IND vs BAN: భారత్-బంగ్లా మ్యాచ్.. వాతావరణం ఎలా ఉందంటే? రద్దైతే పరిస్థితేంటి?

వెస్టిండీస్‌లో ఎనిమిది జట్లతోపాటు మరొకటి అప్పుడప్పుడు తానున్నాంటూ పోటీపడుతోంది. అదే వరుణుడు. ఆంటిగ్వా వేదికగా జరగనున్న మ్యాచ్‌లకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే అక్కడ ఓ మ్యాచ్‌కు ఆటంకం కలిగించిన సంగతి తెలిసిందే.

Published : 22 Jun 2024 13:06 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్ సూపర్-8 పోరులో భాగంగా ఇవాళ రాత్రి 8 గంటలకు భారత్-బంగ్లాదేశ్‌ మ్యాచ్ జరగనుంది. విండీస్‌లోని ఆటింగ్వా వేదికగా ఇరు జట్లు తలపడతాయి. అయితే, ఇదే మైదానంలో బంగ్లా-ఆసీస్‌ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. ఆ మ్యాచ్ ఫలితం కూడా డక్‌వర్త్‌లూయిస్‌ పద్ధతి ప్రకారమే విజేతను నిర్ణయించిన సంగతి తెలిసిందే. బంగ్లాతో మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్ (Team India) సెమీస్‌కు చేరుకోవడం దాదాపు ఖాయమవుతుంది. ఇప్పుడు వరుణుడు ఆటంకం కలిగిస్తే ఏమవుతుందనే ప్రశ్న అభిమానుల్లో నెలకొంది. 

వెదర్‌ రిపోర్ట్‌ ఇదే.. 

  • భారత కాలమానానికి, ఆంటిగ్వా టైమ్‌కు 7.30 గంటల వ్యత్యాసం ఉంది. టీ20 ప్రపంచకప్‌లో (ICC Mens T20 World Cup) బంగ్లాదేశ్‌తో టీమ్‌ఇండియా మ్యాచ్‌ రాత్రి 8 గంటలకు (మన కాలమానం) ప్రారంభమవుతుంది. అంటే ఆంటిగ్వాలో ఉదయం 10.30 గంటలకు మొదలుకానుంది.
  • ప్రస్తుతం ఆంటిగ్వాలో సమయం అర్ధరాత్రి 3 గంటలు. ఇప్పుడు అక్కడ చిన్నపాటి వర్షం (Rainfall) పడుతోంది. అయితే, ఆక్యూ వెదర్‌ రిపోర్ట్‌ ప్రకారం.. కాసేపు మాత్రమే ఉంటుంది. 
  • మ్యాచ్‌ ప్రారంభమయ్యే సమయానికి మాత్రం మబ్బులు పట్టి ఉంటాయని తెలుస్తోంది. అడపాదడపా చినుకులు (Rain) పడొచ్చు. మ్యాచ్‌కు అంతరాయం కలిగే ప్రమాదం లేకపోలేదు.
  • అయితే, మ్యాచ్‌ పూర్తిగా రద్దయ్యే పరిస్థితి ఉండదని వాతావరణ శాఖ చెబుతోంది. బంగ్లా-ఆసీస్ మ్యాచ్‌ మాదిరిగా కాకుండా..  కొన్ని ఓవర్ల కోత కూడా లేకుండానే మ్యాచ్‌ జరిగేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది. 
  • భారత్-బంగ్లా మ్యాచ్ (India vs Bangladesh) టాస్‌ కాస్త ఆలస్యం కావచ్చు. అయితే, అదేమీ ఓవర్లపై ప్రభావం ఉండదని తెలుస్తోంది. 

ప్రస్తుతం ఇలా..

  • ప్రస్తుతం సూపర్‌-8 గ్రూప్‌-1లో ఆస్ట్రేలియా, భారత్‌ చెరో విజయంతో ఉన్నాయి. నెట్‌ రన్‌రేట్‌ పరంగానూ ఇరు జట్లూ +2పైనే కొనసాగుతున్నాయి. 
  • ఒకవేళ బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ రద్దైతే.. భారత్‌కు ఒక పాయింట్ మాత్రమే వస్తుంది. అప్పుడు 3 పాయింట్లతో టీమ్‌ఇండియా ఉంటుంది. 
  • ఇవాళ మ్యాచ్‌ జరిగి.. బంగ్లాదేశ్‌పై భారత్ విజయం సాధిస్తే దాదాపు సెమీస్‌ బెర్తు ఖాయమవుతుంది. అప్పుడు వరుసగా రెండు ఓటములతో బంగ్లాదేశ్‌ ఇంటిముఖం పట్టక తప్పదు. 
  • ఇక రెండో బెర్తు కోసం.. అఫ్గాన్‌-ఆసీస్‌ మ్యాచ్‌ (జూన్ 23న) ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు సెమీస్‌ రేసులో ఉంటారు. ఆసీస్ విజయం సాధిస్తే అఫ్గాన్‌ ఇంటిముఖం పట్టినట్లే.
  • ఒకవేళ ఇప్పుడు బంగ్లాతో మ్యాచ్‌ వర్షం (Weather Forecast) కారణంగా రద్దయినా.. ఆసీస్‌తో కలిసి భారత్‌ సెమీస్‌కు చేరుకుంటుంది. అలా జరగాలంటే ముందు అఫ్గాన్‌ను ఆసీస్‌ ఓడించాల్సి ఉంటుంది. 
  • ఒకవేళ అఫ్గాన్‌ చేతిలో ఆసీస్‌ ఓడితే మాత్రం.. ఇక చివరి మ్యాచ్‌లో కంగారూలతో జరిగే (జూన్ 24న) భారత్‌ పోరు కీలకంగా మారుతుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని