T20 World Cup: టీమిండియా పరాజయాలకు టాస్‌ కారణం కాదు: గావస్కర్‌

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే, ఈ పరాజయాలకు టాస్ కారణం కాదని క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ అన్నాడు.

Updated : 08 Nov 2021 11:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే, ఈ పరాజయాలకు టాస్ కారణం కాదని క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. టాస్ కారణంగానే కోహ్లిసేన పరాజయం పాలైందన్న బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ వ్యాఖ్యలపై గావస్కర్‌ స్పందించాడు. పాకిస్థాన్, న్యూజిలాండ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో మన బ్యాటర్లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారని.. అందుకే టీమిండియాపై ఆయా జట్లు పైచేయి సాధించాయని అభిప్రాయపడ్డాడు. ‘టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌, న్యూజిలాండ్ బౌలర్లు చాలా తెలివిగా బంతులేశారు. అందుకే, భారత బ్యాటర్లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. అయితే, అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో టీమిండియా బ్యాటర్లు గొప్పగా పుంజుకున్నారు. స్వేచ్ఛగా ఆడుతూ 200లకు పైగా పరుగులు చేశారు. దీంతో ఆ జట్టుపై భారత్ సులభంగా విజయం సాధించగలిగింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో కూడా భారీగా పరుగులు చేసి ఉంటే కచ్చితంగా టీమిండియా గెలుపొందేది’ అని గావస్కర్‌ పేర్కొన్నాడు. 

టీ20 ప్రపంచకప్‌లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా అంచనాలను అందుకోలేకపోయింది. కనీసం సెమీస్ కూడా చేరకుండానే ఈ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా పరాజయం పాలుకావడం సెమీస్ అవకాశాలను దెబ్బతీసింది. 2012 టీ20 ప్రపంచకప్‌ తర్వాత టీమ్‌ఇండియా ఓ ఐసీసీ ఈవెంట్లో నాకౌట్‌ దశకు చేరుకోకపోవడం ఇదే తొలిసారి. నామమాత్రమైన ఆఖరి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా సోమవారం నమీబియాతో తలపడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని