IND vs ENG : లార్డ్స్‌లోనే పట్టేయాలని..

పేస్‌, స్వింగ్‌తో చెలరేగిపోతున్న బౌలర్లు.. ప్రమాదకర ప్రత్యర్థి బౌలింగ్‌ను లెక్కచేయని బ్యాటర్లు.. ఇలా ఆల్‌రౌండ్‌ జోరుతో, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న టీమ్‌ఇండియా ఇంగ్లిష్‌ గడ్డ మీద మరో సిరీస్‌పై కన్నేసింది. ఇప్పటికే ఇంగ్లాండ్‌లో టీ20 సిరీస్‌ నెగ్గిన భారత్‌.. ఇప్పుడు వన్డే సిరీస్‌నూ చేజిక్కించుకునేందుకు సిద్ధమైంది. లార్డ్స్‌లో బట్లర్‌ సేనతో నేడే రెండో వన్డే. జోరు కొనసాగించి రోహిత్‌ సేన సిరీస్‌ పట్టేస్తుందా? ప్రత్యర్థి పుంజుకుని సిరీస్‌ సమం చేస్తుందా? అన్నది ఆసక్తికరం.

Updated : 14 Jul 2022 12:16 IST

సిరీస్‌పై టీమ్‌ఇండియా కన్ను
నేడు ఇంగ్లాండ్‌తో  రెండో వన్డే
ఈ మ్యాచ్‌కూ కోహ్లి అనుమానమే
సాయంత్రం 5.30 నుంచి

పేస్‌, స్వింగ్‌తో చెలరేగిపోతున్న బౌలర్లు.. ప్రమాదకర ప్రత్యర్థి బౌలింగ్‌ను లెక్కచేయని బ్యాటర్లు.. ఇలా ఆల్‌రౌండ్‌ జోరుతో, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న టీమ్‌ఇండియా ఇంగ్లిష్‌ గడ్డ మీద మరో సిరీస్‌పై కన్నేసింది. ఇప్పటికే ఇంగ్లాండ్‌లో టీ20 సిరీస్‌ నెగ్గిన భారత్‌.. ఇప్పుడు వన్డే సిరీస్‌నూ చేజిక్కించుకునేందుకు సిద్ధమైంది. లార్డ్స్‌లో బట్లర్‌ సేనతో నేడే రెండో వన్డే. జోరు కొనసాగించి రోహిత్‌ సేన సిరీస్‌ పట్టేస్తుందా? ప్రత్యర్థి పుంజుకుని సిరీస్‌ సమం చేస్తుందా? అన్నది ఆసక్తికరం.

లండన్‌

జట్టు నిండా ప్రమాదకర ఆటగాళ్లతో.. ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని మార్చే బ్యాటర్లతో నిండిన ఇంగ్లాండ్‌ను తొలి వన్డేలో చిత్తు చిత్తుగా ఓడించిన టీమ్‌ఇండియా ఎనలేని ఉత్సాహంతో ఉంది. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో రాణించిన భారత్‌ గత మ్యాచ్‌లో ప్రత్యర్థిని దాని సొంతగడ్డపైనే 10 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ విజయం జట్టు ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేసింది. అదే జోరుతో గురువారం జరిగే రెండో డేనైట్‌ వన్డేలోనూ విజయదుందుభి మోగించి.. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌కు సిరీస్‌ను మళ్లించాలని ఇంగ్లాండ్‌ చూస్తోంది. గజ్జల్లో గాయం కారణంగా తొలి వన్డేకు దూరమైన విరాట్‌ కోహ్లి.. ఈ మ్యాచ్‌లోనూ ఆడేది అనుమానమే. అతడి ఫిట్‌నెస్‌పై స్పష్టత లేదు.

బౌలింగ్‌లో దూకుడు..: ఇంగ్లిష్‌ గడ్డపై బౌలింగ్‌కు అనుకూలించే పరిస్థితులను సమర్థంగా వాడుకుంటూ ప్రత్యర్థిని కుప్పకూల్చుతున్న పేసర్లు, కఠినమైన పరిస్థితుల్లోనూ పటిష్ఠమైన ప్రత్యర్థి బౌలింగ్‌ దాడిని కాచుకుంటూ పరుగులు సాధిస్తున్న బ్యాటర్లు.. ఇలా ఎంతో బలంగా ఉన్న టీమ్‌ఇండియాకు పెద్దగా ఇబ్బందులేమీ లేవు. గత మ్యాచ్‌లో ఆరు వికెట్లతో, అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన బుమ్రా గొప్ప ఫామ్‌లో ఉన్నాడు. పిచ్‌ బౌలింగ్‌కు సహకరిస్తే చాలు చెలరేగిపోతున్నాడు. బుల్లెట్‌ లాంటి బంతులతో వికెట్లు ఎగరగొడుతున్నాడు. తొలి వన్డే ప్రదర్శన తర్వాత అతను మరింత రెచ్చిపోతాడనడంలో సందేహం లేదు. ఇక ఏడాదిన్నర విరామం తర్వాత తొలి వన్డే ఆడిన షమి తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. తన బౌలింగ్‌ వైవిధ్యంతో మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. బుమ్రాకు చక్కటి సహకారం అందిస్తూ ప్రత్యర్థి పని పడుతున్నాడు. ప్రసిద్ధ్‌ కృష్ణ కూడా తన బౌన్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. మరోసారి మన పేసర్లు సత్తాచాటితే విజయం మనదే. ఇంగ్లాండ్‌ టాప్‌ఆర్డర్‌ను ఎంత త్వరగా పెవిలియన్‌ చేర్చితే అంత మంచిది.

శ్రేయస్‌పై దృష్టి..: చాలా రోజుల తర్వాత కలిసి ఓపెనింగ్‌ చేసిన రోహిత్‌, ధావన్‌ గత మ్యాచ్‌లో భారత్‌కు ఘన విజయాన్ని అందించారు. మరో బ్యాటర్‌ క్రీజులోకి వచ్చే అవసరమే లేకుండా అజేయంగా నిలిచి పని పూర్తి చేశారు. ముఖ్యంగా అర్ధశతకంతో రోహిత్‌ ఫామ్‌ చాటడం ఆనందాన్నిచ్చే విషయం. పుల్‌ షాట్లను ఎంతో కచ్చితత్వంతో బౌండరీలుగా మలిచిన తీరు అతని దూకుడుకు అద్దం పడుతోంది. బ్యాటర్‌గా రాణిస్తున్న అతను.. కెప్టెన్‌గానూ మరిన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ధావన్‌ కూడా తిరిగి లయ అందుకున్నట్లు కనిపించాడు. మరోసారి ఈ ఓపెనింగ్‌ జోడీ చెలరేగితే జట్టుకు తిరుగుండదు. ఇక కోహ్లి స్థానంలో జట్టులోకి వచ్చిన శ్రేయస్‌కు గత మ్యాచ్‌లో బ్యాటింగ్‌ అవకాశం రాలేదు. ఈ మ్యాచ్‌లోనూ అతనాడి, క్రీజులోకి వస్తే ఎలాంటి ప్రదర్శన చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. షార్ట్‌పిచ్‌ బంతులను ఎదుర్కోవడంలో బలహీనతను అతనెలా అధిగమిస్తాడన్నది కీలకం. ఓ వైపు కోహ్లి పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న నేపథ్యంలో.. శ్రేయస్‌ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడో లేదో చూడాలి. జట్టులో చోటు కోసం తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో అతను రాణించకపోతే అంతే సంగతి. కోహ్లి పూర్తిస్థాయిలో కోలుకుని తిరిగి అందుబాటులోకి వస్తే తప్ప తుదిజట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.

ప్రతీకారేచ్ఛతో..: టెస్టుల్లోనూ ధనాధన్‌ ఆటతో చెలరేగుతున్న ఇంగ్లాండ్‌.. భారత్‌తో తొలి వన్డేలో 110 పరుగులకే కుప్పకూలడం ఆ జట్టుకు పెద్ద షాక్‌. బుమ్రా, షమి బౌలింగ్‌ను తట్టుకోలేక ఆ జట్టు బ్యాటర్లు పెవిలియన్‌ వరుస కట్టారు. ఈ నేపథ్యంలో ప్రతీకారేచ్ఛతో ఉన్న ఆ జట్టు కీలకమైన రెండో వన్డేలో ఎదురు దాడికి దిగుతుందనడంలో సందేహం లేదు. ఈ మ్యాచ్‌లో ఓడితే సిరీస్‌ చేజారే ప్రమాదం ఉంది కాబట్టి బట్లర్‌ సేన తెగించి ఆడే అవకాశం ఉంది. ముఖ్యంగా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాక భారత్‌కు టీ20 సిరీస్‌ కోల్పోయిన బట్లర్‌.. ఇప్పుడు వన్డే సిరీస్‌ను కాపాడుకునేందుకు పోరాడే ఆస్కారముంది. అతను క్రీజులో నిలబడితే ఎంతటి విధ్వంసం సృష్టించగలడో తెలిసిందే. ఇక తనతో పాటు బెయిర్‌స్టో, రూట్‌, స్టోక్స్‌, రాయ్‌, లివింగ్‌స్టోన్‌తో కూడిన బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఎప్పుడైనా ప్రమాదకరమే. అందుకే భారత్‌ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకుంటే మూల్యం చెల్లించక తప్పదు. ఆ జట్టు బౌలర్లకూ మన బ్యాటర్లు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదు. అప్పుడే సిరీస్‌ మన సొంతమవుతుంది. 

తుది జట్లు (అంచనా)
భారత్‌: రోహిత్‌, ధావన్‌, శ్రేయస్‌, సూర్యకుమార్‌, పంత్‌, హార్దిక్‌, జడేజా,   షమి, బుమ్రా, చాహల్‌, ప్రసిద్ధ్‌
ఇంగ్లాండ్‌: రాయ్‌, బెయిర్‌స్టో, రూట్‌, స్టోక్స్‌, బట్లర్‌, లివింగ్‌స్టోన్‌, మొయిన్‌ అలీ, ఒవర్టన్‌, విల్లీ, కార్స్‌, టాప్లీ


8

ఇప్పటివరకూ లార్డ్స్‌లో భారత్‌ ఆడిన వన్డేలు. నాలుగింట్లో గెలిచి, మూడు మ్యాచ్‌ల్లో ఓడింది. ఓ మ్యాచ్‌ టైగా ముగిసింది.


పిచ్‌ ఎలా ఉంది?

లార్డ్స్‌ పిచ్‌ సంప్రదాయంగా అయితే బ్యాటింగ్‌కు అనుకూలం. కానీ గత కొన్నేళ్లుగా ఇక్కడ బౌలర్లు ఆధిపత్యం చలాయిస్తున్నారు. ఇక్కడి పరిస్థితులు పేసర్లకు సహకరిస్తాయనే అంచనాలున్నాయి. ఈ మైదానంలో వన్డే తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 238గా ఉంది. ఇప్పటివరకూ ఇక్కడ జరిగిన 70 మ్యాచ్‌ల్లో 33 సార్లు మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లు, 32 సార్లు ఛేదన జట్లు గెలిచాయి.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని