IND vs AUS: ఆసీస్‌కు కామెరూన్ గ్రీన్‌.. భారత్‌కు ఆ ఆల్‌రౌండర్‌ చాలా అవసరం: ఛాపెల్‌

క్రికెట్‌లో ఏ ఫార్మాట్‌లోనైనా ఆల్‌రౌండర్లు చాలా కీలకం. అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. అదే పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయితే జట్టుకు మరింత ప్రయోజనం. ప్రస్తుతం భారత్‌ - ఆసీస్ (IND vs AUS) సిరీస్‌లో టీమ్‌ఇండియాకు లోటు అదేనని ఆసీస్‌ దిగ్గజం వ్యాఖ్యానించాడు.

Updated : 05 Mar 2023 11:02 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ (Team India) ఓటమి చవిచూసింది. స్పిన్‌ పిచ్‌పై ఆసీస్‌ బౌలర్ల ధాటికి కుదేలైంది. దీంతో సిరీస్‌ విజయంపై కన్నేసిన భారత్‌కు నాలుగో టెస్టు (IND vs AUS) కీలకం కానుంది. అలాగే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోవాలంటే కూడా తప్పక గెలవాల్సిన పరిస్థితి. అయితే, భారత జట్టు ఎంపికలోనే సమస్య ఉందని ఆసీస్‌ క్రికెట్ దిగ్గజం ఇయాన్ ఛాపెల్‌ అభిప్రాయపడ్డాడు. టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) తప్పకుండా టెస్టు సిరీస్‌ ఆడాలని సూచించాడు. 

‘‘భారత క్రికెట్‌ టెస్టు జట్టులో హార్దిక్‌ పాండ్య ఎందుకు లేడో అర్థం కాలేదు. అతడు ఎక్కువ ఓవర్లు బౌలింగ్‌ చేయలేడని పలువురు చెబుతున్నారు. అయితే ఇదే విషయంపై  మీరు వైద్య బృందంతో కానీ, క్రికెట్‌ విశ్లేషకులతో కానీ మాట్లాడారా..? ఎందుకంటే పాండ్య ఆడాలనుకుంటే తప్పకుండా అతడికి జట్టులో చోటు కల్పించాలి. మిడిలార్డర్‌లో మంచి బ్యాటర్‌.. అలాగే పేస్‌ బౌలింగ్‌ వేయగలడు. అదనంగా మరో ఆటగాడు ఉన్నట్లు అవుతుంది. ఇక నాణ్యమైన ఫీల్డర్. జట్టు సమతూకంగా ఉండాలంటే ఇలాంటి ఆటగాళ్లు ఉండాలి. ఆసీస్‌కు కామెరూన్‌ గ్రీన్‌ ఎంత అవసరమో.. భారత్‌కు హార్దిక్‌ పాండ్య కూడా అంతే కీలకం’’ అని ఇయాన్‌ ఛాపెల్‌ వెల్లడించాడు. 

ఇటీవల వన్డేలు, టీ20లను మాత్రమే ఆడుతున్న హార్దిక్‌ పాండ్య.. టెస్టుల్లో మాత్రం 2018లోనే చివరిసారిగా కనిపించాడు. ఇప్పటి వరకు కేవలం 11 టెస్టులు మాత్రమే ఆడిన పాండ్య 532 పరుగులు సాధించాడు. 17 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం అప్పుడప్పుడు టీ20 జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. మార్చి 9 నుంచి భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్‌ వేదికగా నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. అనంతరం ఆసీస్‌తోనే వన్డే సిరీస్‌ కూడా జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని