Updated : 30 Nov 2021 18:01 IST

IPL: ఐపీఎల్‌ రిటెన్షన్‌.. ఇవాళే డెడ్‌లైన్‌.. రాత్రికి లిస్ట్‌ విడుదల!

రాత్రికి లిస్ట్‌ను ప్రకటించే అవకాశం 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్)లో ఆటగాళ్ల రిటెన్షన్‌ గడువు మరికొద్ది గంటల్లో ముగియనుంది. బీసీసీఐ ఇచ్చిన తుది గడువు నవంబర్ 30 (మంగళవారం). ఎనిమిది ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించాల్సి ఉంటుంది. కొత్త జట్లైన అహ్మదాబాద్‌, లఖ్‌నవూకు వేలం నిర్వహణకు ముందే తొలుత నలుగురేసి ప్లేయర్లను ఎంచుకునే వెసులుబాటును బీసీసీఐ కల్పించింది. అనంతరం మిగిలిన క్రికెటర్లు మెగా వేలంలోకి వచ్చేస్తారు. అయితే మెగా వేలం నిర్వహిస్తారనేది ఇంకా నిర్ణయించలేదు. రిటెన్షన్‌కు సంబంధించి జాబితాను ఇవాళ రాత్రికి (అంచనా సమయం 9.30) బీసీసీఐ విడుదల చేసే అవకాశం ఉంది. అలానే మెగా వేలం తేదీని కూడా ప్రకటించొచ్చు. 

కొత్తగా రెండు జట్లు వస్తుండటం.. పాత ఫ్రాంచైజీల్లోనూ భారీ మార్పులు ఉండే అవకాశం ఉండటంతో  మెగా వేలంపై భారీ ఆసక్తి నెలకొని ఉంది. ఈ సారి ఏ ఆటగాడు అత్యధిక ధరను కైవసం చేసుకుంటాడనే దానిపై చర్చ కొనసాగుతోంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఒక్కో ఫ్రాంచైజీ మెగా వేలంలో ఆటగాళ్ల కోసం రూ. 90 కోట్ల వరకు ఖర్చు చేయవచ్చు. అంతర్జాతీయంగా, దేశవాళీలో మంచి ఫామ్‌ కనబరిచిన క్రికెటర్లు అధిక మొత్తాన్ని అందుకుంటారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా రిటెయిన్‌ పద్ధతిలోనూ కొన్ని మార్పులు చేసింది.

* ఫ్రాంచైజీ అట్టిపెట్టుకునే నలుగురిలో భారతీయ ఆటగాళ్లు గరిష్ఠంగా ముగ్గురు ఉండొచ్చు. అలానే విదేశీ ఆటగాళ్లు ఇద్దరిని మించకూడదు. 

* ఈ లెక్క ప్రకారం.. నలుగురిలో ముగ్గురు భారతీయులు, ఒకరు విదేశీ క్రికెటర్‌ ఉండొచ్చు. 

* ఇద్దరు భారతీయ క్రికెటర్లు.. ఇద్దరు విదేశీయులను ఉంచుకునే అవకాశం ఉంది. 

అత్యంత విలువైన ఆటగాళ్ల పరిస్థితి ఏంటో ఓసారి చూద్దాం.. 

విరాట్ కోహ్లీ: ఐపీఎల్‌లోనే అత్యధిక విలువ కలిగిన ఆటగాడు విరాట్‌ కోహ్లీ. ఆర్‌సీబీ కోహ్లీకి రూ. 17 కోట్లు వెచ్చించింది. అయితే ఈసారి ఆటగాడిగా మాత్రమే కోహ్లీ జట్టులో ఉండనున్నాడు. కెప్టెన్సీని వదిలేస్తున్నట్లు యూఏఈ ఎడిషన్‌ సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. 

క్రిస్‌ మోరిస్‌: రాజస్థాన్‌ రాయల్స్‌ రూ. 16.25 కోట్లకు కొనుగోలు చేసిన ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌. అయితే గత రెండు సీజన్లలో పెద్దగా రాణించిందేమీ లేదు. ఇప్పుడు ఆర్‌ఆర్‌ మోరిస్‌ను అట్టిపెట్టుకోవడం కష్టమే. వేలంలోకి వచ్చినా భారీ మొత్తం సొంతం చేసుకోకపోవచ్చు. 

ప్యాట్‌ కమిన్స్‌: ఫాస్ట్‌బౌలర్‌ అయిన కమిన్స్‌ను కేకేఆర్‌ రూ. 15.5 కోట్లకు దక్కించుకుంది. భారీగా ఆశలు పెట్టుకున్నప్పటికీ ధరకు తగ్గ న్యాయం చేయలేదు. ఏడు మ్యాచుల్లో కేవలం తొమ్మిది వికెట్లను మాత్రం పడగొట్టాడు. కేకేఆర్‌ రిటెయిన్‌ చేసుకునేందుకు మొగ్గు చూపదని విశ్లేషకులు చెబుతున్నారు. 

ఎంఎస్‌ ధోనీ, రోహిత్, పంత్‌: సీఎస్‌కే, ముంబయి, దిల్లీ సారథులు ఎంఎస్‌ ధోనీ, రోహిత్ శర్మ, రిషభ్‌ పంత్‌లను ఆయా జట్లు రిటెయిన్‌ చేసుకోవడం ఖాయం. వీరి బ్రాండ్‌ విలువ రూ. 15 కోట్లు. అయితే ఈ సారి ఎక్కువ ఆఫర్‌ చేయొచ్చని తెలుస్తోంది.

మ్యాక్స్‌వెల్‌: అంతకుముందు ఫామ్‌లో లేని మ్యాక్స్‌వెల్‌ను ఆర్‌సీబీ భారీ మొత్తం (రూ. 14.25 కోట్లు) వెచ్చించి దక్కించుకోవడంతో క్రీడాలోకం ఆశ్చర్య పోయింది. అయితే ఐపీఎల్‌ 14వ సీజన్‌లో తన స్థాయికి తగ్గ ఆటను ఆడిన మ్యాక్సీ.. ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కు వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఈ సారి కోహ్లీతోపాటు మ్యాక్స్‌వెల్‌ను ఆర్‌సీబీ రిటెయిన్‌ చేయనుంది. 

సునిల్ నరైన్‌: విభిన్న స్పిన్‌తోపాటు బ్యాటింగ్‌లోనూ మెరుపు దాడి చేయగల ఆటగాడు సునిల్‌ నరైన్. కేకేఆర్‌ రూ. 12.55 కోట్లకు దక్కించుకుంది. ఇలాంటి కీలక ఆటగాడిని ఈసారి కూడా కోల్‌కతా రిటెయిన్‌ చేసుకుంటుంది.  

డేవిడ్ వార్నర్‌: సన్‌రైజర్స్‌ అంటే డేవిడ్‌ వార్నర్‌.. అనేలా పెనవేసుకుని పోయిన బంధం ఎందుకో బీటలువారింది. ఎస్‌ఆర్‌హెచ్‌ రూ. 12.55 కోట్లు వెచ్చించి మరీ కొనుగోలు చేసిన డేవిడ్‌ వార్నర్‌కు 14వ సీజన్‌ రెండో అంచెలో సారథ్యంతోపాటు జట్టులోనూ స్థానం కల్పించలేదు. దీంతో ఈసారి వార్నర్‌ మెగా వేలంలోకి వచ్చేస్తానని తన ట్వీట్లతో చెప్పకనే చెప్పాడు. ఈ సారి మెగా వేలంలో హాట్‌ టాపిక్‌గా డేవిడ్‌ వార్నర్‌ మారే అవకాశం ఉంది. 

కేఎల్‌ రాహుల్‌: పంజాబ్‌ కింగ్స్‌ జట్టుకు సారథ్యం వహించిన కేఎల్‌ రాహుల్‌ను రూ. 11.95 కోట్లకు సొంతం చేసుకుంది. పంజాబ్ కింగ్స్‌ రిటెయిన్‌ చేసుకోదనే వార్తల నేపథ్యంలో రాహుల్‌ మెగా వేలంలోకి వస్తాడా? లేదా ఏదైనా కొత్త జట్టుకి కెప్టెన్‌గా  ఎంపిక కానున్నాడా? వేచి చూడాల్సిందే. 

హార్దిక్‌ పాండ్య: ముంబయి ఇండియన్స్ జట్టులో హార్దిక్‌ పాండ్య కీలక ఆటగాడు. గతేడాది ముంబయి యాజమాన్యం అతడిని రూ.11 కోట్లతో అట్టిపెట్టుకుంది. అయితే వెన్నెముక సమస్యతో పద్నాలుగో సీజన్‌ మొత్తం బౌలింగ్‌ చేయలేకపోయాడు. దీంతో ముంబయి రిటెయిన్‌ చేసుకోకుండా మళ్లీ వేలంలో సొంతం చేసుకునే అవకాశం ఉందని క్రీడా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read latest Sports News and Telugu News

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని