T20 League: భారత టీ20 లీగ్‌.. 87 స్లాట్‌ల కోసం వేలంలోకి 405 మంది ఆటగాళ్లు

టీ20 లీగ్‌లో మినీ వేలం నిర్వహించేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఆటగాళ్ల జాబితాను విడుదల చేయగా.. డిసెంబర్‌ 23న వేలం ఉంటుందని వెల్లడించింది.

Updated : 23 Dec 2022 13:45 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మరో పది రోజుల్లో భారత టీ20 లీగ్‌లో ఆటగాళ్ల కోసం మినీ వేలం జరగనుంది. మొత్తం 405 మంది ఆటగాళ్లలో భారతీయులు 273 మంది, ఓవర్సీస్‌ ప్రాంతానికి చెందిన 132మంది ఉన్నారు. అలాగే క్యాప్‌డ్‌ ప్లేయర్లు 119 మంది, అన్‌క్యాప్‌డ్‌ 286 మంది ఉన్నారు. కోచి వేదికగా డిసెంబర్‌ 23న ఈ- వేలం జరగనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది. 

పది ఫ్రాంచైజీల్లో 87 స్లాట్‌లు ఖాళీగా ఉన్నాయి. అందులో విదేశీ ఆటగాళ్ల కోసం 30 స్లాట్‌లు ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఓవర్సీస్‌కు చెందిన 19 మంది ఆటగాళ్లు రూ. 2 కోట్ల రిజర్వ్‌ ప్రైస్‌తో బరిలోకి దిగారు. అలాగే రూ.1.5 కోట్ల కనీస ధరతో 11 మంది ఉన్నారు. ఇక మనీశ్‌ పాండే, మయాంక్‌ అగర్వాల్ వంటి బ్యాటర్లు 20 మంది కనీస ధర రూ.కోటి కలిగి ఉన్నారు. 

ఏ జట్టుకు ఎలా?

  1. చెన్నై: ప్రస్తుతం 18 మంది ఆటగాళ్లు ఉండగా.. అందులో ఆరుగురు ఓవర్సీస్‌కు చెందిన వారు. ఏడు స్లాట్‌లు అందుబాటులో ఉండగా రూ. 20.45 కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉంది. 
  2. దిల్లీ: జట్టుకు ఐదు స్లాట్‌లు ఖాళీగా ఉన్నాయి. ఉన్న 20 మందిలో ఆరుగురు విదేశీయులు. ఇక మిగిలిన వారికోసం రూ. 19.45 కోట్ల వరకు ఖర్చు పెట్టే వీలున్నట్టు సమాచారం. 
  3. గుజరాత్‌: గత సీజన్‌ ఛాంపియన్‌ అయిన గుజరాత్‌ జట్టులో 18 మంది ఉండగా.. మరో ఏడుగురిని దక్కించుకొనేందుకు అవకాశం ఉంది. దీని కోసం రూ. 19.25 కోట్లను వెచ్చించనున్నారు.
  4. కోల్‌కతా: అన్ని ఫ్రాంచైజీల్లోకి తక్కువ నగదు అందుబాటులో ఉన్న జట్టు ఇదే. కేవలం రూ.7.05 కోట్లు మాత్రమే ఉన్నాయి. అయితే 11 స్లాట్‌లు ఉండటం గమనార్హం. 
  5. లక్‌నవూ: పది స్లాట్‌లు ఖాళీగా ఉండగా.. పర్స్‌లో రూ.23.35  కోట్లు ఉన్నాయి. ఇందులో నలుగురు విదేశీ ఆటగాళ్లను తీసుకొనే అవకాశం ఉంది. 
  6. ముంబయి: ఈ ఫ్రాంచైజీలో ఒక్కసారి చేరితే చాలు లైఫ్‌సెటిల్‌ అయిపోయినట్లేనని క్రికెటర్లు భావిస్తారు. రిలయన్స్‌ జట్టులో ఇంకా తొమ్మిదిని తీసుకొనే అవకాశం ఉంది. దానికోసం రూ. 20.55 కోట్లను ఖర్చు చేయొచ్చు. 
  7. పంజాబ్‌: కొత్త కెప్టెన్‌ను నియమించిన పంజాబ్‌ జట్టులో ఇప్పుడు 16 మంది ఆటగాళ్లు ఉన్నారు. మరో 9 స్థానాలు ఖాళీ. దీని కోసం రూ. 32.2 కోట్లను ఖర్చు పెట్టే అవకాశం ఉంది. 
  8. బెంగళూరు: ఒక్కసారైనా కప్‌ను దక్కించుకోవాలని భావిస్తున్న స్టార్‌ ప్లేయర్ల జట్టు బెంగళూరులో ఏడు స్లాట్‌లు ఖాళీగా ఉన్నాయి. దీనికోసం కేవలం రూ.8.75 కోట్లను ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. 
  9. రాజస్థాన్‌: అరంగేట్ర కప్‌ విజేత రాజస్థాన్‌ జట్టులోనూ 16 మంది ఆటగాళ్లు ఉన్నారు. మరో 9 స్లాట్‌లు ఖాళీ ఉండగా.. రూ. 13.2 కోట్లను ఖర్చు చేసే అవకాశం ఉంది. 
  10. హైదరాబాద్‌: అన్ని జట్లలోకి తక్కువ మంది ఆటగాళ్లు, ఎక్కువ ఖాళీ స్లాట్‌లు ఉన్న జట్టు హైదరాబాద్‌. పర్స్‌లోనూ భారీగానే నిల్వలు ఉండటం విశేషం. ప్రస్తుతం 12 మంది ఆటగాళ్లు ఉండగా.. మరో 13 స్లాట్‌లు ఖాళీ. వీటి కోసం రూ. 42.25 కోట్ల సొమ్ముతో ఆ ఖాళీలను పూరించే అవకాశం హైదరాబాద్‌కు ఉంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని