IND vs WI : కుర్రాళ్లు అంచనాలను అందుకుంటారా.?

వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో వైట్ వాష్‌ చేసిన టీమిండియా మంచి జోష్‌ మీద ఉంది. అదే ఊపుతో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు, వన్డే సిరీస్‌లో..

Published : 15 Feb 2022 20:38 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో వైట్ వాష్‌ చేసిన టీమిండియా మంచి జోష్‌ మీద ఉంది. అదే ఊపుతో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు, వన్డే సిరీస్‌లో ఘోరంగా విఫలమైన విండీస్‌ జట్టు.. పొట్టి ఫార్మాట్‌లో రాణించి సత్తా చాటాలని చూస్తోంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికిన యువ ఆటగాళ్లపై టీమిండియా భారీ ఆశలు పెట్టుకొంది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా రేపటి (ఫిబ్రవరి 16) నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌లో యువ ఆటగాళ్లు ఏం చేస్తారో చూడాలి.!

టీ20 ప్రపంచకప్‌ ప్రారంభానికి ఇంకా ఎనిమిది నెలల సమయం ఉంది. ఆలోపు నాణ్యమైన యువ ఆటగాళ్లతో కూడిన మెరుగైన జట్టును సిద్ధం చేసుకోవడంపై టీమిండియా దృష్టి సారించింది. అందుకే, వెస్టిండీస్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌లో పలు ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. దాన్ని బట్టి ఎవరెవరిని ఏ స్థానంలో బ్యాటింగ్‌ దించాలి? మిగతా ఆటగాళ్లను ఎలా ఉపయోగించుకోవాలి? అనే విషయాలపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికిన యువ ఆటగాళ్లపై భారీ అంచనాలున్నాయి. వారిలో పది మంది ఆటగాళ్లు వెస్టిండీస్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌కు ఎంపికైన వారే కావడం గమనార్హం. ఇషాన్ కిషన్ (రూ. 15.25 కోట్లు), దీపక్‌ చాహర్‌ (రూ. 14 కోట్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (రూ.12.25 కోట్లు), హర్షల్ పటేల్‌ (10.75 కోట్లు), శార్దూల్ ఠాకూర్‌ (రూ.10.75 కోట్లు), అవేశ్ ఖాన్‌ (రూ.10 కోట్లు), వెంకటేశ్‌ అయ్యర్‌ (రూ.8 కోట్లు), సూర్యకుమార్ యాదవ్‌ (రూ.8 కోట్లు), దీపక్‌ హుడా (రూ.5.75 కోట్లు), రవి బిష్ణోయ్‌ (రూ.4 కోట్లు) లపైనే అందరి దృష్టి ఉంది. అలాగే, ఓపెనింగ్, మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాటింగ్‌లో స్థిరత్వం తీసుకొచ్చేందుకు రోహిత్‌ కృషి చెయ్యాలి. బౌలింగ్ విభాగంలో కూడా కొన్ని మార్పులు చేయాల్సి ఉంది. అయితే, చాలా మంది యువ ఆటగాళ్లు జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో.. ఎవరికి అవకాశం ఇవ్వాలనే విషయంలో కాస్త గందరగోళం నెలకొంది.

 
* ఓపెనింగ్‌పై సందిగ్ధం..

టీమిండియా ప్రధానంగా ఓపెనింగ్‌ జోడీపై దృష్టి సారించాల్సి ఉంది. కెప్టెన్ రోహిత్‌ శర్మకు సరి జోడి ఎవరు అనే విషయంపై ఓ నిర్ణయానికి రావాలి. రెగ్యులర్‌ పార్ట్‌నర్‌ కేఎల్ రాహుల్ తరచూ గాయాల బారిన పడుతూ జట్టుకు దూరమవుతున్నాడు. ఈ నేపథ్యంలో నిలకడగా రాణించగల ఓపెనర్‌ని వెతుక్కోవాల్సి ఉంది. వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచులో రోహిత్ శర్మతో పాటు యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. మరో మ్యాచులో రిషభ్ పంత్‌తో ప్రయోగాలు చేశారు. అయితే, ప్రస్తుత టీ20 సిరీస్‌లో ఓపెనర్‌గా ఇషాన్‌ కిషన్‌కే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అయితే, జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్న మరో యువ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్ నుంచి అతడికి పోటీ ఎదురవుతోంది. గత ఐపీఎల్ సీజన్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగి సత్తా చాటిన వెంకటేశ్‌ అయ్యర్‌ కూడా ఓపెనింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరో ఆసక్తికర విషయమేమిటంటే, గత కొద్ది రోజులుగా భారీ ఇన్నింగ్స్‌ ఆడలేకపోతున్న విరాట్‌ కోహ్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

* మిడిల్, లోయర్ ఆర్డర్లో ఎవరు.?

ఈ ఏడాది అక్టోబరులో జరుగనున్న టీ20 ప్రపంచకప్‌ వరకు టీమిండియా షెడ్యూల్‌ బిజీగా ఉంటుంది. అందుకే, రెగ్యులర్‌ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌కి కాస్త విరామం ఇవ్వడంలో తప్పేం లేదు. అతడి స్థానంలో ఇషాన్‌ కిషన్‌కి అవకాశం ఇవ్వొచ్చు. అలాగే, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లపై ప్రయోగాలు చెయ్యొచ్చు. ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో వీరిద్దరూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అలాగే, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌, హర్షల్ పటేల్‌లకు లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగి సత్తా చాటగలరు. కాబట్టి, లోయర్ ఆర్డర్‌ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.

* బిష్ణోయ్‌కి అవకాశం వస్తుందా.?

టీమిండియా రెగ్యులర్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ చాలా రోజుల తర్వాత వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సత్తా చాటాడు. ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. మరోవైపు, గాయం కారణంగా వాషింగ్టన్‌ సుందర్‌ టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్న యువ ఆటగాడు రవి బిష్ణోయ్‌ని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

* విండీస్‌ పుంజుకునేనా.?

ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో దారుణంగా విఫలమైన వెస్టిండీస్‌ జట్టు.. టీ20 సిరీస్‌లో మెరుగ్గా రాణించడంపై దృష్టి పెట్టింది. వన్డే సిరీస్‌లో ఓటమి పాలైనంత మాత్రాన.. టీ20 ఫార్మాట్లో విండీస్‌ జట్టును తక్కువ అంచనా వేయలేం. భారత పర్యటనకు ముందు ఇంగ్లాండ్‌తో జరిగిన 5 టీ20 మ్యాచుల సిరీస్‌ను వెస్టిండీస్ జట్టు 3-2 తేడాతో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. విండీస్‌ జట్టులో లోతైన బ్యాటింగ్‌ లైనప్‌కు, దూకుడుగా ఆడగల హిట్లర్లకు కొదువలేదు. వీరి నుంచి భారత్‌కి గట్టి పోటీ ఎదురవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆల్‌ రౌండర్‌ జేసన్ హోల్డర్‌ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అలాగే, ఓడియన్‌ స్మిత్‌, అకీల్ హోసెయిన్‌, కీరన్‌ పొలార్డ్‌ వంటి ఆల్‌ రౌండర్లు రాణిస్తే.. సిరీస్‌లో పై చేయి సాధించడం పెద్ద కష్టమేం కాదు.

తుది జట్ల అంచనా..

భారత్‌ : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌/సూర్యకుమార్ యాదవ్‌, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), వెంకటేశ్ అయ్యర్‌, దీపక్‌ చాహర్‌, శార్దూల్ ఠాకూర్‌, యుజ్వేంద్ర చాహల్‌, మహమ్మద్‌ సిరాజ్‌, హర్షల్ పటేల్‌

వెస్టిండీస్‌ : కీరన్‌ పొలార్డ్‌ (కెప్టెన్‌), నికోలస్‌ పూరన్‌ (వైస్‌ కెప్టెన్‌), ఫేబియన్‌ అలెన్‌, షెల్డన్‌ కాట్రెల్‌/డొమినిక్‌ డ్రేక్స్‌, జేసన్‌ హోల్డర్, అకీల్‌ హోసెయిన్, బ్రెండన్‌ కింగ్‌, రోవ్‌మన్‌ పొవెల్‌, రోమెరియో షెఫర్డ్‌, ఓడియన్‌ స్మిత్‌, కైల్‌ మేయర్స్‌
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని