Dhoni: ధోనీ కోసం దాదాను ఒప్పించాల్సి వచ్చింది

దులీప్‌ ట్రోఫీ-2003-04 ఫైనల్లో ఈస్ట్‌జోన్‌ తరఫున ఎంఎస్‌ ధోనీతో వికెట్‌ కీపింగ్‌ చేయించేందుకు సౌరవ్‌ గంగూలీని ఒప్పించాల్సి వచ్చిందని బీసీసీఐ మాజీ ప్రధాన సెలక్టర్‌ కిరణ్‌ మోరె అన్నారు....

Updated : 02 Jun 2021 10:21 IST

ముంబయి: దులీప్‌ ట్రోఫీ-2003-04 ఫైనల్లో ఈస్ట్‌జోన్‌ తరఫున ఎంఎస్‌ ధోనీతో వికెట్‌ కీపింగ్‌ చేయించేందుకు సౌరవ్‌ గంగూలీని ఒప్పించాల్సి వచ్చిందని బీసీసీఐ మాజీ ప్రధాన సెలక్టర్‌ కిరణ్‌ మోరె అన్నారు. దీప్‌దాస్‌ గుప్తా వికెట్‌ కీపింగ్‌ చేయకుండా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. ఫైనల్లో ఆకట్టుకున్న మహీ ఆ తర్వాత భారత్‌-ఏ తరఫున పరుగుల వరద పారించాడని తెలిపారు. ఆపై టీమ్‌ఇండియాకు ఎంపికయ్యాక ఏం జరిగిందో అందరికీ తెలిసిన కథే అన్నారు.

మహీ అరంగేట్రానికి ముందు రాహుల్‌ ద్రవిడ్‌ టీమ్‌ఇండియాకు కీపింగ్‌ చేస్తున్నాడు. 2003 ప్రపంచకప్‌లోనూ అతడే వికెట్లను కాచుకున్నాడు. అతడిపై పనిభారం పెరగడం, లోయర్‌ ఆర్డర్లో మెరుపు బ్యాటింగ్‌ చేసే కీపర్‌ కోసం సెలక్టర్లు చూస్తున్నారు. అదే సమయంలో ధోనీ గురించి కిరణ్‌ మోరె తన మిత్రుల ద్వారా వినడం గమనార్హం.

‘అప్పుడు మేం వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ కోసం చూస్తున్నాం. మొదట నా సహచరుల ద్వారా ధోనీ గురించి విన్నాను. అతడి ఆటను చూసేందుకు వెళ్లాను. జట్టు స్కోరు 170 అయితే అతడే 130 పరుగులు చేయడం వీక్షించాను. అతడు బౌలర్లందరినీ చితకబాదేశాడు. దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌ జోన్‌ తరఫున అతడిని వికెట్‌ కీపింగ్‌ చేయించాలనుకున్నాం. సౌరవ్‌ గంగూలీ, దీప్‌దాస్‌ గుప్తాతో తీవ్రంగా చర్చించాం. వారిద్దరూ కోల్‌కతాకు చెందినవారు. టీమ్‌ఇండియాకు ఆడుతున్నారు. దీప్‌దాస్‌ను కీపింగ్‌ చేయకుండా ఆపేందుకు, గంగూలీని ఒప్పించేందుకు సెలక్టర్లకు కనీసం పది రోజులు పట్టింది’ అని మోరె తెలిపారు.

‘ధోనీ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌లో 21, రెండో ఇన్నింగ్స్‌లో 47 బంతుల్లో 60 పరుగులు చేశాడు. అతడి పవర్‌ గేమ్‌ను మేం చూశాం. ఆ తర్వాత భారత్‌-ఏ, పాక్‌-ఏ, కెన్యా ముక్కోణపు సిరీసులో అతడు దాదాపుగా 600 పరుగులు చేశాడు. ప్రత్యర్థి బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. అతడిలో మాకు మ్యాచ్‌ విజేత కనిపించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. అతడిని తెరపైకి తీసుకురావడంతో మా అందరి కృషి ఉంది’ అని మోరె వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు