Shubman Gill: హార్దిక్‌.. నువ్వు చెప్పిందే చేశా: శుభ్‌మన్‌ గిల్‌

న్యూజిలాండ్‌తో మూడో టీ20 ఆడుతున్న సమయంలో హార్దిక్‌ పాండ్య ఇచ్చిన సూచనను శుభ్‌మన్‌ గిల్‌ వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో తానెంతో వ్యూహాత్మకంగా ఆడానని తెలిపాడు.

Published : 03 Feb 2023 13:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్‌ 168 పరుగుల భారీ తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత యువ ఆటగాడు శుభ్‌మన్‌గిల్‌ (126*) శతకంతో చెలరేగాడు. 63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో న్యూజిలాండ్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరోవైపు కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య 4 వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణించి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా నిలిచాడు. ఇక మ్యాచ్‌ అనంతరం హార్దిక్‌-గిల్‌ మధ్య ఓ సరదా ఇంటర్వ్యూ జరిగింది. తన బ్యాటింగ్‌ సమయంలో హార్దిక్‌ పాండ్య ఇచ్చిన సలహాను గిల్‌ బయటపెట్టాడు. దీనికి సంబంధించి వీడియోను బీసీసీఐ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది.

‘‘నేను సిక్సర్‌ బాదిన ప్రతిసారీ నువ్వు వచ్చి ‘ఆ తర్వాతి షాట్‌ ఎలా ఆడాలనుకుంటున్నావో నిర్ణయించుకో. అదనంగా ఏమీ చేయొద్దు. నీ ఆట నువ్వు ఆడు అన్నావ్’ అది నాకు చాలా  ఉపయోగపడింది’’ అని హార్దిక్‌ను ఉద్దేశించి గిల్‌ అన్నాడు. ఈ ఇన్నింగ్స్‌ వ్యూహాత్మకంగా, టెక్నికల్‌గా నాకు సరైందని వివరించాడు. ఇక హార్దిక్‌ మాట్లాడుతూ.. ‘‘నాలుగు వికెట్లు తీయడం ఆటలో ఒక భాగం మాత్రమే. నేను 145కి.మీ. (kmph) వేగంతో బౌలింగ్‌ చేశానని అనుకుంటున్నాను. ఈ మ్యాచ్‌  తర్వాత విరామం తీసుకుంటున్నా కాబట్టి ఈ మ్యాచ్‌లో ఎలాగైనా రాణించాలని అనుకున్నా. అందుకే అంత వేగంగా బంతుల్ని విసిరా. మ్యాచ్‌ ఆరంభం గొప్పగా ఉంది. అది విజయాన్ని సులభం చేసింది’’ అని హార్దిక్‌ పేర్కొన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని