Trent Boult: ట్రెంట్ బౌల్ట్‌ ఈజ్ బ్యాక్‌.. వరల్డ్‌ కప్‌లో ఆడే అవకాశం!

లీగ్‌లు ఆడేందుకు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ను వదులుకొని వెళ్లిన కివీస్‌ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ మళ్లీ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే టీమ్‌ మేనేజ్‌మెంట్‌ చర్చలు కూడా జరిగిపోయినట్లు సమాచారం.

Published : 09 Jun 2023 01:42 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇప్పుడంతా వెటరన్‌ ఆటగాళ్ల రిటర్న్‌ పాలసీ నడుస్తోంది. ఇప్పటికే ఇంగ్లాండ్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ తన రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకోగా.. తాజాగా న్యూజిలాండ్‌ పేసర్ ట్రెంట్‌ బౌల్ట్‌ కూడా జాతీయ జట్టు తరఫున ఆడేందుకు సిద్ధమైనట్లు సమాచారం. బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడేందుకు సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కూడా వదులుకున్న బౌల్ట్‌ ప్రస్తుతం టీ20 లీగుల్లోనే ఆడుతున్నాడు. అయితే, ఈ ఏడాది భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో ఆడేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ జట్టు మేనేజ్‌మెంట్‌ కూడా బౌల్ట్‌తో సంప్రదింపులు జరపడం విశేషం. సెంట్రల్‌ డీల్‌ పొందిన ఆటగాళ్ల జాబితాలో బౌల్ట్‌ లేనప్పటికీ.. ‘సాధారణ ప్లేయింగ్‌ అగ్రిమెంట్’ చేసుకున్నట్లు కివీస్‌ క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. 

‘‘మేం ట్రెంట్ బౌల్ట్‌తో జరిపిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. అతడు సానుకూలంగా స్పందించాడు. ప్రపంచ కప్‌ కోసం అందుబాటులో ఉంటానని చెప్పాడు. ఇప్పటికీ బౌల్ట్‌ అత్యుత్తమ వన్డే బౌలర్‌ అనడంలో సందేహం లేదు. గాయం కారణంగా అతడు ఇబ్బంది పడ్డాడు. తప్పకుండా బౌల్ట్‌ మా స్క్వాడ్‌లో ఉంటాడు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లకూ వస్తాడనే నమ్మకం మాకుంది. అయితే, లీగ్‌లతో కమిట్‌మెంట్‌ నేపథ్యంలో మున్ముందు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి.’’ అని కివీస్‌ కోచ్ గ్యారీ స్టీడ్ తెలిపాడు.

టిమ్‌ సౌథీ నాయకత్వంలో న్యూజిలాండ్‌ వన్డే ప్రపంచ కప్‌ బరిలోకి దిగనుంది. వీరిద్దరితో కూడిన పేస్‌ దళం ప్రత్యర్థులకు వణుకు పుట్టించడం ఖాయం. ట్రెంట్‌ బౌల్ట్‌ కివీస్ తరఫున 78 టెస్టుల్లో 317 వికెట్లు, 99 వన్డేల్లో 187 వికెట్లు తీశాడు. 55 అంతర్జాతీయ టీ20ల్లోనూ 74 వికెట్లు తీశాడు. బౌల్ట్ ఐపీఎల్‌లోనూ రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని