NZ vs IND: మూడో వన్డే కూడా వర్షార్పణం.. సిరీస్‌ మాత్రం కివీస్‌దే

మూడో వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు భారత్‌ 220 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. బౌలింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై వాషింగ్టన్ సుందర్ (51), శ్రేయస్‌ అయ్యర్ (49) రాణించారు. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో టీమ్‌ఇండియా భారీ స్కోరు సాధించలేకపోయింది.

Updated : 30 Nov 2022 14:54 IST

క్రైస్ట్‌చర్చ్‌: మూడో వన్డే మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. దీంతో భారత్‌పై మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్‌ 1-0 తేడాతో కైవసం చేసుకొంది. తొలి వన్డేను కివీస్ గెలుచుకోగా.. మిగిలిన రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కావడం గమనార్హం. మూడో వన్డే మ్యాచ్‌లో ఇంకో రెండు ఓవర్ల ఆట జరిగి ఉంటే డక్‌వర్త్‌లూయిస్ పద్ధతి ప్రకారం న్యూజిలాండ్‌ విజయం సాధించేది. కానీ వర్షం రావడంతో మ్యాచ్‌ 18 ఓవర్ల వద్దే నిలిపేశారు. అప్పటికి కివీస్‌ 104/1 స్కోరుతో ఉంది. డక్‌ వర్త్‌ అమలు చేయాలంటే వన్డేల్లో ఒక్కో ఇన్నింగ్స్‌లో కనీసం 20 ఓవర్ల ఆట జరిగి ఉండాలి.  కానీ వర్షం ఆగకపోవడంతో మూడో వన్డేను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్ 219 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా టామ్‌ లాథమ్‌కు అవార్డు దక్కింది. ఇంతకుముందు జరిగిన టీ20 సిరీస్‌ కూడా ఇలానే వర్షం కారణంగా అంతరాయాలతోనే భారత్‌ 1-0 తేడాతో సొంతం చేసుకొంది.


ఒక్క వికెట్‌ మాత్రమే..

టీమ్‌ఇండియాకు ఒక్క వికెట్‌ దక్కింది. హాఫ్ సెంచరీ చేసిన ఫిన్ అలెన్ (57) ఉమ్రాన్ బౌలింగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో 16.3 ఓవర్లలో 97 పరుగుల వద్ద కివీస్‌ తొలి వికెట్‌ను నష్టపోయింది. అనంతరం క్రీజ్‌లోకి కేన్ విలియమ్సన్ వచ్చాడు. అయితే మరో ఓపెనర్‌ డేవన్ కాన్వే (38*) మాత్రం దూకుడు పెంచాడు. అయితే మ్యాచ్ 18 ఓవర్లు పూర్తయిన తర్వాత వర్షం రావడంతో ఆటను నిలిపి వేశారు. ప్రస్తుతం కివీస్‌ స్కోరు 104/1. ఇంకో 116 పరుగులు చేస్తే కివీస్‌ విజయం సాధిస్తుంది. డక్‌వర్త్‌లూయిస్ పద్ధతి ప్రకారం 20 ఓవర్లకు న్యూజిలాండ్‌ 98 పరుగులు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే 104 చేయడంతో విజయం దాదాపు ఖరారైనట్లే. కానీ డక్‌వర్త్‌ లూయిస్ అమలు కావాలంటే కనీసం 20 ఓవర్ల ఆట జరగాల్సిందే. లేకపోతే మ్యాచ్‌ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి.


ఫిన్‌ హాఫ్ సెంచరీ

భారత బౌలర్లకు వికెట్ మాత్రం దక్కడం లేదు. కివీస్‌ ఓపెనర్లు డేవన్‌ కాన్వే (30*), ఫిన్‌ అలెన్ (53*) ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పరుగులు సాధిస్తున్నారు. ఈ క్రమంలో ఫిన్‌ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్‌ వికెట్ నష్టపోకుండా 93 పరుగులు చేసింది. ఇంకో 128 పరుగులు చేస్తే కివీస్‌దే విజయం.


పట్టు వదిలారు..

తొలి ఐదు ఓవర్లు కట్టుదిట్టంగా వేసినా భారత బౌలర్లు పట్టు సడలించారు. ఫిన్‌ అలెన్ (26*), డేవన్ కాన్వే (24*) బ్యాట్‌ను ఝులిపించారు. దీపక్ చాహర్‌ వేసిన ఒకే ఓవర్‌లో డేవన్‌ నాలుగు ఫోర్లు బాదాడు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి కివీస్‌ వికెట్‌ నష్టపోకుండా 59 పరుగులు చేసింది. మిగతా 40 ఓవర్లలో 161 పరుగులు చేస్తే కివీస్‌ విజయం సాధిస్తుంది.


5 ఓవర్లకు కివీస్‌ 15/0

స్వల్ప లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కట్టుదిట్టంగా బంతులను సంధించడంతో పరుగులు చేసేందుకు కివీస్‌ బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం 5 ఓవర్లు ముగిసేసరికి కివీస్‌ వికెట్‌ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. క్రీజ్‌లో డేవన్ కాన్వే (6*), ఫిన్‌ అలెన్ (8*) ఉన్నారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 47.3 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.


ముగిసిన భారత ఇన్నింగ్స్

కివీస్‌తో మూడో వన్డేలో భారత ఇన్నింగ్స్‌ ముగిసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 47.3 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌట్‌ అయింది.  భారత ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్ సుందర్ (51: 64 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌) అర్ధశతకం సాధించాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేసి భారత్‌ ఓ మాదిరి స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. సుందర్‌ కాకుండా శ్రేయస్‌ అయ్యర్ (49) రాణించగా.. శిఖర్ ధావన్ (28) ఫర్వాలేదనిపించాడు. కివీస్‌ బౌలర్లలో డారిల్ మిచెల్ 3, టిమ్‌ సౌథీ 2.. లాకీ ఫెర్గూసన్, మిచెల్‌ సాంట్నర్ చెరో వికెట్‌ తీశారు.


రంగంలోకి స్పిన్నర్

భారత్‌తో మూడు వన్డే మ్యాచ్‌లో 43వ ఓవర్‌లో కివీస్‌ స్పిన్నర్‌గా దింపింది. సాంట్నర్ వేసిన ఈ ఓవర్‌లో కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో భారత్ స్కోరు 43 ఓవర్లకు 189/7కి చేరింది. క్రీజ్‌లో యుజ్వేంద్ర చాహల్ (4*), వాషింగ్టన్ సుందర్ (35*) ఉన్నారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు ఇప్పటి వరకు 39 బంతుల్లో 19 పరుగులు జోడించారు. చివరి ఏడు ఓవర్లలో ఎంతమేర పరుగులు రాబడతారో వేచి చూద్దాం.


కీలక వికెట్లు..

భారత్‌ కీలక వికెట్లను కోల్పోయింది. దీపక్ హుడా (12)కి దురదృష్టం కలిసిరాగా.. దీపక్ చాహర్ (12) దూకుడు ప్రదర్శించే క్రమంలో కివీస్‌ బౌలర్ డారిల్ మిచెల్‌ బుట్టలో పడ్డాడు. ప్రస్తుతం భారత్ 39 ఓవర్లు ముగిసేసరికి ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. క్రీజ్‌లో వాషింగ్టన్ సుందర్ (22*), యుజ్వేంద్ర చాహల్ ఉన్నారు. సుందర్‌పైనే భారత్ ఆశలు పెట్టుకొంది. కనీసం 200 పరుగులనైనా లక్ష్యంగా నిర్దేశించాలంటే అతడు రాణించాల్సిందే. ఉమ్రాన్‌, అర్ష్‌దీప్‌ మాత్రమే బ్యాటింగ్‌ చేయాల్సి ఉంది.


కష్టంగా బ్యాటింగ్‌..

భారత్‌కు పరుగులు రావడం కష్టంగా మారింది. కివీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ వేస్తున్నారు. దీపక్ హుడా (11*), వాషింగ్టన్ సుందర్ (14*) క్రీజ్‌లో నిలదొక్కుకనేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో 32 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. కివీస్‌ ఎదుట ఓ మాదిరి లక్ష్యం ఉంచాలంటే మిగిలిన ఓవర్లలో ధాటిగా ఆడాల్సి ఉంది. అయితే వీరిద్దరి తర్వాత దీపక్‌ చాహర్‌ మాత్రమే బ్యాటింగ్‌ చేయగల ఆటగాడు. కాబట్టి సుందర్-హుడా భాగస్వామ్యం చాలా కీలకం.


స్వల్ప వ్యవధిలో వికెట్లు..

సిరీస్‌ నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఒక్కొక్కరు పెవిలియన్‌కు చేరుతున్నారు. ఓవైపు వికెట్లు పడినా నిలకడగా ఆడిన శ్రేయస్‌ అయ్యర్ (49) అర్ధశతకానికి ఒక్క పరుగు దూరంలో ఔటయ్యాడు. లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో కాన్వే చేతికి క్యాచ్‌ ఇచ్చాడు. అంతకుముందు సూర్యకుమార్‌ (6)ను మిల్నే బోల్తా కొట్టించాడు. ప్రస్తుతం 26 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ 5 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. క్రీజ్‌లో వాషింగ్టన్ సుందర్, దీపక్‌ హుడా ఉన్నారు. 


పంత్ విఫలం.. నిలకడగా శ్రేయస్‌

మరోసారి భారత్‌ బ్యాటర్‌ రిషభ్ పంత్ (10) విఫలమయ్యాడు. కుదురుకొన్నట్లు అనిపించిన పంత్ అనవసరమైన షాట్‌కు యత్నించి డారిల్ మిచెల్‌ బౌలింగ్‌లో గ్లెన్‌ ఫిలిప్్‌ చేతికి చిక్కాడు. దీంతో 20.3వ ఓవర్‌లో 85 పరుగుల వద్ద భారత్‌ మూడో వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం టీమ్‌ఇండియా స్కోరు 21 ఓవర్లకు 87/3. న్యూజిలాండ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులను సంధిస్తుండటంతో పరుగులు చేయడం కష్టంగా మారింది. ప్రస్తుతం క్రీజ్‌లో సూర్యకుమార్‌ (1*), శ్రేయస్ అయ్యర్ (28*) ఉన్నారు.


ఓపెనర్లు ఔట్

ఆరంభం నుంచి ఎంతో ఓపికగా ఆడిన కెప్టెన్ శిఖర్ ధావన్ (28: 45 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్) స్కోరును పెంచే క్రమంలో మిల్నే బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి క్లీన్‌ బౌల్డయ్యాడు. దీంతో 55 పరుగుల వద్ద టీమ్‌ఇండియా రెండో వికెట్‌ను నష్టపోయింది. అంతకుముందు మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (13) ఔటైన విషయం తెలిసిందే. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. క్రీజ్‌లో రిషభ్ పంత్ (4*), శ్రేయస్ అయ్యర్ (14*) ఉన్నారు.


నిదానంగా బ్యాటింగ్‌

కీలకమైన మూడో వన్డేలో టాస్‌ ఓడిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేస్తోంది. పది ఓవర్లు ముగిసేసరికి టీమ్‌ఇండియా వికెట్‌ నష్టానికి 43 పరుగులు చేసింది. క్రీజ్‌లో శిఖర్ ధావన్‌ (25*), శ్రేయస్ అయ్యర్ (4*) ఉన్నారు. అంతకుముందు పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలంగా మారడం, అవుట్‌ఫీల్డ్‌ మందకొడిగా ఉండటంతో బ్యాటర్లు ఆచితూచి ఆడారు. అయితే దూకుడు పెంచే క్రమంలో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (13) పెవిలియన్‌కు చేరాడు. మిల్నే బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదిన గిల్‌ ఆ తర్వాత బంతికి సాంట్నర్ చేతికి చిక్కాడు. దీంతో 8.4 ఓవర్లలో 39 పరుగుల వద్ద భారత్‌ మొదటి వికెట్‌ను నష్టపోయింది.


టాస్‌ నెగ్గిన కివీస్‌

భారత్‌ సిరీస్‌ను గెలిచే అవకాశం లేదు. కనీసం చేజార్చుకోకుండా సమం చేయాలన్నా తప్పక విజయం సాధించాల్సిందే. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్ వేదికగా భారత్‌ మూడో వన్డేలో తలపడనుంది. టాస్‌ నెగ్గిన న్యూజిలాండ్ కెప్టెన్‌ కేన్ విలియమ్సన్ బౌలింగ్‌ ఎంచుకొన్నాడు. బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించిన భారత్‌.. బౌలింగ్‌లోనూ రాణించాల్సిన అవసరం ఉంది. తొలుత బ్యాటింగ్‌ చేసే భారత్‌ కనీసం 320కిపైగా పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. శిఖర్ ధావన్‌ మూడు మ్యాచుల్లోనూ టాస్‌ ఓడిపోవడం గమనార్హం.

జట్ల వివరాలు: 

భారత్‌: శిఖర్ ధావన్‌ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్‌ యాదవ్, సంజూ శాంసన్, దీపక్ హుడా, దీపక్ చాహర్, వాషింగ్టన్ సుందర్, చాహల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఉమ్రాన్ మాలిక్‌

న్యూజిలాండ్: ఫిన్ అలెన్, డేనవ్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్‌ మిచెల్, టామ్‌ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్‌, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, మ్యాట్ హెన్రీ, టిమ్‌ సౌథీ, లాకీ ఫెర్గూసన్


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు