Cricket - YouTube: యూట్యూబర్లుగా క్రికెటర్లు.. టాప్‌-10లో వీళ్లే!

తమ అభిప్రాయాలను నిర్భయంగా ఎదుటివారిని కించపరచకుండా తెలియజెప్పే...

Updated : 29 Oct 2023 11:33 IST

క్రికెట్‌ మ్యాచ్‌పై విశ్లేషణ అంటే ఒకప్పుడు పత్రికలు లేదంటే టీవీలే. మ్యాచ్‌ అవ్వగానే క్రీడానిపుణులు ఏమన్నారు, ఆటను ఎలా విశ్లేషించారు అని క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా చదివేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. అందరూ యూట్యూబ్‌లోకి వెళ్లిపోతున్నారు. కారణం అక్కడ మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాల్ని కుండ బద్దలుకొడుతున్నట్లు చెబుతుండటమే. అలా ప్రస్తుతం చాలామంది మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు యూట్యూబ్‌ ఛానల్స్‌ నిర్వహిస్తున్నారు. వారి సంగతి ఓ సారి చూద్దామా!

క్రికెటర్‌గా కెరీర్‌ తక్కువే కానీ.. 

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్ చోప్రా ఆటగాడిగా కంటే యూట్యూబర్‌గా ఎక్కువ పాపులారిటీ సాధించాడు. 2003-2004 సీజన్‌లో భారత్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌కు ఆడిన చోప్రా కేవలం 10 టెస్టుల్లో మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో రెండు అర్ధశతకాలు సహా 23 సగటుతో 437 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 60 పరుగులు మాత్రమే. ఇక యూట్యూబ్‌లో ప్రతి అంశంపై స్పందించే వ్యక్తుల్లో ఆకాశ్ ముందుంటాడు. ఆకాశ్‌ చోప్రా పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహిస్తున్నాడు. ఈ ఛానల్‌కు 3.17 మిలియన్ల సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌ వేలంలో భారీ ధరను దక్కించుకున్న ఆటగాళ్ల గురించి, జట్ల సామర్థ్యాలపై తనదైన శైలిలో విశ్లేషణలు అందించాడు ఆకాశ్‌ చోప్రా. 2011లో యూట్యూబ్‌ ఛానల్‌ను ఆకాశ్ ప్రారంభించాడు.


రెండో స్థానం రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌దే

గతంలో భారత్‌, పాక్‌ వన్డే మ్యాచ్‌ అంటే సచిన్‌, సెహ్వాగ్‌తోపాటు షోయబ్‌ అక్తర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవాడు. టెస్టుల విషయానికొస్తే ద్రవిడ్‌-అక్తర్‌ మధ్య పోరు ఆసక్తికరంగా ఉండేది. బంతిని ఎంత స్పీడ్‌గా సంధిస్తాడో షోయబ్‌ అక్తర్ మాటలు కూడా అంతే సూటిగా ఉంటాయి. మూడేళ్ల కిందట (2019) యూట్యూట్‌ ఛానల్‌ను ప్రారంభించిన అక్తర్‌ అనతి కాలంలోనే మూడు మిలియన్ల (3.10 మిలియన్లు) సబ్‌స్క్రైబర్లను సాధించాడు. ఇటీవల తుది శ్వాస విడిచిన లతా మంగేష్కర్‌కు నివాళి అర్పిస్తూ విడుదల చేసిన వీడియో అభిమానులను ఆకట్టుకుంది. భారత్, పాకిస్థాన్‌ జట్లతో సహా క్రికెట్‌కు సంబంధించి అప్‌డేట్‌లపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటాడు.


రవిచంద్రన్‌ అశ్విన్‌.. సూపర్‌ యాక్టివ్‌ 

ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లలో టీమ్‌ఇండియా ఆఫ్‌ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ యూట్యూబ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. అయితే మాతృభాష తమిళంలోనే మాట్లాడేందుకు ఆసక్తి చూపుతాడు. ఇంగ్లిష్‌ సబ్‌టైటిల్స్ వేయడం వల్ల మిగతావారికి రీచ్ అవుతున్నాడు. కేవలం క్రికెట్‌ మాత్రమే కాకుండా సినిమాలు, కరెంట్‌ అఫైర్స్‌ వంటి అంశాలపైనా తన ఛానల్‌లో చర్చిస్తుంటాడు. విరాట్ కోహ్లీ, కుమార్‌ సంగక్కర, గావస్కర్‌తో పాటు తమిళ నటులను సైతం ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. మీమ్స్‌తో కూడిన సరదా వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తుంటాడు. 2020లో ప్రారంభమైన అశ్విన్‌ యూట్యూబ్‌ ఛానల్‌కు ప్రస్తుతం 8.77 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.


సెలెక్టివ్‌గా సచిన్‌ వీడియోలు

టీమ్‌ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ కూడా యూట్యూబ్‌ ఛానల్‌ను నిర్వహిస్తున్నాడు. అయితే ముఖ్యమైన.. సెలెక్టివ్‌గా మాత్రమే తన ఛానల్‌లో వీడియోలను అప్‌లోడ్‌ చేస్తాడు. గతంలో తన బ్యాటింగ్, బౌలింగ్‌ అనుభవాలు, భారత బౌలింగ్ దాడి గురించి ప్రత్యేకంగా విశ్లేషించి అభిమానుల కోసం పెడుతుంటాడు. క్రికెట్‌ గురించి మాత్రమే కాకుండా ఇతర అంశాలనూ ప్రస్తావిస్తుంటాడు.  రెండు నెలల కిందట బ్రేక్‌ఫాస్ట్‌గా మిసాల్‌ పావ్‌ తయారు చేసిన వీడియో దాదాపు 2.7 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. సచిన్‌ 100MB లోగోతో వీడియోలను చేస్తుంటాడు.


క్రికెట్‌ మాత్రమే కాకుండా..

పాకిస్థాన్‌ క్రికెట్‌ టీమ్‌లో హిందూ క్రికెటర్‌గా చోటు సంపాదించిన డానిష్ కనేరియా లెగ్‌ బ్రేక్‌ బౌలర్. పాక్‌ తరఫున 61 టెస్టులు ఆడిన కనేరియా 261 వికెట్లు, వన్డేల్లో 18 మ్యాచుల్లో 15 వికెట్లు తీశాడు. పాక్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన నాలుగో బౌలర్‌ కావడం విశేషం. గుజరాత్‌కు చెందిన కనేరియా పూర్వీకులు కరాచీలో స్థిరపడ్డారు. 2010లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2019లో డానిష్ కనేరియా 261 పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించగా 3.63 లక్షల సబ్‌స్క్రైబర్లను సాధించాడు. కేవలం క్రికెట్‌కు సంబంధించిన అంశాలే కాకుండా హిందూ పండుగలు, వంటకాలు వంటి ఇతర వ్యాపకాలనూ వీడియోలుగా పెడుతుంటాడు. టీమ్‌ఇండియా, ఐపీఎల్‌, పాకిస్థాన్‌తో సహా ఇతర లీగ్‌ క్రికెట్‌లో ఆటగాళ్ల ప్రదర్శనపై విశ్లేషణలు చేస్తుంటాడు.


భారత పర్యటనతోనే.. 

యాషెస్‌ సిరీస్‌లో ఆసీస్‌కు సారథ్యం వహించిన ప్యాట్ కమిన్స్‌.. వ్లాగ్స్‌తో అభిమానులకు చేరువగా ఉంటాడు. ఆఫ్‌బీట్‌ కంటెంట్‌తో వీడియోలను రూపొందించి షేర్‌ చేస్తుంటాడు. అందుకే కేవలం పది నెలలకే దాదాపు రెండు లక్షల సబ్‌స్క్రైబర్లను రాబట్టగలిగాడు. ఐపీఎల్‌ 2021 సీజన్‌ కోసం ఆసీస్‌ నుంచి భారత్‌కు ప్రయాణించిన వీడియోను మొదటిసారి తన యూట్యూబ్‌లో ఉంచాడు. ఈ వీడియో దాదాపు ఒక మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు చేసిన వీడియోల్లోకెల్లా ఇదే అత్యధిక వీక్షణలను పొందినది కావడం విశేషం. అలానే నాలుగు నెలల కిందట తండ్రైన ప్యాట్ కమిన్స్‌ తన చిన్నారితో కలిసి వీడియోను పెట్టాడు.


సూటిగా చెప్పడంలో స్పెషలిస్ట్‌

గతేడాది టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో టీమ్ఇండియాపై పాక్‌ గెలిస్తే తమ దేశ క్రికెట్‌ బోర్డులో భారీ పెట్టుబడి పెట్టేందుకు పలువురు సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన వ్యక్తి గుర్తు ఉండే ఉంటాడు. అతడే పాక్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ రమీజ్‌ రజా. ఈయనా ఓ యూట్యూబ్‌ ఛానల్‌ను నిర్వహిస్తున్నాడు. యూట్యూబ్ ఛానల్‌ పెట్టకముందు.. చాలా టీవీ ఛానళ్లలో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సూటిగా, స్పష్టంగా ఉన్న విషయాన్ని చెప్పేందుకు వీడియోలు అప్‌లోడ్ చేస్తుంటాడు. 2018లో ప్రారంభించిన రమీజ్‌ రజా యూట్యూబ్‌ ఛానల్‌కు ప్రస్తుతం 1.64 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. చివరిసారిగా ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్‌ అయిన వీడియోను మూడు నెలల క్రితం రమీజ్‌ రజా అప్‌లోడ్‌ చేశాడు.


ఇంజమామ్‌ మాటల షాట్‌లు

పాకిస్థాన్‌ క్రికెటర్‌ ఇంజమామ్‌ ఉల్ హక్ అంటే తెలియని క్రికెట్‌ అభిమాని ఉండరు. సచిన్‌ తరం దిగ్గజాల్లో ఇంజమామ్‌ ఒకడు. పాక్‌ తరఫున ఆడేటప్పుడు జట్టు సభ్యులతో మాట్లాడేందుకు కూడా సిగ్గు పడే ఇంజమామ్‌ విశ్లేషకుడిగా మారతాడని ఎవరూ ఊహించి ఉండరు. ఆట పట్ల పూర్తి పరిజ్ఞానం ఉన్న ఇంజమామ్‌ 2019లో యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించాడు. 3.70 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. క్రికెటర్ల ప్రదర్శన, టీమ్‌ల ఎంపిక తదితర విషయాలపై లోతైన వ్యాఖ్యానాలు చేస్తుంటాడు. అదే విధంగా క్రికెట్‌ బోర్డులు, ఆటగాళ్లు, జట్లతో సహా ఎవరినీ కించపరిచేలా, విమర్శించేలా మాట్లాడడు. తన భావాలను నిక్కచ్చిగా వెల్లడిస్తాడని ఇంజమామ్‌కు పేరుంది.


మనోళ్లనే తిట్టి నిషేధానికి గురై.. 

ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్ హాగ్‌ ఏడు టెస్టులు, 123 వన్డేలు, 15 టీ20లు ఆడాడు. టీమ్‌ఇండియాపై టెస్టు సిరీస్‌ సందర్భంగా అప్పటి కెప్టెన్ అనిల్ కుంబ్లే, వైస్ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీలపై అసభ్య పదజాలం వాడినట్లు నిరూపణ కావడంతో రెండు టెస్టుల నిషేధం పడింది. అయితే అప్పట్లో సంచలనం సృష్టించినా తర్వాత ఐపీఎల్‌లోనూ నాలుగేళ్లపాటు హాగ్‌ ఆడటం విశేషం. దాదాపు అందరికంటే ముందుగానే యూట్యూబ్‌ ఛానల్‌లో వ్లాగ్స్‌ చేయడం మొదలుపెట్టాడు. ఇతగాడి యూట్యూబ్‌ ఛానల్‌కు 1.29 లక్షల  మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఐపీఎల్, యాషెస్‌, టీ20 ప్రపంచకప్‌ వంటి పెద్ద టోర్నీల్లో విజయం ఎవరివైపు ఉందో అంచనాలు, విశ్లేషణలు చేస్తుంటాడు.


రోజూ యూట్యూబ్‌లో...

పన్నెండేళ్ల కిందట స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో పాకిస్థాన్‌ కెప్టెన్సీ నుంచి సల్మాన్‌ భట్ ఉద్వాసనకు గురయ్యాడు. దీంతో క్రికెట్‌కు సంబంధించిన వ్యవహారాల్లో పాలుపంచుకోలేక పోయిన భట్‌.. నిషేధం తొలిగిపోవడంతో దేశవాళీ స్థాయిలో మాత్రమే ఆడగలిగాడు. మూడేళ్ల కిందట (2019) యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించిన సల్మాన్‌ .. దాయాది దేశాలతోపాటు గుర్తింపు పొందిన లీగ్‌లలో ఆటగాళ్ల ప్రదర్శనలపై విశ్లేషణలు చేస్తుంటాడు. రోజూ క్రికెట్‌కు సంబంధించి అభిమానుల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు 85 వేలకుపైగా సబ్‌స్క్రైబర్లను సాధించాడు. ఇటీవల కాలంలో భారత్‌కు చెందిన ఆటగాళ్ల ప్రదర్శనపై పాజిటివ్‌ ధోరణిలో వీడియోలు అప్‌లోడ్‌ చేశాడు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని