ 31 ఓవర్లలో 237/2తో నిలిచింది. అయితే బంతితో పుంజుకున్న భారత్‌ను ఆసీస్‌ దూకుడును నియంత్రించగలిగింది. ఓ వైపు లబుషేన్‌ బాగానే ఆడినా.. మరోవైపు నుంచి క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టింది. స్కోరు వేగానికి అడ్డుకట్ట వేసింది.


ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) రాహుల్‌ (బి) ప్రసిద్ధ్‌ 56; మిచెల్‌ మార్ష్‌ (సి) ప్రసిద్ధ్‌ (బి) కుల్‌దీప్‌ 96; స్మిత్‌ ఎల్బీ (బి) సిరాజ్‌ 74; లబుషేన్‌ (సి) శ్రేయస్‌ (బి) బుమ్రా 72; కేరీ (సి) కోహ్లి (బి) బుమ్రా 11; మ్యాక్స్‌వెల్‌ (బి) బుమ్రా 5; గ్రీన్‌ (సి) శ్రేయస్‌ (బి) కుల్‌దీప్‌ 9; కమిన్స్‌ నాటౌట్‌ 19; స్టార్క్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (50 ఓవర్లలో 7 వికెట్లకు) 352; వికెట్ల పతనం: 1-78, 2-215, 3-242, 4-267, 5-281, 6-299, 7-345; బౌలింగ్‌: బుమ్రా 10-0-81-3; సిరాజ్‌ 9-0-68-1; ప్రసిద్ధ్‌ కృష్ణ 5-0-45-1; జడేజా 10-0-61-0; సుందర్‌ 10-0-48-0; కుల్‌దీప్‌ యాదవ్‌ 6-0-48-2

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) అండ్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 81; సుందర్‌ (సి) లబుషేన్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 18; కోహ్లి (సి) స్మిత్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 56; శ్రేయస్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 48; రాహుల్‌ (సి) కేరీ (బి) స్టార్క్‌ 26; సూర్యకుమార్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) హేజిల్‌వుడ్‌ 8; జడేజా ఎల్బీ (బి) సంఘా 35; కుల్‌దీప్‌ (బి) హేజిల్‌వుడ్‌ 2; బుమ్రా (సి) లబుషేన్‌ (బి) కమిన్స్‌ 5; సిరాజ్‌ (సి) కమిన్స్‌ (బి) గ్రీన్‌ 1; ప్రసిద్ధ్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (49.4 ఓవర్లలో ఆలౌట్‌) 286; వికెట్ల పతనం: 1-74, 2-144, 3-171, 4-223, 5-233, 6-249,  7-257, 8-270, 9-286; బౌలింగ్‌: స్టార్క్‌ 7-0-53-1; హేజిల్‌వుడ్‌ 8-0-42-2; కమిన్స్‌ 8-0-59-1; గ్రీన్‌ 6.4-0-30-1; మ్యాక్స్‌వెల్‌ 10-0-40-4; తన్వీర్‌ సంఘా 10-0-61-1

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు