Ashesలో గెలిస్తే స్మిత్‌కు పగ్గాలిస్తా: టిమ్‌పైన్‌

ఈ ఏడాది చివర్లో ఇంగ్లాండ్‌తో జరిగే యాషెస్‌ సిరీస్‌లో తాము గెలిస్తే ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్సీని తిరిగి స్టీవ్‌స్మిత్‌కు అప్పగిస్తానని ప్రస్తుత సారథి టిమ్‌పైన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు...

Published : 14 May 2021 01:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ ఏడాది చివర్లో ఇంగ్లాండ్‌తో జరిగే యాషెస్‌ సిరీస్‌లో తాము గెలిస్తే ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్సీని తిరిగి స్టీవ్‌స్మిత్‌కు అప్పగిస్తానని ప్రస్తుత సారథి టిమ్‌పైన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. 2018 మార్చిలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ సందర్భంగా బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకొని స్మిత్‌ కెప్టెన్సీ పగ్గాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా టిమ్‌పైన్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘కచ్చితంగా నేనా నిర్ణయం తీసుకోలేను. కానీ, స్మిత్‌ సారథ్యంలో నేను ఆడినప్పుడు అతడు అద్భుతమైన సారథిగా ఉన్నాడు. నైపుణ్యం పరంగానూ చాలా మంచి ఆటగాడు. అలాగే స్మిత్‌ కూడా నాలాంటి వాడే. తస్మానియా జట్టుకు నేను కెప్టెన్‌గా కొనసాగుతున్న తొలినాళల్లో అతడు జాతీయ జట్టుకు కెప్టెనయ్యాడు. అదీ చాలా చిన్న వయసులో. అప్పుడు దానికి అతడు సిద్ధంగా లేడు. తర్వాత నేను జట్టులోకి వచ్చేసరికి ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ఎంతో మెరుగయ్యాడు. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా పర్యటనలో బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకొని కెప్టెన్సీకి దూరమయ్యాడు. అయితే, తిరిగి అతడు కెప్టెన్సీ పగ్గాలు చేపడితే నేను మద్దతిస్తాను’ అని టిమ్‌పైన్‌ పేర్కొన్నాడు.

‘అలాగే యాషెస్‌ సిరీస్‌లో మేం 5-0 తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించాక.. ఇదే సరైన సమయం అని నేను భావించి కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే ఎంత బాగుంటుంది. కానీ, అదెంతో కష్టతరమైన సిరీస్‌గా ఉండొచ్చు. చివరి రోజు మేం 300 పరుగులు ఛేదించాల్సి రావచ్చు. అప్పుడు నేను సెంచరీతో చెలరేగడమే కాకుండా విన్నింగ్‌ షాట్‌ కొట్టాక.. అప్పుడు నేను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటా’ అని ఆసీస్‌ కెప్టెన్‌ వివరించాడు. అనంతరం టీమ్‌ఇండియాతో టెస్టు సిరీస్‌ ఓటమిపాలవ్వడంపై స్పందిస్తూ.. కోహ్లీసేన తమను పక్కదారి పట్టించిందని, అందువల్లే తాము ఓడిపోయామని వింత వ్యాఖ్యలు చేశాడు. కాగా, ఈ ఏడాది జనవరిలో సీనియర్లు లేని టీమ్‌ఇండియా మేటి కంగారూ జట్టును ఓడించిన సంగతి తెలిసిందే. 2-1 తేడాతో వరుసగా రెండోసారి ఆస్ట్రేలియాలో చారిత్రక బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలు సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని