ఆ విజయానికి 20 ఏళ్లు

2001 మార్చి 11.. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో కొత్త ఛాంపియన్‌ అవతరించిన రోజు. ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో త్రివర్ణ పతాకం రెపరెపలాడిన రోజు...

Published : 13 Mar 2021 07:42 IST

హైదరాబాద్‌: 2001 మార్చి 11.. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో కొత్త ఛాంపియన్‌ అవతరించిన రోజు. ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో త్రివర్ణ పతాకం రెపరెపలాడిన రోజు. చైనా ఆధిపత్యానికి గండికొట్టి.. దేశంలో ఆటకు ఊపు తెచ్చిన ఆ ఛాంపియన్‌ మరెవరో కాదు.. జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌. కోల్‌కతాలో టీమ్‌ఇండియా చరిత్రాత్మక టెస్టు మ్యాచ్‌ ప్రారంభమైన రోజే.. బర్మింగ్‌హామ్‌లో గోపీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో గోపీ 15-12, 15-6తో చెన్‌ హాంగ్‌ (చైనా)ను చిత్తుచేసి ఆల్‌ ఇంగ్లాండ్‌ టైటిల్‌ కైవసం చేసుకున్నాడు. ఆపై కోచ్‌గా మారి సైనా, సింధు, శ్రీకాంత్, సాయిప్రణీత్, కశ్యప్‌ లాంటి ఎందరో ఛాంపియన్లను అందించాడు. ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్, ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో పతకాలు గోపీ శిష్యుల సొంతమయ్యాయి. తన 20 ఏళ్ల ప్రస్థానాన్ని ఈ స్టార్‌ కోచ్‌ వినూత్నంగా జరుపుకున్నాడు. శుక్రవారం తన అకాడమీలో తల్లిదండ్రులు, అథ్లెటిక్స్‌ క్రీడాకారులతో ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ కార్యక్రమంలో అథ్లెటిక్స్‌ కోచ్‌ నాగపురి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని