IND vs AFG: డ్రెస్సింగ్‌ రూమ్‌ ‘బెస్ట్‌ ఫీల్డర్‌’ అతడే.. ఈసారి ‘గెస్ట్‌’ ఎవరంటే?

బెస్ట్ ఫీల్డర్‌ మెడల్‌ ఇస్తూ.. భారత క్రికెటర్లు మైదానంలో చురుగ్గా ఉండేలా చేయడంలో కోచింగ్‌ సిబ్బంది విజయవంతమవుతోంది. తాజాగా అఫ్గాన్‌తో మ్యాచ్‌లోనూ అత్యుత్తమ ప్రతిభ చూపిన క్రికెటర్‌కు ఈ మెడల్‌ను అందజేసింది.

Updated : 21 Jun 2024 15:12 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) అఫ్గానిస్థాన్‌తో జరిగిన సూపర్‌-8 పోరులో భారత్ (IND vs AFG) ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌తోపాటు ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపించింది. ప్రతీ మ్యాచ్‌ అనంతరం డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఇచ్చే ‘బెస్ట్‌ ఫీల్డర్’ మెడల్‌ను ఈసారి రవీంద్ర జడేజా దక్కించుకున్నాడు. ప్రత్యేకంగా గెస్ట్‌ను పిలిచి దీన్ని వారి చేతులమీదుగా అందజేయడం జరుగుతుండగా, ఈసారి మాత్రం భారత ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్ అందించడం విశేషం. ఎవరు రేసులో నిలిచారు? అనే దానిపై భారత జట్టు ఫీల్డింగ్‌ కోచ్ దిలీప్‌ వివరణ ఇచ్చాడు. తన పేరును ప్రకటించగానే రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఆశ్చర్యపోయాడు.

‘‘అఫ్గాన్‌తో మ్యాచ్‌లో ప్రతిఒక్కరూ మెరుగైన ఫీల్డింగ్ చేశారు. దూకుడుగా మైదానంలో కదిలారు. ప్రాక్టీస్‌ సెషన్‌లో ఎలాంటి ప్రదర్శన చేశారో.. అదేవిధంగా మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్థులపై ఆధిపత్యం ప్రదర్శించారు. ఈసారి నలుగురు ప్లేయర్లు మైదానంలో చాలా చురుగ్గా ఉన్నారు. వారే కాదు.. మిగతావారూ వారి పాత్రను పోషించారు. మన తొలి పోటీదారు అర్ష్‌దీప్‌ సింగ్. చాలా క్రమశిక్షణతో తన బాధ్యతలను నిర్వర్తించాడు. ఇక రెండో ప్లేయర్ రవీంద్ర జడేజా. నిరంతరం మైదానంలో చురుగ్గా ఉన్నాడు. మూడో ప్లేయర్ అక్షర్ పటేల్. అద్భుతమైన క్యాచ్‌ను అందుకొన్నాడు. ఇక చివరిగా.. చాన్నాళ్ల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టి మ్యాచ్‌ మ్యాచ్‌కూ మెరుగ్గా రాణిస్తున్న రిషభ్ పంత్‌. చాలా మంచి క్యాచ్‌లు అందుకొన్నాడు. అయితే, అందరిలోనూ ఒకరినే తీసుకోవాలి. ఈసారి రవీంద్ర జడేజాకు ఈ అవార్డు అందజేయనున్నారు. ఇది ఎవరు చేస్తారనేది మీ అందరికీ ఆసక్తిగా ఉంది కదా..’’ అని దిలీప్ వ్యాఖ్యానించాడు. అక్షర్‌ పేరు చెప్పగానే ఆ పక్కనే ఉన్న విరాట్ కోహ్లీ షాకైనట్లు సరదా ఎక్స్‌ప్రెషన్ పెట్టాడు.

కొత్త గెస్ట్‌ ఎవరు? అని అంతా ఎదురుచూస్తుంటే.. ‘అక్కడెవరు లేరు’. ఇప్పుడు మెడల్‌ను అందజేసేది మనందరితో ఎప్పుడూ ఉండే ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్ అని చెప్పడంతో అందరూ చప్పట్లతో హర్షం వ్యక్తంచేశారు. ద్రవిడ్ చేతులమీదుగా జడ్డూ మెడల్‌ను స్వీకరించాడు. ఈసందర్భంగా కోచ్‌ను జడేజా పైకి ఎత్తుకోవడం గమనార్హం. ఫీల్డింగ్‌లో తనకు స్ఫూర్తిగా నిలుస్తున్న ప్లేయర్‌ సిరాజ్‌ అంటూ రవీంద్ర జడేజా తెలిపాడు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని