Chennai: ధోనీ స్థానం భర్తీ చేయగలిగే భారత ఆటగాళ్లు ఎవరూ లేరు: బ్రాడ్ హాగ్‌

మరోసారి చెన్నై నాయకత్వ బాధ్యతలు ఆటగాడిపై చర్చకు తెరలేసింది. ఈ సీజన్‌ ప్రారంభానికి ముందు ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకొని...

Updated : 10 Aug 2022 10:43 IST

రవీంద్ర జడేజాకే మళ్లీ అవకాశం ఇవ్వొచ్చన్న మాజీ క్రికెటర్‌

ఇంటర్నెట్‌ డెస్క్: మరోసారి చెన్నై నాయకత్వ బాధ్యతలు ఆటగాడిపై చర్చకు తెరలేసింది. ఈ సీజన్‌ ప్రారంభానికి ముందు ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకొని రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ అప్పగించాడు. అయితే వరుసగా ఓటముల నేపథ్యంతోపాటు వ్యక్తిగతంగా రాణించలేకపోవడంతో జడేజా సారథ్య బాధ్యతలను త్యజించాడు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ ఎంఎస్ ధోనీనే జట్టు పగ్గాలను అందుకొన్నాడు. హైదరాబాద్‌పై విజయం సాధించినా.. బెంగళూరుపై చెన్నై ఓడిపోయింది. ఈ సీజన్‌ వరకైతే ధోనీనే సారథ్యం వహిస్తాడు కాబట్టి ఫర్వాలేదు.. ఇప్పటికే 40 ఏళ్లు దాటిన ధోనీ వచ్చే సీజన్‌కు అందుబాటులో ఉంటాడో లేదో అనుమానమే. ఈ క్రమంలో ధోనీ తర్వాత చెన్నైకి కెప్టెన్‌గా ఎవరుంటారనే దానిపై బ్రాడ్ హాగ్‌ విశ్లేషించాడు.

‘‘ఇప్పుడైతే ఎంఎస్ ధోనీ బాధ్యతలను స్వీకరించాడు. మరి వచ్చే ఏడాది అతడి స్థానాన్ని భర్తీ చేసేదెవరు? ఇదే అందరి మదిలో మెదిలే ప్రశ్న.. చెన్నై జట్టులో అంత ప్రతిభావంతమైన, ప్రభావం చూపే ఆటగాడైతే నాకు ఎవరూ కనిపించడం లేదు. అందుకే వచ్చే ఏడాది వేలంలోకి వెళ్లి కెప్టెన్సీ నిర్వహించే సామర్థ్యం కలిగిన ఆటగాడిని కొనుగోలు చేస్తుందేమో అనిపిస్తోంది. అయితే అత్యుత్తమ టీమ్‌ఇండియా టీ20 ఫార్మాట్‌ ప్లేయర్లు అందుబాటులో లేరు. ఇప్పటికే ఇతర జట్లు సొంతం చేసుకొని కెప్టెన్సీని అప్పగించాయి. రవీంద్ర జడేజానే సరైన ఎంపిక. కాకపోతే ఈసారి మాత్రం అనుభవం లేకపోవడంతో సరిగ్గా రాణించలేకపోయాడు. ఒకవేళ ధోనీ వచ్చే సీజన్‌కు దూరమైతే మాత్రం జడేజాతో ఆ స్థానం భర్తీ చేయొచ్చు. జడేజా కాకుండా విదేశీ ప్లేయర్‌ను కెప్టెన్‌గా చేయదు. ఒకవేళ చేస్తే మాత్రం అలాంటి ఆటగాడు ఎవరనేది గుర్తించడం కూడా కష్టమే’’ అని బ్రాడ్ హాగ్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని