Published : 30 Dec 2021 01:16 IST

Rewind 2021: ధావన్‌ నట విశ్వరూపం.. డేవిడ్‌ భాయ్‌ అడ్డా.. చాహల్‌ పెళ్లి వీడియో!

ఈ ఏడాదిలో ట్వీట్లు, ఇన్‌స్టా వీడియోలతో ఆకట్టుకున్న క్రికెటర్లు

భారత్‌లో సినీతారల కంటే క్రికెటర్లకే ఆదరణ ఎక్కువ. వారి సోషల్‌ మీడియా ఖాతాలను లక్షలు.. కోట్ల మంది నెటిజన్లు ఫాలో అవుతుంటారు. అయితే, కొంతమంది క్రికెటర్లు మాత్రమే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తుంటారు. అప్పుడప్పుడు సరదా పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటున్నారు. కాగా.. మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతున్న నేపథ్యంలో ఈ ఏడాదిలో నెటిజన్లను బాగా ఆకట్టుకున్న క్రికెటర్ల పోస్టులేవో ఓ లుక్కెద్దామా?

తండ్రిగా కోహ్లీ తొలి ట్వీట్‌

భారత స్టార్‌ క్రికెటర్ విరాట్‌ కోహ్లీ-అనుష్క జంటకు జనవరి 11న కుమార్తె జన్మించింది. ఈ శుభవార్తను వెల్లడిస్తూ కోహ్లీ చేసిన ట్వీట్‌కు నెటిజన్లు లైకుల వర్షం కురిపించారు. దీంతో 2021లో అత్యధికంగా ఇష్టపడిన ట్వీట్‌గా నిలిచింది. అలాగే ఐపీఎల్‌ టోర్నీలో ధోనిపై కోహ్లీ ప్రశంసలు కురిపిస్తూ చేసిన ట్వీట్‌ కూడా అందరినీ ఆకట్టుకుంది. ఐపీఎల్‌లో భాగంగా అక్టోబర్‌ 10న దిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ మధ్య క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ చివర్లో బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టు కెప్టెన్‌, మిస్టర్‌ కూల్‌ ఎం.ఎస్‌.ధోని.. మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి జట్టును గెలిపించాడు. ఉత్కంఠ పోరులో తనదైన ఫినిషింగ్‌ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌ చూసిన విరాట్‌ కోహ్లీ.. ‘కింగ్ ఈజ్ బ్యాక్‌.. క్రికెట్‌లో అతిగొప్ప ఫినిష‌ర్‌. మ‌రోసారి న‌న్ను ఆనందంతో గెంతులేసేలా చేశాడు’ అని ట్వీట్ చేశాడు


పాట్‌ కమిన్స్‌ దాతృత్వం

కరోనా రెండో దశలో ఆక్సిజన్ కొరతతో భారత్‌ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌కు అండగా నిలిచేందుకు ఆస్ట్రేలియా క్రికెటర్ పాట్‌ కమిన్స్ ఏప్రిల్‌ నెలలో పీఎం కేర్స్‌కు 50 వేల డాలర్లు విరాళంగా ప్రకటించారు. ఆ సందర్భంగా పెట్టిన ట్వీట్‌ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. 


శార్దూల్‌ను ట్రోల్‌ చేసిన రోహిత్‌ శర్మ

భారత క్రికెటర్లు.. రోహిత్‌ శర్మ, శ్రేయాస్‌ అయ్యర్‌, శార్దూల్‌ ఠాకూర్‌ కలిసి సరదాగా డ్యాన్స్‌ చేశారు. అయితే, అందులో శార్దూల్‌ను ట్రోల్‌ చేస్తూ రోహిత్‌ డిసెంబర్‌ 6న ఇన్‌స్టాలో ఆ డాన్స్‌ వీడియోను పోస్టు చేశాడు. శార్దూల్ ఏం చేశాడో ఈ వీడియోలో మీరే చూడండి..


డేవిడ్‌ భాయ్‌ అడ్డా..

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన డేవిడ్‌ భాయ్‌.. అదేనండీ, ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ సోషల్‌మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు సినిమాల్లోని పాటలకు డేవిడ్‌ మాత్రమే కాదు.. ఆయన కుటుంబసభ్యులతోనూ స్టెప్పులేయిస్తుంటారు. ‘అల వైకుంఠపురంలో’ చిత్రంలోని ‘బుట్టబొమ్మ’ పాటతో మొదలు పెట్టి.. అనేక తెలుగు సినిమా పాటలకు డ్యాన్స్‌ చేస్తూ.. డైలాగులు చెబుతూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ఆ మధ్య ‘సరిలేరు నీకెవ్వరు’చిత్రంలోని ‘మైండ్‌ బ్లాకు’ పాటకు సతీమేతంగా డ్యాన్స్‌ చేశారు. ఇటీవల ‘పుష్ప’ చిత్రంలో ‘యే బిడ్డా.. ఇది నా అడ్డా’ పాటకు ఫేస్‌యాప్‌ ద్వారా తన ముఖాన్ని జోడించి వీడియో రూపొందించారు. ఇదిగోండి ఆ వీడియోలు..


టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ ప్రదర్శనపై సెహ్వాగ్‌ సెటైర్లు...

భారత మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ట్విటర్‌లో తనదైన శైలిలో ట్వీట్లు చేస్తుంటారు. టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్‌ కూడా బాగా వైరల్‌ అయింది. అక్టోబర్‌-నవంబర్‌ మధ్య జరిగిన ఈ మెగా టోర్నీలో భారత్‌ లీగ్‌ దశలోనే వెనుదిరిగింది. ఆ సమయంలో భారత్‌ పరిస్థితి ఇదంటూ.. వీరేంద్ర సెహ్వాగ్‌ ఓ ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ.. ఓ సభలో ‘ఖతం.. బై బై.. టాటా.. గుడ్‌బై’ అని చేసిన వ్యాఖ్యలతో రూపొందించిన ఓ మీమ్‌ను జతచేశారు. 


బిల్లీ బౌడెన్‌ మీరేమంటారు..?

క్రికెట్‌ మ్యాచ్‌లో ఎంపైర్‌ పాత్ర చాలా కీలకం. వేసే ప్రతి బంతిని పరిశీలించాలి. ఫలితాలన్ని చేతులతో సంజ్ఞ చేసి చూపించాలి. అయితే, న్యూజిలాండ్‌కు చెందిన బిల్లి బౌడెన్‌ మాత్రం ఎంపైరింగ్‌లో అప్పుడప్పుడు సరదా విన్యాసాలు చేస్తుంటారు. బంతి వైడ్‌ వెళ్లినా, బౌండరీ దాటినా, వికెట్‌ పడినా చిత్రవిచిత్ర భంగిమలతో ప్రకటిస్తుంటారు. అయితే, ఈ మధ్య భారత్‌లో జరిగిన ఓ దేశవాలీ క్రికెట్‌ మ్యాచ్‌లో బంతి వైడ్‌ పడగానే.. ఎంపైర్‌ తలకిందులుగా నిలబడి కాళ్లతో వైడ్‌ సంజ్ఞ చేశాడు. ఆ వీడియో వైరల్‌ కాగా.. అది మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ దృష్టికి చేరింది. దీంతో ఆ వీడియోని ట్వీట్‌ చేసిన సచిన్‌.. బిల్లి బౌడెన్‌ దీనిపై మీ అభిప్రాయమేంటని అడిగారు. ఆ వీడియో.. సచిన్‌ ట్వీట్‌ రెండూ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. 


శిఖర్‌ ధావన్‌.. క్రికెటర్‌ మాత్రమే కాదు.. నటుడు, సంగీత కళాకారుడు

భారత క్రికెట్‌ జట్టు ఓపెనింగ్‌ బ్యాటర్‌ శిఖర్‌ ధావన్‌ బ్యాటు పట్టుకొని పరుగులు రాబట్టడమే కాదు.. ఫ్లూట్‌ వాయిస్తూ చక్కటి సంగీతం కూడా వినిపించగలడు. ఆయనలో ఉన్న ఈ టాలెంట్‌ను తరచూ బయటపెడుతుంటాడు. జులై నెలలో మరో భారత క్రికెటర్‌ పృథ్వీషా పాట పడగా.. ధావన్‌ ఫ్లూట్‌ వాయించాడు. ఆ వీడియోను తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్‌ చేయగా.. లక్షల మంది వీక్షించారు. తాజాగా ‘షోలే’ చిత్రంలో విలన్‌ గబ్బర్‌సింగ్‌ చెప్పే ‘కితినే ఆద్మీ థే’ డైలాగును ధావన్‌ రిక్రియేట్‌ చేసే ప్రయత్నం చేశాడు. 


చాహల్‌ పెళ్లి వీడియో చూశారా!

టీమిండియా స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్‌ చేస్తుంటాడు. తోటి ఆటగాళ్లను ఇంటర్వ్యూలు చేస్తూ.. ఆటపట్టిస్తూ సరదా వీడియోలు రూపొందించి ఇన్‌స్టాలో పోస్టు చేస్తుంటాడు. డాక్టర్‌ ధనుశ్రీ వర్మను చాహల్‌ గతేడాది డిసెంబర్‌లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా.. వారి పెళ్లి వీడియోను ఈ ఏడాది మార్చిలో ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేశాడు. ఆ పెళ్లికి శిఖర్‌ ధావన్‌ సహా పలువురు క్రికెటర్లు హాజరయ్యారు. ఆ వీడియోను 38లక్షలకుపైగా నెటిజన్లు వీక్షించారు.


ఇల్లు కొనాలి.. ఎక్కడైతే బాగుంటుంది?

భారత్‌ యువక్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ దృష్టి అంతా ఇప్పుడు టీమిండియాలో స్థిరమైన స్థానం సంపాదించడంపైనే ఉంది. సోషల్‌మీడియాలోనూ మ్యాచ్‌లకు సంబంధించిన అంశాలనే ఎక్కువగా ట్వీట్‌ చేస్తుంటాడు. అయితే, జనవరి నెలలో చేసిన ట్వీట్‌ మాత్రం నెట్టింట తెగ వైరల్‌ అయింది. ‘నేను ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి.. మా కుటుంబసభ్యులు కొత్త ఇల్లు తీసుకోమని వెంటపడుతున్నారు. మరి ఉండటానికి గురుగ్రామ్‌ సరైనదేనా? వేరే ఆప్షన్‌ ఏమైనా ఉంటే చెప్పండి’అని ట్వీట్‌ చేశాడు. 

ఆ ట్వీట్‌కు ఓ అమ్మాయి స్పందిస్తూ ‘నా హృదయంలో ఉంటే అద్దె కూడా ఉండదు. ఇంకో ఇంటితో పనేముంది’అని కామెంట్‌ చేసింది. ‘దిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో ఇల్లు తీసుకోవాలని అనుకుంటే.. మెట్రో స్టేషన్‌ సమీపంలోనే తీసుకోండి అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు. ‘మరో పదేళ్లపాటు మీరు ఏడాదికి 250 రోజులు క్రికెట్‌ ఆడుతూనే ఉంటారు. కాబట్టి ఓ విమానం కొనుగోలు చేయండి. అందులోనే కుటుంబసభ్యుల కోసం గదులు ఉండేలా చూడండి. ఎయిర్‌పోర్టులో మీకు పార్కింగ్‌ కూడా లభిస్తుంది’అని మరో నెటిజన్‌ సరదాగా స్పందించారు.

Read latest Sports News and Telugu News

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని