Tokyo Olympics: నా కుమారుడు చరిత్ర సృష్టిస్తాడు 

ఎలాంటి అంచనాలు లేకుండా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగిన రెజ్లర్‌ రవి కుమార్‌ దహియా అద్భుతం చేశాడు. 57 కిలోల విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లి దేశం మొత్తాన్ని ఆనందంలో ముంచెత్తాడు....

Updated : 05 Aug 2021 04:47 IST

చండీగఢ్‌: ఎలాంటి అంచనాలు లేకుండా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగిన రెజ్లర్‌ రవి కుమార్‌ దహియా అద్భుతం చేశాడు. 57 కిలోల విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లి దేశం మొత్తాన్ని ఆనందంలో ముంచెత్తాడు. ఈ విజయంతో రవి కుమార్‌ స్వగ్రామం హరియాణాలోని నహ్రీలో పండగ వాతావరణం నెలకొంది. రెజ్లర్‌ తండ్రి రాకేశ్‌ సంబురాల్లో మునిగిపోయారు. రవి తండ్రిగా గర్విస్తున్నానని పేర్కొన్నారు. ఈ విశ్వక్రీడల్లో తన కుమారుడు స్వర్ణం సాధిస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాకేశ్ మాట్లాడుతూ.. ‘ ఇది దీపావళిలా ఉంది. రవి మా గ్రామాన్నే కాదు.. హరియాణాతోపాటు దేశం  మొత్తం గర్వపడేలా చేశాడు. రవి విజయం ఈ దేశపు విజయం. నా కుమారుడు స్వర్ణం సాధించి చరిత్ర సృష్టిస్తాడు’ అని ఆనందం వ్యక్తం చేశారు.

రవి కుమార్‌ 57 కిలోల విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించి కనీసం రజతం ఖాయం చేసుకున్నాడు. కజక్‌స్థాన్‌ కుస్తీవీరుడు సనయెవ్‌ నురిస్లామ్‌ను 7-9 తేడాతో ఓడించాడు. ప్రత్యర్థి తనపై ఆధిపత్యం చలాయిస్తున్న తరుణంలో అనూహ్యంగా పుంజుకున్న రవి ‘విక్టరీ బై ఫాల్‌’ పద్ధతిలో పసిడి పోరుకు అర్హత సాధించాడు.  భారత్‌ నుంచి రెజ్లింగ్‌లో ఫైనల్‌ చేరిన రెండో ఆటగాడు రవి కుమార్‌. అంతకు ముందు సుశీల్‌ కుమార్‌ 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచాడు. 2012 లండన్‌లో ఫైనల్‌కు చేరుకొని రజతంతో మురిపించాడు. 2012లో యోగేశ్వర్‌ కాంస్యం సాధించాడు. కాగా తొమ్మిదేళ్ల తర్వాత రవి ఫైనల్‌కు చేరుకొని అబ్బురపరిచాడు. రష్యన్‌ క్రీడాకారుడితో గురువారం తలపడనున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని