Rohit-Sunil Gavaskar: మీ ఆంతర్యం ఏంటి..? బ్రాడ్‌కాస్టర్‌పై సునీల్ గావస్కర్‌ తీవ్ర ఆగ్రహం!

టీ20 ప్రపంచకప్‌లో భారత్ సెమీస్‌కు దూసుకుపోయింది. సూపర్-8 పోరులో ఆసీస్‌పై 24 పరుగుల తేడాతో విజయం సాధించడంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ కీలక పాత్ర పోషించింది.

Published : 26 Jun 2024 16:10 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాపై భారీ ఇన్నింగ్స్‌ ఆడిన భారత కెప్టెన్ రోహిత్ శర్మపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. కేవలం 41 బంతుల్లోనే 92 పరుగులు చేసి స్టార్క్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయి పెవిలియన్‌కు చేరాడు. ఆ సమయంలో టీ20 ప్రపంచకప్‌ అధికారిక బ్రాడ్ కాస్టర్‌ స్టార్ స్పోర్ట్స్‌ ఓ గ్రాఫిక్‌ను పదేపదే చూపిస్తూ.. ఎడమచేతి వాటం పేసర్ల బౌలింగ్‌లో రోహిత్ ఔటైనట్లు పేర్కొంది. అదే సమయంలో వ్యాఖ్యాతగా ఉన్న భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాడు. అంతకుముందు మిచెల్ స్టార్క్‌ బౌలింగ్‌లోనే 29 పరుగులు రాబట్టినట్లు గుర్తు చేశాడు.

‘‘ రోహిత్ ఎడమచేతివాటం బౌలర్‌కు వికెట్ ఇచ్చాడు. అంటే మీ ఉద్దేశం ప్రకారం తదుపరి మ్యాచ్‌ సందర్భంగా లెఫ్ట్‌హ్యాండర్‌ పేసర్‌కు అతడి బలహీనతను చెబుదామనుకుంటున్నారా?’’ అని గావస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. ఆ పక్కనే ఉన్న ఆసీస్‌ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ మధ్యలో కలుగజేసుకొని.. ఆ గ్రాఫిక్‌ సరైందే అన్నట్లు వివరణ ఇచ్చాడు. ‘‘ఇప్పుడు చాలామంది ఎడమచేతివాటం పేసర్లు ఉన్నారు. వారి నుంచి భారత ఓపెనర్‌కు సవాల్‌ తప్పడం లేదు’’ అని వ్యాఖ్యానించాడు. వెంటనే.. ఇదేమీ పెద్ద సమస్య కాదని గావస్కర్ కొట్టిపడేశాడు. 

‘‘ఇప్పుడు మీరు చూస్తున్నదాంట్లో నాకేమీ సమస్య కనిపించడం లేదు. బంతి స్వింగ్‌ అవుతున్నప్పుడు దూకుడుగా ఆడే క్రమంలో వికెట్ కోల్పోవడం అత్యంత సాధారణ విషయం. ఆ సమయంలో ఎల్బీ లేదా బౌల్డ్‌ అవుతారు. రోహిత్‌ అంతకుముందు లెఫ్టార్మ్‌ బౌలర్ బౌలింగ్‌లోనూ దంచికొట్టిన విషయం మరిచిపోకూడదు’’ అని సునీల్ గావస్కర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చాడు. గురువారం రాత్రి 8 గంటలకు ఇంగ్లాండ్‌తో రెండో సెమీస్‌లో తలపడనుంది. గయానా వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. అయితే, వర్షం ముప్పు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు