Tokyo olympics: స్విమ్మింగ్‌లో వందో ర్యాంక్‌ కుర్రాడికి స్వర్ణం..!

400 మీటర్ల ఫ్రీ స్టైల్‌ స్విమ్మింగ్‌లో అతడికి 100వ ర్యాంక్‌. గతంలో పాల్గొన్న యూత్‌ ఒలింపిక్స్‌లో 8వ స్థానం.. ఇక వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌ల్లో ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించలేదు.. కానీ, ఈ 18 ఏళ్ల కుర్రాడు 2020 ఒలింపిక్స్‌లో

Published : 26 Jul 2021 02:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: 400 మీటర్ల ఫ్రీ స్టైల్‌ స్విమ్మింగ్‌లో 2019లో విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో అతడిది 100వ స్థానం. గతంలో పాల్గొన్న యూత్‌ ఒలింపిక్స్‌లో 8వ స్థానం.. ఇక వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌కు అర్హత  కూడా సాధించలేదు.. కానీ, ఈ 18 ఏళ్ల కుర్రాడు 2021 టోక్యో ఒలింపిక్స్‌లో మొదటి సారి పాల్గొని అంతర్జాతీయ పతకాల పట్టికను ఒలింపిక్‌ స్వర్ణంతో మొదలుపెట్టాడు. అతడే తునీషియాకు చెందిన అహ్మద్‌ అయూబ్‌ హఫ్నాయ్‌..!

టోక్యోలో నేడు జరిగిన 400 మీటర్ల స్విమ్మింగ్‌ పోటీలో విశ్లేషకుల అంచనాలను తారుమారు చేస్తూ తునీషియాకు చెందిన హఫ్నాయ్‌ స్వర్ణపతకం సాధించాడు. క్వాలిఫైయింగ్‌ రౌండ్‌లో ఆకట్టుకోలేకపోయిన హఫ్నాయ్‌.. ఫైనల్లో విజృంభించాడు. కేవలం 3:43.36 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకొన్నాడు. హాట్‌ ఫేవరెట్‌గా భావించిన ఆస్ట్రేలియా స్విమ్మర్‌ జాక్‌ మెక్లౌగ్లిన్‌ను ద్వితీయ స్థానానికి నెట్టేశాడు. అమెరికా స్విమ్మర్‌ కైరాన్‌ స్మిత్‌కు కాంస్య పతకం లభించింది. ‘‘నన్ను నేను నమ్మలేకపోతున్నాను. నా కల సాకారమైంది. నా జీవితంలో ఇదే అత్యుత్తమ రేసు. నీటిలో నిన్నటి కంటే నేడు చాలా మెరుగ్గా ఉన్నాను’’ అని హాఫ్నాయ్‌ పేర్కొన్నాడు.

ఆస్ట్రేలియా స్విమ్మర్‌ మెక్లౌగ్లిన్‌ తొలి 200 మీటర్ల వరకు ఆధిపత్యం చూపించినా.. చివర్లో హఫ్నాయ్‌ పుంజుకొని లక్ష్యాన్ని చేరుకొన్నాడు. హఫ్నాయ్‌ తండ్రి తునీషియా బాస్కెట్‌  బాల్‌ క్రీడాకారుడు. ఒలింపిక్స్‌ చరిత్రలో తునీషియాకు లభించిన ఐదో స్వర్ణపతకం ఇది. ఆ దేశానికి స్విమ్మంగ్‌లో లభించిన మూడో స్వర్ణం. హఫ్నాయ్‌కు మాత్రం తొలి అంతర్జాతీయ పతకం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు