నా మాటలతో తప్పుడు సంకేతాలిచ్చా.. 

మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా బ్యాట్స్‌మన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌(39*) బ్యాటింగ్‌ చేసేటప్పుడు స్లెడ్జింగ్‌కు పాల్పడిన ఆస్ట్రేలియా సారథి టిమ్‌పైన్‌ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు...

Updated : 12 Jan 2021 12:27 IST

స్లెడ్జింగ్‌పై స్పందించిన ఆసీస్‌ కెప్టెన్‌ పైన్‌

సిడ్నీ: మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా బ్యాట్స్‌మన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌(39*) బ్యాటింగ్‌ చేసేటప్పుడు స్లెడ్జింగ్‌కు పాల్పడిన ఆస్ట్రేలియా సారథి టిమ్‌పైన్‌ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్‌లో అలా జరగకుండా జాగ్రత్తగా ఉంటానన్నాడు. తన మాటలతో తప్పుడు సంకేతాలిచ్చానని చెప్పాడు.

‘క్రికెట్‌లో ఇప్పుడు స్టంప్‌మైక్‌ ఉంటుందనే విషయం తెలిసిందే. దురదృష్టవశాత్తూ నా మాటలతో తప్పుడు సంకేతాలిచ్చాను. అది తెలిసి చాలా బాధపడ్డాను. ఆటలో జాగ్రత్తగా ఉండాలని తెలుసు. భవిష్యత్‌లో ఇలా జరగకుండా మంచి పేరు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తా’ అని పైన్‌ పేర్కొన్నాడు. సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా విజయానికి 5 వికెట్లు అవసరమైన వేళ విహారి(23*)తో కలిసిన అశ్విన్‌ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరిద్దరూ మరో వికెట్‌పడకుండా మ్యాచ్‌ను డ్రా చేశారు. 

ఈ క్రమంలోనే విహారి, అశ్విన్‌ జోడీని విడగొట్టేందుకు ఆసీస్‌ ఆటగాళ్లు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఒకానొక సందర్భంలో పైన్‌ నోటికి పని చెప్పాడు. తన దురుసుతనంతో అశ్విన్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. లైయన్‌ బౌలింగ్‌లో బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేని అశ్విన్‌.. క్రీజు నుంచి దూరంగా వెళ్లి తిరిగి వచ్చినపుడు.. ‘‘గబ్బా(చివరి టెస్టు వేదిక)కు మిమ్మల్ని తీసుకెళ్లేందుకు ఆత్రుతగా ఉన్నా యాష్‌.. చెప్పింది అర్థమైందా’’ అని పైన్‌ అన్నాడు. ‘‘మేం కూడా మిమ్మల్ని భారత్‌కు రప్పించాలనే తొందరలో ఉన్నాం. నీకది చివరి సిరీస్‌ అవుతుంది’’ అని అశ్విన్‌ వెంటనే సమాధానమిచ్చాడు. అసాధారణ పోరాటంతో జట్టుకు ఓటమి తప్పించిన అశ్విన్‌.. మాటలతోనూ ఆస్ట్రేలియా కెప్టెన్‌ పైన్‌కు తగిన బదులిచ్చాడు. చివరి రోజు ఆటలో మూడు క్యాచ్‌లు వదిలేసిన   పైన్‌.. ఇలా స్లెడ్జింగ్‌ చేయడంపై విమర్శలు వస్తున్నాయి.

ఇవీ చదవండి..

ఆ నొప్పితో మా ఆయన అలా ఎలా ఆడాడబ్బా!

‘డ్రా’ కానే కాదిది.. ఆసీస్‌ పొగరుకు ఓటమి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని